ఆరా మస్తాన్ తెలుగు రాష్ట్రాల్లోని మీడియాకి, రాజకీయాలపై ఆసక్తి ఉన్నవాళ్ళకి బాగా తెలిసిన సెఫాలజిస్ట్. గడచిన పదేళ్లుగా ఎన్నికల్లో సర్వేలు చేస్తూ… తన సొంత బ్రాండ్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు ఆరా వస్తాన్. 2023 నవంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో BRS ఓడిపోతుందని ముందే చెప్పడం ద్వారా ఆరా మస్తాన్ పాపులర్ అయ్యారు.
గుంటూరుకు చెందిన ఆరా మస్తాన్ తరచూ… హిందూ దైవిక కార్యక్రమాలు నిర్వహిస్తూ…అలాగే సర్వేలపై ఇంటర్వ్యూలు ఇస్తూ… మీడియాలో పాపులారిటీ సంపాదించారు. ఆ మధ్య ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. నిజానికి ఆరా మస్తాన్ కి ఎన్నికల సర్వేలు చేసేటంత సామాగ్రి గానీ, వ్యవస్థగానీ, సిబ్బంది గానీ లేరనీ… జనం దగ్గరికి వెళ్లి గుండుగుత్తగా అభిప్రాయాలు సేకరించి సర్వేగా చెప్తారని విమర్శ కూడా ఉంది. సైంటిఫిక్ గా సర్వే చేసే సత్తా.. ఆరా మస్తాన్ కి లేదంటారు. ఒకటి రెండుసార్లు ఆయన చెప్పిన ఎగ్జిట్ పోల్స్ అనుకోకుండా నిజమవడంతో రావాల్సిన దాని కన్నా ఆరా మస్తాన్ కి ఎక్కువ పాపులారిటీ వచ్చిందంటారు. మీడియాలో ఒక వర్గం.. మస్తాన్ ఇచ్చే గిఫ్ట్ లకు, అడ్వర్టైజ్మెంట్లకు, స్పాన్సర్ షిప్పులకు ఆశపడి ఆయన్ని ఒక మేధావిగా ప్రాజెక్ట్ చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఎన్నికలు రాగానే ఆరా మస్తాన్ పేరు బాగా వినిపిస్తుంది.
ఇప్పుడు మరోసారి ఆయన వివాదాల్లో చిక్కుకున్నారు. జూన్ 1న ఆయన ఒక శాటిలైట్ ఛానల్ లో కూర్చొని… ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలవబోతోందనీ… ఆ పార్టీకి నూట పాతిక సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వే ఇవ్వబోతున్నారు. ఎట్టి పరిస్థితిలో దాన్ని నమ్మవద్దని సోషల్ మీడియాలో, వాట్సాప్ లో ప్రచారం జరుగుతోంది. మస్తాన్ సర్వేని నమ్మి… బెట్టింగులు పెడితే దారుణంగా మోసపోతారని, ఆత్మహత్యలు చేసుకోక తప్పదని ఒక వర్గం బలంగా ప్రచారం చేస్తోంది. నిజానికి ఎన్నికల ముందే వైసీపీ, ఆరా మస్తాన్ నీ ఆ పార్టీ అనుకూల ఛానల్ లో కూర్చోబెట్టి… వైసీపీకి 125 సీట్లు వస్తాయని సర్వే ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నించింది. కానీ ఆరా మస్తాన్ ఒప్పుకోలేదనీ, న్యాయపరమైన చిక్కులు, ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకునే అవకాశం ఉండటంతో ఆ ప్రయత్నం విరమించుకున్నట్లు సమాచారం. ఇప్పుడు జూన్ 1న స్టూడియోలో కూర్చొని… వైసీపీ 125 సీట్లతో గెలవబోతుందంటూ ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ ఇవ్వబోతున్నారట.
దీని వెనక వైసీపీకి డైరెక్ట్ గా ఉపయోగం లేదు. జనాన్ని ప్రభావితం చేసే అవకాశం కూడా లేదు. కానీ ఆ పార్టీ లీడర్లు నిర్వహించే బెట్టింగ్ కి, అలాగే పోలింగ్ రోజు ఏజెంట్లను సమీకరించడానికి ఉపయోగపడుతుందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ సర్వే నమ్మి… బెట్టింగులు పెట్టవద్దంటూ టీడీపీ సోషల్ మీడియాలోనూ, వాట్సాప్ లోనూ వైరల్ చేస్తున్నారు. అయితే దీనంతటికీ వెనక ఒక పెద్ద కథ నడిచినట్లు సమాచారం. ఆరా మస్తాన్ టీడీపీకి ఎన్నికల సర్వే చేయడానికి ముందు ఒప్పందం కుదుర్చుకున్నారట. దాదాపు 95 నియోజకవర్గాల్లో సర్వే పూర్తి చేశాక, కూటమి గెలవడం ఖాయమని గుర్తించి…. ఆరా మస్తాన్ తనకు గుంటూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చంద్రబాబు దగ్గర డిమాండ్ పెట్టినట్లు టిడిపి వర్గాలు చెప్తున్నాయి. చంద్రబాబు నిరాకరించడంతో అప్పటి వరకు చేసిన సర్వే రిపోర్ట్ పట్టుకొని వైసిపి నేతల దగ్గర చేరారట. ఆ రిపోర్ట్ ని బయటపెట్టి దాని ద్వారా నియోజకవర్గాల్లో పరిస్థితిని వైసిపికి అనుకూలంగా చక్కదిద్దే పని చేపట్టారని టిడిపి సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. దీనికి భిన్నమైన కథనం మరొకటి వినిపిస్తోంది.
చంద్రబాబు ఆరా మస్తాన్ కి సర్వే కోసం ఇస్తానన్నా డబ్బు ఎగ్గొట్టారని, దాంతో కోపం వచ్చి వైసిపి నేతల దగ్గరికి వెళ్లి ఆ సర్వేని చూపెట్టి… ఆ పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితి చక్కదిద్దేందుకు తోడ్పడ్డారని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఎగ్జిట్ పోల్ సర్వేలు తీవ్ర విమర్శలకు దారి తీసాయి. ఆరా మస్తాన్ ను వైసీపీకి చెందిన బెట్టింగ్ మాఫియా 15 కోట్లకు బేరం ఆడుకొని… ఆయన్ని ఒక శాటిలైట్ ఛానల్ లో కూర్చోబెట్టి వైసీపీ 125 సీట్లతో గెలవబోతున్నట్లు చెప్పిస్తారనీ.. అవి నమ్మొద్దని టిడిపి అనుకూల బెట్టింగ్ మాఫియా ప్రచారం చేస్తోంది. అంతేకాదు ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ సర్వే కూడా ఇలాగే వైసీపీ 110 సీట్లతో గెలవబోతుందని చెప్పబోతోందని కూడా ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా బెట్టింగుల కోసం చేస్తున్న సర్వేగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆరా మస్తాన్, ఆత్మసాక్షి మూర్తి ఇద్దరూ వైసిపి అనుకూల ఎగ్జిట్ పోల్ సర్వేలు ఇవ్వబోతున్నారని… అవకాశం లేకపోయినా కేవలం బెట్టింగ్ ల కోసం ఇదంతా చేస్తున్నారని… సోషల్ మీడియాలో టిడిపి వర్గాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. మొత్తం మీద ఎగ్జిట్ పోల్ సర్వేలు ఇలా వివాదాస్పదంగా మారాయి.