YSRCP: వైసీపీలో నిరసన స్వరాలు వరుసగా పెరుగుతున్నాయి. కోరుకున్న నియోజకవర్గంలో అవకాశం దొరకని నేతలు.. వైసీపీ పెద్దలు, పార్టీలోని కీలక నేతలపై విమర్శలు చేస్తున్నారు. తాజగా చిత్తూరు జిల్లా సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కూడా పార్టీ పెద్దలపై విమర్శలు చేశారు. వైసీపీలో దళితులకు గౌరవం లేదన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కూడా ఆదిమూలం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను ఇటీవల తిరుపతి ఎంపీ స్థానానికి ఇంఛార్జ్‌గా ప్రకటించారు.
Guntur Politics: గుంటూరుకు ఏమైంది.. కోడెల, రాయపాటి వారసులు ఎందుకు వెనకబడ్డారు..?
అయితే, ఎంపీగా పోటీ చేసేందుకు ఆదిమూలం సిద్ధంగా లేరు. మంత్రి పెద్దిరెడ్డి కారణంగానే తనకు ఎమ్మెల్యే సీటు దక్కలేదని, అందుకే ఎంపీగా తనను తిరుపతి పంపిస్తున్నారని ఆదిమూలం విమర్శించారు. వైసీపీలో ఎస్సీలకు సరైన గౌరవం లేదన్నారు. తన నియోజకవర్గమైన సత్యవేడు సమావేశాన్ని మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో ఎలా నిర్వహిస్తారని ఆదిమూలం ప్రశ్నించారు. తనకు ఇష్టం లేకపోయినా తిరుపతి ఎంపీ స్థానానికి ఇన్‌ఛార్జిగా తనను ప్రకటించారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మంత్రి రోజా స్థానాల్లో కూడా ఇలాగే ప్రకటిస్తారా..? అంటూ ప్రశ్నించారు. ఇటీవలే ఆదిమూలం సీఎంను కలవగా.. తిరుపతి ఎంపీ స్థానానికి పోటీ చేయాలని సూచించారు. అయితే, తనను ఎమ్మెల్యేగా ఎందుకు తప్పిస్తున్నారని, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడానికి రెండు కారణాలు చెప్పాలని అడిగినట్లు ఆదిమూలం తెలిపారు. సత్యవేడులో మంత్రి పెద్దిరెడ్డి.. ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని, అయితే, వాటిని పెద్దిరెడ్డి తనపై నెట్టేసి, తనను సత్యవేడు తప్పించారని ఆదిమూలం ఆరోపించారు.
గతంలో మోటార్ సైకిల్‌పై తిరిగిన పెద్దిరెడ్డికి.. ఇప్పుడు ఇంత ఆస్తి ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, దళితులకు మాత్రం స్వేచ్ఛ లేదని ఆదిమూలం ఆవేదన వ్యక్తం చేశారు. కొంతకాలంగా వైసీపీలోని దళిత నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల మడకశిర వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. దళితులు ఎంత పెద్ద పదవిలో ఉన్నా అవమానాలు తప్పడం లేదనిన్నారు. ఇప్పుడు ఆయనకు ఆదిమూలం గొంతు కలపడం సంచలనంగా మారింది.