కేంద్రంలో మరోసారి NDA అధికారంలోకి వస్తుందని చాలా సర్వేల్లో వెల్లడైంది. అయితే ఏపీలో కూటమి తరపున పోటీ చేసిన 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారో తెలీదు కానీ… మంత్రులుగా ఎవరెవరికి ఛాన్స్ ఉంటుందో పేర్లు వైరల్ అవుతున్నాయి. అందులో ప్రముఖంగా వినిపించే పేరు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
ఏపీలో మొత్తం పాతిక లోక్ సభ స్థానాలు ఉంటే… టీడీపీ 17 చోట్ల పోటీ చేసింది. జనసేన రెండింటిలో… మిగిలిన స్థానాల్లో బీజేపీ తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. ఈ పాతిక మందిలో ఎవరు గెలుస్తారు… కేంద్ర మంత్రులుగా ఎవరికి ఛాన్స్ ఉంటుంది అన్న దానిపై కూటమి పార్టీ నేతల్లో చర్చ మొదలైంది. ఏపీలో తమకు కీలక భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ కి హైప్రియారిటీ ఇస్తోంది బీజేపీ. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే… పవన్ కి డిప్యూటీ సీఎం లేదంటే కేంద్రంలో ఏదో ఒక సహాయ మంత్రి పదవి ఇవ్వాలని ఢిల్లీ బీజేపీ వర్గాలు డిసైడ్ అయ్యాయని సమాచారం.
ఏపీలో కాషాయం పార్టీ ఎదగడానికి పవన్ ను వాడుకోవాలన్నది ఢిల్లీ పెద్దల ఆలోచన. అయితే నాగబాబును రాజ్యసభకు పంపి… ఆయనకు మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు. ఏపీలో బీజేపీ నుంచి కొత్తపల్లి గీత, సీఎం రమేష, పురంధేశ్వరి, శ్రీనివాస్ వర్మ, కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. వీళ్ళల్లో పురంధేశ్వరి గెలిస్తే ఆమెకు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గెలిచినా ఆయనకూ ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. జనసేనలో తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, వల్లభనేని బాలశౌరి పోటీ చేశారు. వీళ్ళల్లో సీనియర్ అయిన బాలశౌరికి అవకాశముంది. ఇక టీడీపీలో కింజారపు రామ్మోహన్ నాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఆయన లాబీయింగ్ కూడా చేస్తున్నట్టు సమాచారం. వీళ్ళు కాకుండా లావు శ్రీకృష్ణ దేవరాలు, బీకే పార్థసారధి కూడా టీడీపీ కోటాలో కేంద్ర మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీలో మాత్రం ఈసారి సెంట్రల్ కేబినెట్ మినిస్టర్ పదవిని వదులుకోడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అందుకే ఎవరికి వారే పైరవీలు మొదలుపెట్టినట్టు సమాచారం.