MP Kesineni Nani Cadre : అయ్యో తిట్టి తప్పు చేశాం.. అయోమయంలో కేశినేని క్యాడర్.. !

విజయవాడ ఎంపీ కేశినేని నానికి పొమ్మనలేక పొగబెట్టింది టీడీపీ అధిష్టానం. దాంతో ఆయన ఇప్పుడు కొత్త పార్టీని వెతుక్కునే పనిలో ఉన్నారు. కానీ టీడీపీలోనే కొనసాగుతున్న ఆయన కేడర్ మాత్రం అయోమయంలో పడ్డారు. గతంలో నాని అండ చూసుకొని.. పార్టీ ఇంఛార్జుల మీద రెచ్చిపోయిన వాళ్ళంతా ఇప్పుడేం చేయాలని అయోమయంలో ఉన్నారు.

విజయవాడ ఎంపీ కేశినేని నానికి పొమ్మనలేక పొగబెట్టింది టీడీపీ అధిష్టానం. దాంతో ఆయన ఇప్పుడు కొత్త పార్టీని వెతుక్కునే పనిలో ఉన్నారు. కానీ టీడీపీలోనే కొనసాగుతున్న ఆయన కేడర్ మాత్రం అయోమయంలో పడ్డారు. గతంలో నాని అండ చూసుకొని.. పార్టీ ఇంఛార్జుల మీద రెచ్చిపోయిన వాళ్ళంతా ఇప్పుడేం చేయాలని అయోమయంలో ఉన్నారు.

బెజవాడ టీడీపీ రెబల్ ఎంపీ కేశినేని నాని ఎపిసోడ్‌కి ఎండ్ కార్డ్ వేసింది పార్టీ అధిష్టానం. రెండేళ్లుగా పార్టీలో కేశినేని వర్సెస్ బుద్దా టీం అన్నట్టుగా నడుస్తోంది రాజకీయం. దీంతో ఇప్పుడు అధిష్టానం పూర్తి క్లారిటీతో నానిని పక్కన పెట్టి ఆయన సోదరుడు చిన్నికి ప్రాధాన్యత ఇచ్చింది. చిన్ని పార్లమెంటు నియోజకవర్గం పరిధి మొత్తం పర్యటించేలా.. అసెంబ్లీ సెగ్మెంట్స్‌ ఇన్ఛార్జ్‌లు కూడా ఆయనకే సహకరించేలా ఆదేశాలు ఇచ్చి… ఇక నానికి పొమ్మనకుండానే పొగ పెట్టేసింది. అటు ఎంపీ కూడా పార్టీలో ఉంటూనే.. వ్యతిరేక కార్యకలాపాలు చేశారు నాని. పార్టీ నియమించిన ఇన్చార్జిలను కాదని తన వర్గంలోని కొందరిని ఎమ్మెల్యేలుగా చేస్తానంటూ ప్రోత్సహించారు. వాళ్ళు కూడా నాని అండ చూసుకొని పార్టీకి వ్యతిరేకంగా అక్కడి ఇన్చార్జిలను పట్టించుకోకుండా చెలరేగిపోయారు. అలాంటి నేతలంతా ఇపుడు అధిష్టానం ఇచ్చిన షాక్‌తో డైలమాలో పడ్డట్టు తెలిసింది.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్నే తీసుకుంటే.. అక్కడ ఎంపీ నాని కన్వీనర్ గా ఉన్నారు. ఆయనకు వ్యతిరేక వర్గాన్ని నడుపుతున్న బుద్ధా వెంకన్న, నాగుల్‌ మీరాది కూడా పశ్చిమ నియోజకవర్గమే. అయినప్పటికీ పార్టీ అధినాయకత్వం మాత్రం నానినే కన్వీనర్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పరిస్థితిని గమనించకుండా.. నాని పర్సనల్‌ ఇగోలకు పోయి.. అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి బేగ్‌ కొడుకు ఎమ్మెస్ బేగ్‌ని చేస్తానంటూ అవతలి వర్గాన్ని పరోక్షంగా గిల్లి వదిలి పెట్టారు. ఎంఎస్ బేగ్ కూడా ఎంపీ చెప్పినట్టే చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమా ఇన్చార్జిగా ఉన్న మైలవరం నియోజకవర్గంలో నాని తన మనుషులు బొమ్మసాని సుబ్బారావు, గన్నె ప్రసాద్‌ను ప్రోత్సహించారు. గన్నె ప్రసాద్ మైలవరం అంతా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా బొమ్మసాని సుబ్బారావు తనకే టికెట్ ఇవ్వాలంటూ ఆత్మీయ సమావేశాలు కూడా నిర్వహించారు.

తిరువూరులో ఇన్చార్జిగా దేవదత్‌ను పార్టీ నియమిస్తే.. నాని మాత్రం మాజీ ఎమ్మెల్యే స్వామి దాస్ కు అండగా ఉన్నారు. గత ఎన్నికల్లో టికెట్ దక్కని స్వామి దాస్ కూడా నాని అండతో వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందని ఆశించారు. అలాంటి నాయకులందరికీ తాజా ఎపిసోడ్‌తో మైండ్‌ బ్లాంక్‌ అయిందట. కేశినేని తమతో ఉన్నారనే ఒకే ఒక్క కారణంతో ఇన్నాళ్ళు పార్టీ నియమించిన ఇన్చార్జిలకు విరుద్ధంగా కార్యక్రమాలు నిర్వహించామనీ.. ఇప్పుడు నానికే టికెట్ లేదంటే మా పరిస్థితి ఏంటని తెగ టెన్షన్‌ పడిపోతోందట ఆయన వర్గం. పార్టీ నుంచి వెళ్లిపోవాలని కేశినేని ఇప్పటికే నిర్ణయం తీసుకోవటంతో డైలమాలో పడ్డ ఆయన వర్గం నాయకులు ఆపే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలిసింది. ఆయన మాత్రం.. నేను మారి తీరతానని కరాఖండీగా చెప్పేస్తున్నారు.

దీంతో ఇప్పుడు మనం పార్టీలో ఉండాలా? ఆయన వెంటే నడవాలా అంటూ మల్లగుల్లాలు పడుతున్నారట నాని అనుచర నేతలు. తమ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకల్లా మారిందని మధన పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక పశ్చిమ నియోజకవర్గంలో నాని ప్రోత్సహించిన ఎమ్మెస్ బేగ్‌ తిరువూరులో జరిగిన చంద్రబాబు సభకు హాజరై బుద్ధా వెంకన్నతో పాటు ఇతర నేతలను కలిశారు. అక్కడే నాని వర్గంగా ఉన్న మాజీ MLA స్వామి దాస్ సభకు దూరంగా ఉన్నారు. ఇప్పటి వరకు ఏదో రకంగా టీడీపీలోనే ఉన్న రెబెల్‌ లీడర్స్‌ ఇక ఇప్పుడు ఉండాలో.. వెళ్ళిపోవాలో తేల్చుకోవాలన్న పరిస్థితిలో ఉన్నారు. నాని అన్న ఉన్నాడు.. మనకు టిక్కెట్‌ ఇప్పిస్తాడు.. ఇంకేం ఎంచక్కా ఎమ్మెల్యే అయిపోదామని ఇన్నాళ్ళు ఇన్ఛార్జ్‌ల మీద ఇష్టానుసారం చెలరేగిన నాయకులకు ఇప్పుడు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయిందంటున్నాయి పార్టీ వర్గాలు. వాళ్ళ భవిష్యత్‌ ముఖచిత్రం ఏంటో చూడాలన్నది టీడీపీ ఇంటర్నల్‌ టాక్‌.