ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ… రాజకీయ పార్టీల్లో కుల సమీకరణాలు మారిపోతున్నాయి. కొత్త కొత్త లెక్కలు బయటకు వస్తున్నాయి. టీడీపీ (TDP) నుంచి కమ్మ (Kamma)సామాజిక వర్గం నేతలు వైసీపీలో చేరుతుండగా… వైసీపీ నుంచి రెడ్డి (Reddy) కులస్థులు… సైకిల్ ఎక్కుతున్నారు. కాపుల్లో చాలామంది జనసేనకు, పవన్ కల్యాణ్ కు అండగా ఉన్నారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కూడా జనసేనలో చేరతారని టాక్ నడుస్తోంది. దాంతో మెజారిటీ కాపుల (Kapu) ఓట్లు జనసేనకు టర్న్ అవుతాయని అంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏపీలో ఈసారి కులాల కుంపట్లు చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మొదటి నుంచీ కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను టీడీపీ గెలుస్తోంది. కానీ 2019 ఎన్నికల్లో అవి వైసీపీకి (YCP) టర్న్ అయ్యాయి. అలాగే ఈసారి కమ్మ సామాజిక వర్గం నేతలు కూడా వైసీపీలో చేరుతున్నారు. ఇందులో కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ తో పాటు దేవినేని నెహ్రూ వారసుడు అవినాష్ కూడా వైసీపీలో చేరారు. రీసెంట్ గా విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా జగన్ కు జై కొట్టారు. అటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నేతలు ఎప్పుడో టీడీపీలోకి జంప్ అయ్యారు. ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సైకిల్ ఎక్కారు. ఇప్పుడు వైసీపీ రిలీజ్ చేస్తున్న జాబితాల్లో టిక్కెట్లు రానివాళ్ళు, ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్న రెడ్డి పొలిటికల్ లీడర్లు… చంద్రబాబు వెంటే నడుస్తారనీ… రాబోయే రోజుల్లో ఇంకా టీడీపీలోకి చేరికలు ఉన్నాయని అంటున్నారు.
వైసీపీ, టీడీపీకు ఎప్పటి నుంచో కొమ్ము కాసిన రెడ్డి, కమ్మ సామాజిక వర్గం నేతలు ఇప్పుడు ఉన్నట్టుండీ ఆ పార్టీల వదిలి ప్రత్యర్థి పార్టీల్లో చేరడానికి అనేక కారణాలున్నాయి. సామాజిక సమీకరణాల పేరుతో పార్టీ అధిష్టానాలు వాళ్ళకి టిక్కెట్లు నిరాకరిస్తున్నాయి. ఇప్పటికి వైసీపీ నుంచి మూడు జాబితాలు వెలువడ్డాయి. ఇందులో కొందరు రెడ్లను పక్కనపెట్టి… బీసీ, ఇతర కులస్థులకు సీట్లు కేటాయించారు జగన్. అందుకే జాబితాల రిలీజ్ కార్యక్రమం పూర్తయ్యాక… చాలామంది రెడ్డి కులస్థులు…టీడీపీలో చేరే అవకాశాలున్నాయని అంటున్నారు. ఏపీలో కీలక ఓటు బ్యాంక్ ఉన్న కాపు సామాజిక వర్గం మాత్రం జనసేన వైపే చూస్తోంది. పవన్ కల్యాణ్ (Pavan Kalyan) అదే సామాజిక వర్గానికి చెంది ఉండటం… రేపో, మాపో ముద్రగడ పద్మనాభం కూడా ఆ పార్టీలో చేరుతుండటంతో కాపులంతా జనసేనకే జై కొడతారని అంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కాపులు, కమ్మలు ఏకమై టీడీపీ – జనసేన (Janasena) కూటమికి జై కొడితే వైసీపీకి ఇబ్బందులు తప్పకపోవచ్చు. అందుకే జగన్ తెలివిగా… బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల లీడర్లకు టిక్కెట్లు ఇస్తున్నారు. మొన్నటిదాకా బీసీలు పక్కాగా టీడీపీని సపోర్ట్ చేశారు. వాళ్ళల్లో కొన్ని వర్గాలను వైసీపీ తన వైపుకు తిప్పుకుంది. కానీ వచ్చే మూడు నెలల్లో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కొత్త కుల సమీకరణాలు… ఏ పార్టీని దెబ్బతీస్తాయో… ఏ పార్టీని గట్టెక్కిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.