AP Capital : విడిపోయిన 68 ఏళ్ల బంధం.. ఇప్పుడు ఏపీ నిజంగా రాజధాని లేని రాష్ట్రం

68 ఏళ్ల సుదీర్ఘ బంధం నేటితో విడిపోయింది. 10 ఏళ్లు ఏపీ, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ ఇప్పుడు కేవలం తెలంగాణకు మాత్రమే రాజధాని.

68 ఏళ్ల సుదీర్ఘ బంధం నేటితో విడిపోయింది. 10 ఏళ్లు ఏపీ, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ ఇప్పుడు కేవలం తెలంగాణకు మాత్రమే రాజధాని. 1956లో ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్‌ (Hyderabad) ను రాజధానిగా ఏర్పాటు చేశారు. కానీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు సమయంలో హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా మారిపోయింది. ఏపీకి రాజధాని (AP Capital) లేని కారణంగా హైదరాబాద్‌ను 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని నిర్ణయించారు. అప్పటి నుంచి హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉంటూ వచ్చింది. కారణాలు ఏవైనా ఏపీ (AP) మాత్రం ఈ పదేళ్లలో రాజధాని నిర్మించుకోలేదు.

నేటితో తెలంగాణ ఏర్పడి పదేళ్లు ముగియడంతో ఇప్పుడు ఏపీకి ఉమ్మడి రాజధాని (AP Joint Capital) కూడా లేదు. ఇప్పుడు నిజంగా ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. టీడీపీ (TDP) హయాంలో అమరావతిని రాజధానిగా చంద్రబాబు ప్రకటించారు. కానీ ఆ తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత.. జగన్‌ మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకువచ్చారు. అమరావతితో పాటు విశాఖ, కర్నూలును కూడా రాజధానిగా చేస్తామని ప్రకటించారు. కానీ అది ఇంకా ప్రాసెస్‌లోనే ఉంది.

ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో (AP elections) ఏ పార్టీ గెలుస్తుంది అనేదానిపై ఏపీ రాజధాని ఏది అనే విషయం ఆధారపడి ఉంది. నిజానికి ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కొత్త రాజధాని నిర్మాణం అంత సులభం కాదు. త్వరగా అయ్యే పని కూడా కాదు. ఈ గ్యాప్‌లో 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని గడువు కూడా ముగిసింది. దీంతో ఏపీలో అధికారం చేపట్టే పార్టీ హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా మరి కొన్ని సంవత్సరాలు కొనసాగించాలని అడిగే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. జూన్‌ 4 తరువాత అధికారం విషయంలో రాజధాని విషయంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి.