AMBATI RAYUDU: అంబటి రాయుడు.. అద్భుతమైన క్రికెటర్. ఐతే నిలకడలేనితనమే రాయుడుకు చాలా అవకాశాలు దూరం చేసింది. క్రికెట్‌లోనే అనుకుంటే.. ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే తీరుతో కనిపిస్తున్నారు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రాయుడు.. ప్రజాసేవ చేస్తా అంటూ వైసీపీలో చేరారు. కట్ చేస్తే.. ఫ్యాన్ పార్టీకి పది రోజుల్లోనే రాజీనామా చేశారు. ముంబై జట్టుకు ఆడుతున్నా.. అందుకే రాజకీయాలకు దూరం అంటూ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. నిజమే అనుకున్నారు అంతా! ఐతే వెళ్లి జనసేనలో చేరారు. అక్కడికి ఎందుకు వెళ్లావ్.. ఇక్కడికి ఎందుకు వచ్చావ్.. అదేదో డైరెక్ట్‌గా ఇక్కడికే వచ్చేస్తే అయ్యేది కదా రాయుడు.. ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు.. ఇంత నిలకడలేనితనం ఎందుకు అంటూ.. రాజకీయవర్గాలతో పాటు ఆయన అభిమానుల్లో కొత్త చర్చ మొదలైంది.
KTR: కాంగ్రెస్‌కు అసలు సినిమా ముందుంది.. వాళ్లవి 420 హామీలు: కేటీఆర్
క్రికెటర్‌గా రాయుడు స్పెషల్ మార్క్ క్రియేట్ చేశారు. చిన్నప్పుడు అతన్ని మరో సచిన్ అనేవారంటే అర్థం చేసుకోవచ్చు. మనోడి టాలెంట్ అది! అయితే, అలాంటి రాయుడు నిర్ణయాలు ఎప్పుడూ తప్పుగానే ఉంటాయ్. రంజీ ఆడే టైమ్‌లోనే బీసీసీఐకి ఎదురుతిరిగిన రాయుడు.. ఇండియన్ క్రికెట్ లీగ్‌లో చేరి.. నిషేధం ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత 2009లో బీసీసీఐ క్షమాభిక్ష పెట్టడంతో.. రాయుడు మళ్లీ దేశవాళీ క్రికెట్‌లోకి వచ్చాడు. ఇక రంజీల్లో మనోడు మారని జట్టు లేదు. రాజకీయాలు అంటూ ఒకసారి.. అడ్జస్ట్ కాలేకపోతున్నానంటూ ఇంకోసారి.. ఇలా చాలా జట్లు మారాడు. 2001 నుంచి 2005వరకు హైదరాబాద్‌కు ఆడిన రాయుడు.. తర్వాత ఆంధ్రాకు.. ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్‌కు.. 2010 నుంచి 2016 వరకు బరోడాకు, తర్వాత విధర్బ తరఫున ఆడాడు. కారణం ఏదైనా ఇన్ని జట్లు మారడం.. ఇన్నాళ్లు పెద్దగా హైలైట్ కాలేదు. ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే తీరు కొనసాగిస్తున్నాడు రాయుడు. ప్రజాసేవ చేయాలని ఉందంటూ రాజకీయాలోకి ఎంట్రీ ఇచ్చిన రాయుడు.. ఇక్కడా అలాంటి దుందుడుకు స్వభావమే చూపిస్తున్నాడు. డిసెంబర్ 28న అధికారికంగా వైసీపీలో జాయిన్ అయిన ఆయన తొమ్మిది రోజులకే ఆ పార్టీ వీడాడు.
అధిష్టానానికి, ఇతనికి మధ్య ఎక్కడ చెడిందా.. లేదంటే నిజంగానే క్రికెట్ కోసం పాలిటిక్స్‌కు కాస్త బ్రేక్ ఇచ్చారా అనుకుంటున్న సమయంలో.. రాయుడు మళ్లీ షాక్ ఇచ్చాడు. జనసేన అధినేత పవన్‌ను కలిసి.. గ్లాస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. గుంటూరు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇస్తారా.. ఇస్తే గెలుస్తారా.. గెలుపు అవకాశాలు ఏంటి అన్న సంగతి పక్కనపెడితే.. క్రికెట్, రాజకీయం ఒక్కటి కాదు. అక్కడ బాలేదని ఇక్కడ.. ఇక్కడ బాలేదని అక్కడ.. నిలకడ లేకుండా పార్టీలు మారితే.. మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఐతే మరికొందరు మాత్రం.. ఆయన నిర్ణయాలు ఆయన ఇష్టం.. అయినా చేరిన పదిరోజులకే రిజైన్ చేశారు కదా.. ముందుగానే అలర్ట్ అయ్యారు కదా.. ఇందులో నిలకడలేని తనం ఎక్కడ కనిపిస్తుందని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ఏమైనా.. రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్ ఎలా సాగబోతుందన్న ఆసక్తి మాత్రం జనాల్లో కనిపిస్తోంది.