టీడీపీ (TDP), జనసేన (Jana Sena) అధినేతల డిన్నర్ మీట్‌తో ఏపీ రాజకీయంలో(AP Politics) ఆసక్తికర చర్చ మొదలైంది. చంద్రబాబు, పవన్ భేటీ.. అసంపూర్తిగానే ముగిసినట్లు తెలుస్తోంది. పొత్తుతో పోటీచేయాల్సిన సీట్ల సంఖ్య, నియోజకవర్గాలు, ఉమ్మడి మేనిఫెస్టో, నియోజకవర్గాల్లో అమలు చేయాల్సిన ఉమ్మడి కార్యాచరణలాంటి అంశాలపై చర్చించేందుకు.. దాదాపు మూడున్నర గంటలపాటు ఇద్దరు అధినేతలు భేటీ అయ్యారు. ఉమ్మడి మేనిఫెస్టో (Joint Manifesto), కార్యాచరణ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినా.. అసలైన సీట్ల విషయం మాత్రం ఫైనల్ కాలేదని తెలుస్తోంది. సీట్ల సంఖ్య, నియోజకవర్గాలపై చర్చలు జరిపినా ఏకాభిప్రాయానికి అధినేతలు రాలేకపోయారనే ప్రచారం జరుగుతోంది. పవన్‌కు ఇచ్చే సీట్లు ఇవే అంటూ.. ఓ వర్గం మీడియాలో కొత్త ప్రచారం ఊపందుకుంది. అదే నిజం అయితే.. పవన్ పని అయిపోయినట్లే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
50 అసెంబ్లీ సీట్లతో (Assembly Seats) పాటు 8పార్లమెంట్ స్థానాలను పవన్ అడిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక లిస్ట్ కూడా రెడీ చేసి చంద్రబాబుకు అందించినట్లు సమాచారం. ఐతే ఈ విషయంలో చంద్రబాబు నుంచి సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. 25 అసెంబ్లీలు 2 లేదా 3 లోక్‌సభ సీట్లు ఇవ్వటానికి చంద్రబాబు రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ అనుకూలంగా పేరున్న మీడియా నుంచి ఇలాంటి ప్రచారం వస్తుందంటే.. సీట్ల పంపకాల విషయంలో ఇదే నిజం అనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఐతే నిజంగా ఇదే నిజం అయితే.. పవన్ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. జనసేన నేతలేమో 50 నుంచి 60 అసెంబ్లీలు, 8 లోక్‌సభ సీట్లలో పోటీచేయాలని పట్టుబడుతున్నారు.
పవన్ మద్దతుదారుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య (Former Minister Hariramazogaiah) కూడా.. జనసేన 50 నుంచి 60 అసెంబ్లీ సీట్లలో పోటీచేయకపోతే కాపు సామాజికవర్గం మద్దతు కష్టమే అంటూ బాంబ్ పేల్చారు. పైగా ముఖ్యమంత్రిగా రెండున్నర సంవత్సరాలు పవన్ ఉండేట్లు మేనిఫెస్టోలో స్పష్టంగా ఉండాలని అంటున్నారు. ముఖ్యమంత్రిగా పవన్‌కు హామీ, 50 నుంచి 60 అసెంబ్లీ సీట్లు తీసుకోకపోతే… కాపుల ఓట్లు టీడీపీకి బదిలీ అవటం కష్టమని జోగయ్య ఒక లేఖలో పవన్‌కు స్పష్టంచేశారు. జోగయ్య, జనసేన నేతలు అడుగుతున్నట్లు కాకుండా… చంద్రబాబు చెప్పినట్లు 25అసెంబ్లీ సీట్లకు పవన్ అంగీకరిస్తే జనసేనకు కష్టమే అనే చర్చ జరుగుతోంది. గతంలో పవన్ చెప్పినట్లు 25అసెంబ్లీ సీట్లలో పోటీచేయటం జనసేనకు గౌరవప్రదం కాదు. సీట్ల సంఖ్య, నియోజకవర్గాలపై ఏకాభిప్రాయం కుదరని కారణంగానే భేటీ వాయిదాపడినట్లు జనసేన వర్గాలు అంటున్నాయ్.