సత్తెనపల్లిలో ఈసారి టఫ్ ఫైట్ నడుస్తోంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ టార్గెట్ గా నిత్యం విమర్శలు చేసే మంత్రి అంబటి రాంబాబు పోటీ చేస్తున్న నియోజకవర్గం ఇదే. మరో సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా గట్టి పోటీ ఇస్తున్నారు. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అంబటి రాంబాబు ఆశలు పెట్టుకున్నారు. అదే టైమ్ లో ఆయనపై వస్తున్న అవినీతి ఆరోపణలు, సొంత అల్లుడే… మా మామ నీచుడు అంటూ ఆరోపణలు చేయడం మైనస్ గా మారాయి. కాపు, రెడ్డి, కమ్మ సామాజిక ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి వర్సెస్ కన్నా పవర్ ఫైట్ ఎలా ఉండబోతోందో చూద్దాం.
ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది సత్తెనపల్లి. స్వాతంత్ర్య సమరయోధులు, సంస్కరణ ఉద్యమకారులకు పుట్టినిల్లు. గాంధేయవాది వావిలాల గోపాల కృష్ణయ్య, ఆమంచి నరసింహారావు లాంటి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఇక్కడివారే. మాజీ సీఎం భవనం వెంకట్రామ్ కూడా సత్తెనపల్లి నియోజకవర్గంలోనే పుట్టారు. వావిలాల అయితే 1952 నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో కోడెల శివప్రసాదరావు ఎమ్మెల్యేగా గెలవగా… 2019లో ఆయన్ని ఓడించి వైసీపీ సీనియర్ లీడర్ అంబటి రాంబాబు ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత జగన్ కేబినెట్ లో మంత్రిగా పదవి సంపాదించారు.
సత్తెనపల్లిలో మొత్తం 2లక్షల 42 వేల మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళల్లో మహిళా ఓటర్ల సంఖ్య కాస్త ఎక్కువ. సత్తెనపల్లి నియోజకవర్గంలో సత్తెనపల్లితో పాటు నకరికల్లు, ముప్పాళ్ళ మండలాలు ఉన్నాయి. సామాజిక వర్గాలను చూసుకుంటే… కమ్మ వర్గం వాళ్ళు 32 వేల మంది ఉంటే… ముస్లింలు 28 వేలు, మాదిగలు 27 వేలు, కాపులు 19 వేలు, రెడ్లు 18 వేలు, యాదవులు 15 వేలు కీలంగా ఉన్నారు. అయితే కమ్మ, రెడ్డి, కాపు కులాల మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది. ఈ మూడు సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎన్నికల్లో పోటీకి నిలబడుతుంటారు.
టీడీపీ పుట్టిన తర్వాత 9సార్లు ఎన్నికలు జరిగితే… టీడీపీ, కాంగ్రెస్ 3 సార్లు చొప్పున, సీపీఎం, వైఎస్సార్ సీపీ ఒక్కోసారి గెలిచాయి. మంత్రి అంబటి రాంబాబు ఈసారి ఎన్నికల్లో ఎదురీదుతున్నట్టు తెలుస్తోంది. ఆయనపై సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. ప్రతి మండలంలో తన సొంత మనుషులను పెట్టుకొని… ఎప్పటి నుంచో ఉన్న ద్వితీయశ్రేణి వైసీపీ నేతలను పక్కనబెట్టారని అంటారు. అంబటిపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. సంక్రాంతి సంబరాలకు డబ్బులు వసూలు చేశారని చెబుతారు. అలాగే సత్తెనపల్లిలో వసూళ్ళ దందాతో ఆర్యవైశ్యులు వైసీపీకి దూరమయ్యారని అంటారు. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ పైనా అనుచిత వాఖ్యలు చేస్తుంటారు అంబటి రాంబాబు… పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తుండటంతో… తన సొంత కాపు సామాజిక వర్గంలోని కొందరు అంబటిపై గుర్రుగా ఉన్నారు. కొందరు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు టీడీపీలో చేరడం అంబటికి మైనస్. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయంటారు. జలవనరుల మంత్రి అయి ఉండి కూడా… సాగర్ కాలువు రిపేర్లు చేయించకపోవడంతో రైతుల్లో కోపం ఉంది. మంత్రిగా అర్థ, అంగబలం ఎక్కువగా ఉండటం… వైసీపీ అధిష్టానం అండదండలు అంబటి రాంబాబుకు ప్లస్ పాయింట్స్.
కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి నియోజకవర్గానికి స్థానికేతరుడే అయినా… ఇక్కడి వారితో సంబంధాలు ఉన్నాయి. ఆయన టీడీపీలో చేరిన వెంటనే నియోజకవర్గ ఇంఛార్జ్ గా చంద్రబాబు ప్రకటించారు. అప్పటి నుంచి సత్తెనపల్లిలోనే విస్తృతంగా తిరుగుతున్నారు. టీడీపీలో అన్ని వర్గాలను కలుపుకుపోయారు. వైసీపీలో అసంతృప్తి నేతలను కూడా తెలుగుదేశంలోకి తీసుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత, మంత్రి అంబటి రాంబాబుపై అవినీతి, అక్రమ వసూళ్ళ ఆరోపణలు ఉండటంతో… తనకు కలసి వస్తుందని కన్నా లక్ష్మీనారాయణ భావిస్తున్నారు. అయితే స్థానికేతరుడు కావడం, వైవీ, కోడె వర్గాల్లో కొంత అసంతృప్తి ఉండటంతో… కన్నాకు కొంత డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మంత్రి అంబటి రాంబాబుకి టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గట్టి పోటీ ఇస్తున్నారు. ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే. కమ్మ, రెడ్డి ఓట్లను రెండు పార్టీలు పంచుకుంటే… మిగిలిన కులాల ఓట్లు సత్తెనపల్లి అభ్యర్థి గెలుపు ఓటములను డిసైడ్ చేయనున్నాయి.