TDP MP SEATS : టీడీపీ-జనసేన.. ఎంపీ అభ్యర్థులు వీళ్ళేనా ?

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో... వైసీపీ వరుసగా తమ అభ్యర్థులను ప్రకటిస్తోంది. కానీ టీడీపీ - జనసేన (TDP-Janasena) కూటమి నుంచి ఇంకా అధికారికంగా ఎలాంటి లిస్ట్ బయటకు రాలేదు. అయితే గత రెండు రోజులుగా చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి... పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నట్టు చెబుతున్నారు. ముందుగా ఎంపీ స్థానాలపై ఆయన దృష్టిపెట్టినట్టు సమాచారం.

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో… వైసీపీ వరుసగా తమ అభ్యర్థులను ప్రకటిస్తోంది. కానీ టీడీపీ – జనసేన (TDP-Janasena) కూటమి నుంచి ఇంకా అధికారికంగా ఎలాంటి లిస్ట్ బయటకు రాలేదు. అయితే గత రెండు రోజులుగా చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి… పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నట్టు చెబుతున్నారు. ముందుగా ఎంపీ స్థానాలపై ఆయన దృష్టిపెట్టినట్టు సమాచారం. ఏపీలో మొత్తం పాతిక లోక్ సభ స్థానాలు ఉంటే… ఇప్పటికి 13 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారో తెలియనప్పటికీ… ప్రస్తుతానికి మాత్రం రెండు స్థానాలు రిజర్వ్ చేసినట్టు తెలుస్తోంది.

ఏపీలో లోక్ సభ ఎన్నికల్లో (AP Lok Sabha Elections) పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు టీడీపీ (TDP) చీఫ్ చంద్రబాబు నాయుడు(Chandrababu). టీడీపీ జనసేన కూటమిలో 13 స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ స్థానాల్లో జనసేనకు మచిలీపట్నం, కాకినాడ సీట్లు కేటాయించినట్టు సమాచారం. ఇంకా 2-3 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేయకుండా పెండింగ్ లో పెట్టారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన ముగ్గురు సిటింగ్ ఎంపీలకు టీడీపీ తరఫున టిక్కెట్లు కన్ఫమ్ అయ్యాయి. నరసాపురం నుంచి రఘురామ కృష్ణం రాజు, మచిలీపట్నం నుంచి బాలశౌరి, నరసరావు పేటలో శ్రీకృష్ణ దేవరాయలకు టిక్కెట్లు ఇస్తున్నారు. మరో వైసీపీ ఎంపీకి కూడా టీడీపీ టికెట్ రెడీగా ఉన్నట్టు చెబుతున్నారు.

టీడీపీ సీట్లలో ఆశావాహులు కూడా ఎక్కువే. పైగా జనసేనతో పొత్తు ఉండటంతో తమకు టిక్కెట్లు దక్కుతాయో… లేదోనని లీడర్లలో బెంగ పట్టుకుంది. అందుకే తమ నియోజకవర్గాల్లో కార్యకర్తలతో బలప్రదర్శన చేస్తున్నారు కొందరు లీడర్లు. ఇప్పటికి 13 స్థానాల్లో ఎంపీ అభ్యర్థులను చంద్రబాబు ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, అనకాపల్లి నుంచి బైరి దిలీప్ చక్రవర్తి, విశాఖ నుంచి మెతుకుపల్లి భరత్, ఏలూరు నుంచి గోపాల్ యాదవ్, విజయవాడ నుంచి కేశినేని చిన్ని, తిరుపతి నుంచి అంగలకుర్తి నిహారిక, రాజంపేట నుంచి సుగవాసి బాలసుబ్రమణ్యం, హిందూపురం నుంచి బీకే పార్థసారధి, అనంతపురం నుంచి కాల్వ శ్రీనివాసులుకు ఎంపీ టిక్కెట్లు దక్కనున్నాయి. జనసేనకు ఇచ్చిన రెండు సీట్లలో కాకినాడ నుంచి సాన సతీష్ కుమార్, మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తారని చెబుతున్నారు.

చిత్తూరు ఎస్సీ స్థానానికి సినీ నటుడు సప్తగిరి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురు పోటీలో ఉండటంతో టీడీపీ అధిష్టానం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. విజయనగరం, అరకు, రాజమహేంద్రవరం, అమలాపురం, గుంటూరు, బాపట్ల ఎంపీ స్థానాల్లోనూ టీడీపీ లీడర్ల మధ్య గట్టి పోటీ ఉంది. ఒంగోలు, నెల్లూరు జిల్లాలకు సంబంధించి చంద్రబాబు ఇంకా కసరత్తు మొదలుపెట్టనట్టు తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల్లో అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. అందువల్ల ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లోనూ టీడీపీ ఎంపీ టిక్కెట్ కోసం చాలామంది పోటీ పడుతున్నారు. ఇంకా కొన్ని లోక్ సభ నియోజకవర్గాల్లో సర్వే కొనసాగుతోంది. ఆ సర్వే పూర్తయ్యాక… పవన్ కల్యాణ్ తో పొత్తుల గురించి కన్ఫమ్ చేసుకున్నాక… అప్పుడు టీడీపీ-జనసే అభ్యర్థుల ప్రకటన అధికారికంగా మొదలవుతుందని భావిస్తున్నారు.