ఎన్నికల్లో ఓడిపోవడం ఏంటో గానీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్యాప్ లేకుండా దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. వాళ్ల ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన బాగోతాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వృధా చేసిన ప్రజా ధనాన్ని రూపాయితో సహా లెక్కగడుతున్నారు టీడీపీ మంత్రులు. టూర్ల పేరుతో జగన్ కోట్ల రూపాయలు వృధా చేశాడన్న మంత్రి లోకేష్.. ఇప్పుడు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిని టార్గెట్ చేశారు. కేవలం లెమన్ వాటర్ కోసం 28 లక్షలు ఖర్చైనట్టు లెక్కల్లో రాశారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
టిడ్కో గృహాల ప్రారంభోత్సవ సభ అంటూ ఒక ఫేక్ సభ పెట్టి.. నిమ్మకాయ నీళ్లు సరఫరా అని 28 లక్షల రూపాయలు కొట్టేసారని చెప్పారు లోకేష్. టిడ్కో ఇల్లు పేదవాళ్లకు ఇచ్చేందుకు కూడా గుడివాడ గడ్డం గ్యాంగ్ 3 నుంచి 4 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. గుడివాడ మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసి 70 లక్షలు బిల్లులు చేసుకోవడానికి గడ్డం గ్యాంగ్ విశ్వప్రయత్నాలు చేసిందని చెప్పారు. ఐదేళ్ల జగన్ పాలనలో గడ్డం గ్యాంగ్ గుడివాడ నియోజకవర్గాన్ని గుల్ల చేసింది అని చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనని.. అసలు నిజాలు ఇంకా చాలా ఉన్నాయంటూ చెప్పారు.
ఇక వైసీపీ హమాంలో మాజీ మంత్రి రోజా, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తమ అనుచరులకు తిరుమలలో వీఐపీ దర్శనాలు ఇప్పించడం కూడా హాట్ టాపిక్‌గా మారింది. తమ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో అప్పుడు ఎవరూ ఈ ఇష్యూ గురించి మాట్లాడలేదు. లక్షల మంది భక్తులు, వీఐపీలను ఆపి మరీ తమ వాళ్లకు వెంటనే దర్శనం జరిగేలా రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారని.. టీటీడీ అధికారులు కూడా అదే చేశారనేది టీడీపీ వాదన. ఈ ఇష్యూ ఇంకా హాట్ హాట్‌గా ఉండగానే ఇప్పుడు కొడాలి నాని వ్యవహారం కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఇలా అప్పుడు కీలకంగా వ్యవహరించి ప్రతీ ఒక్కరి లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటికి లాగుతోంది టీడీపీ. భవిష్యత్తులో ఇలా ఇంకా ఎంత మంది బాగోతాలు చూడాల్సి వస్తోందోనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.