AP BJP LEADERS : ఏం చేయాలి? ఎటు పోవాలి? దిక్కుతోచని స్థితిలో ఏపీ బిజెపి లీడర్లు

కేంద్రంలో మళ్లీ బిజెపి అధికారంలోకి వస్తారేమో.... ప్రధానిగా మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తారేమో.... దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి నేతలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు అవుతారేమో.... ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బీజేపీ నేతలు కౌన్సిలర్ గా కూడా గెలవలేరు. ఇది ఏపీలో బిజెపి నేతల దుస్థితి.

  • Written By:
  • Updated On - January 1, 2024 / 01:46 PM IST

కేంద్రంలో మళ్లీ బిజెపి అధికారంలోకి వస్తారేమో…. ప్రధానిగా మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తారేమో…. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి నేతలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు అవుతారేమో…. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బీజేపీ నేతలు కౌన్సిలర్ గా కూడా గెలవలేరు. ఇది ఏపీలో బిజెపి నేతల దుస్థితి. మరో మూడు నెలల్లో లోక్ సభ కి, అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. మిగిలిన పార్టీలన్నీ ఆయుధాల్ని, అభ్యర్థుల్ని సిద్ధం చేసుకుంటున్నాయి. ఏపీ బీజేపీ నేతలు మాత్రం అసలేం చేయాలి? ఎటు వెళ్లాలి? ఒంటరిగా వెళ్లాలా? పొత్తుతో వెళ్లాలా? అని తెలియని అయోమయ పరిస్థితి. వైసీపీని తిట్టాలా? ప్రతిపక్షంలో ఉన్న టిడిపిని తిట్టాలా? జనసేనతో కలిసి పని చేయాలా? విడిగా పని చేయాలా? దేనిపైనా స్థానిక బిజెపి నేతలకు అవగాహన లేదు. పై నుంచి డైరెక్షన్ రాదు.

గడచిన ఐదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపితో బీజేపీ రహస్య బంధం కొనసాగుతూనే ఉంది. వాళ్లకి వీళ్ళు, వీళ్ళకి వాళ్ళు… అన్నిచోట్లా సహకరించుకుంటూనే ఉంటారు. కేవలం అప్పుడప్పుడు బిజెపి వాళ్లు వైసీపీపై విమర్శలు చేస్తూ ఉంటారు. అది చూసి జనం నవ్వుకుంటూ ఉంటారు. ఇక జనసేన… మా మిత్ర పార్టీ అంటుంది. ఎక్కడా పార్టీతో కలిసి పోటీ చేయరు. జనసేన ఏమో టిడిపితో కలిసి సభలు, సమావేశాలు పెడుతుంది. ఢిల్లీ నుంచి బిజెపి అధిష్టానం …నేను చెప్పే వరకు అడుగు ముందుకు వేయొద్దు అని ఆదేశిస్తుంది. పోనీ ఇంత కష్టపడి ఏళ్ల తరబడి పార్టీని పట్టుకొని వేలాడుతూ, పార్టీ మనుగడ కోసం పెట్టుబడులు పెడుతూ బండి లాక్కొస్తున్నా… నేతలకు ఎవరికి ఎమ్మెల్యే టికెట్లు వస్తాయో? ఎవరు ఎంపీలవుతారు తెలియని స్థితి. ఏపీలో ఒక్క ఎమ్మెల్యే గాని, ఒక్క ఎంపీగాని, గెలిచే సత్తా బిజెపీకి లేదు. టిడిపితో పొత్తుకు వెళ్తే తప్ప మరో దారి లేదు

జనసేన ఇప్పటికే టిడిపితో పొత్తుకు వెళ్ళిపోయింది. ఒకవేళ బిజెపి కూడా టిడిపితో పెట్టుకుంటే.. మహా అయితే పది ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీ సీట్లు ఇస్తారు. వాటిల్లో ఎన్ని గెలుస్తామో కూడా తెలియని పరిస్థితి. బిజెపి అధిష్టానం ఆంధ్రను పట్టించుకోదు. జనం కూడా పట్టించుకోరు. ఆంధ్రప్రదేశ్ లో కులం తప్ప.. హిందూ మతం అజెండా పెద్దగా నడవదు. అసలు ఏం చెప్పి ఓట్లు అడుక్కోవాలి కూడా తెలియని పరిస్థితిలో ఏపీ బిజెపి నేతలు ఉన్నారు. అధిష్టానం సరైన డైరెక్షన్ ఇవ్వదు. ఏపీలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు వైసిపి, జనసేన, టిడిపి… సెంట్రల్ బిజెపి కంట్రోల్లోనే ఉంటాయి కనుక… ఆ పార్టీలకు వచ్చిన 25 ఎంపీ సీట్లు ఫైనల్ గా కేంద్రంలో బిజెపికి ఉపయోగపడతాయి. ఆ ధీమా తోనే మోడీ అమిత్ షాలు ఏపీపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. అంతవరకు ఓకే. మరి మా పరిస్థితి ఏంటి? మా రాజకీయ భవిష్యత్తు ఏంటి? అని జుట్టు పీక్కుంటున్నారు ఏపీ బీజేపీ నేతలు. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, పురందేశ్వరి ఇలాంటి ఏపీ బిజెపి అగ్రనేతలు వ్యాపారాలు, వ్యవహారాలు చేసుకుంటూ కేంద్రంలోని పెద్దల సహకారంతో మునుగడ సాగిస్తున్నారు. కానీ కార్యకర్తలు, జిల్లాస్థాయి నాయకులు వీళ్ళ పరిస్థితి ఏంటి? భవిష్యత్తు లేని పార్టీలో ఎన్నాళ్ళు ఉండాలి ? ఏం చేయాలి? ఇది ఇప్పుడు ఏపీలో బిజెపి నేతల్ని తొలిచేస్తున్న ప్రశ్న.