ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార పార్టీ వైసీపీకి టీడీపీ-జనసేన కూటమి దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతోంది. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను జనసేనలోకి చేర్చుకోవాలని నిర్ణయించింది. అందుకు ముద్రగడతో పాటు ఆయన కొడుకు గిరిబాబు సిద్ధంగా ఉన్నట్టు తేలింది. వైసీపీలో జాయిన్ అవడం తమకు ఇంట్రెస్ట్ లేదని ఖరాకండీగా చెప్పేశారు గిరిబాబు. రెండు, మూడు రోజుల్లో ముద్రగడతో పవన్ కల్యాణ్ భేటీ అవుతున్నారు. ఈ పరిణామాలపై వైసీపీ మంత్రులు, నేతలు షాక్ లో ఉన్నారు.
ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం. కాపులకు రిజర్వేషన్లు దక్కాలి.. రాజ్యాధికారంలో వాటా కావాలంటూ కొన్నేళ్ళుగా పోరాటం చేస్తున్నారు. గతంలో టీడీపీ మోసం చేసిందని కోపంగా ఉన్నారాయన. అయితే ఇటీవల వైసీపీతో మంతనాలు జరిగినా.. అధిష్టానం తమకు అంతగా ప్రియారిటీ ఇవ్వట్లేదని భావిస్తున్నారు. అందుకే కాపులంతా కలసి పనిచేయాలన్న జనసేనాని పవన్ కల్యాణ్ పిలుపుతో గ్లాసు పార్టీలో జాయిన్ అవ్వడానికి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ముద్రగడను కలసి పార్టీలోకి ఆహ్వానించనున్నారు పవన్ కల్యాణ్. ఈనెల 14 లేదా 15లో జనసేనలో ఆయన జాయిన్ అయ్యే అవకాశాలున్నాయి. కాకినాడ ఎంపీగా పోటీచేయమని జనసేన కోరనున్నట్టు తెలిసింది. ముద్రగడ పద్మనాభం కొడుకు గిరిబాబు కూడా ఈ చేరికపై క్లారిటీ ఇచ్చారు. తాము జనసేన లేదా టీడీపీల్లో ఏ పార్టీలోకి అయినా వెళ్ళే అవకాశం ఉందని చెప్పారు. వైఎస్సార్ పార్టీలోకి వెళ్ళడానికి నాన్నకు ఇంట్రెస్ట్ లేదన్నారు గిరిబాబు. ముద్రగడతో పాటు గిరిబాబు కూడా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. కాకినాడ పార్లమెంట్ సీటును ముద్రగడకు ఇస్తే.. ప్రత్తిపాడు, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడో ఒకచోట గిరిబాబు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి జనసేన లేదా టీడీపీలో జాయిన్ అవ్వడం ఖాయమనీ.. ఖచ్చితంగా పోటీలో ఉంటామని చెప్పారు ముద్రగడ కొడుకు గిరిబాబు.
కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభంతో.. టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ భేటీ అయ్యారు. వ్యక్తిగత పనుల మీద కలిసినట్టు చెబుతున్నా.. వీళ్ళ మధ్య జాయినింగ్స్ పై చర్చ జరిగినట్టు సమాచారం. అంతకుముందు బుధవారం నాడు జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కూడా ముద్రగడతో భేటీ అయ్యారు. కాపులంతా కలసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ రాసిన లేఖను ఆయన దగ్గర ప్రస్తావించారు. అందుకు పద్మనాభం కూడా ఒకే చెప్పారనీ… పవన్ తో కలవడానికి సిద్ధంగా ఉన్నట్టు కాపునేతలు చెబుతున్నారు.
మొన్నటిదాకా ముద్రగడ వైసీపీలో చేరడంపై డిస్కషన్స్ జరిగాయి. అయితే వైసీపీ అధిష్టానం నుంచి అనుకూల వాతావరణం లేదని ముద్రగడ అభిప్రాయపడుతున్నారు. సీట్లు ప్రకటించినప్పుడు తమను పరిగణనలోకి తీసుకోలేదని ఆయన అనుచరులతో చెబుతున్నారు. ఈలోగా కాపులంతా కలిసి పోరాడాలని పవన్ లెటర్ రాయడం, తర్వాత పార్టీ నేతలు వచ్చి కలవడంతో.. ముద్రగడ జనసేనలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ తమను మోసం చేసిందని గతంలో ఆరోపణలు చేసినందున.. ఆ పార్టీలో కాకుండా జనసేనలో చేరడమే బెటర్ అని కొందరు కాపునేతలు అభిప్రాయపడుతున్నారు. ముద్రగడ సడన్ డెసిషన్ తో ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 15 శాతం ఓటింగ్ ఉన్న కాపు సామాజిక వర్గం డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటోంది. 2019 ఎన్నికల్లో కాపు ఓటర్లలో మెజార్టీ శాతం వైసీపీకి అనుకూలంగా వేశారు. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపితే… టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.