ఏపీ సీఎం జగన్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం ఐనప్పటి నుంచీ.. ఇప్పటీ వరకూ ఒక్కసారి కూడా జగన్ తనకు కాల్ చేయలేదని చెప్పారు. కనీసం విష్ చేసేందుకు కూడా తనకు జగన్ కాల్ చేయలేదని చెప్పారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రుల నుంచి కూడా కాల్స్ వచ్చాయి కానీ.. జగన్ నుంచి మాత్రం కాల్ రాలేదని చెప్పారు. రాజకీయ విషయాలు తప్పితే వ్యక్తిగతంగా తనకు జగన్‌తో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు రేవంత్ రెడ్డి. రీసెంట్‌గానే జగన్ తెలంగాణకు వచ్చారు. ప్రమాదానికి గురై రెస్ట్ తీసుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పరామర్శించారు. దాదాపు 30 నిమిషాలు కేసీఆర్‌తో మాట్లాడారు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లి విజయమ్మను కలిసి అటు నుంచి ఏపీకి వెళ్లిపోయారు జగన్. కొత్త ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కూడా కలవలేదు.
ఇదే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు భార్యతో కలిసి మరీ జగన్ తెలంగాణకు వచ్చారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. కానీ రేవత్ రెడ్డి సీఎం అయ్యాక కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఇలా అయితే ఇక రెండు రాష్ట్రాల మధ్య మైత్రి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు అంతా అడుగుతున్న ప్రశ్న. రెండు రాష్ట్రాల మధ్య విభజన విషయంలో పెండింగ్ సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్‌లో ముఖ్యమంత్రులు కలిసి పని చేయాల్సి ఉంటుంది. రాజకీయాల్లో శాశ్వత శతృవులు.. శాశ్వత మిత్రులు ఉండరు.. ఉండకూడదు అనేది విమర్శకులు చెప్తున్న మాట. చాలా కాలం నుంచి షర్మిల రేవంత్ రెడ్డి మధ్య ఏ స్థాయిలో మాటల యుద్ధం జరిగిందో తెలుగు రాష్ట్రాలు చూశాయి. కానీ షర్మిల కాంగ్రెస్‌లోకి వెళ్లిన వెంటనే సీన్ ఒక్కసారిగా మారిపోయింది.
తన కొడుకు పెళ్లికి ఆహ్వానించేందుకు షర్మిల స్వయంగా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. షర్మిలను ఆప్యాయంగా పలకరించిన రేవంత్ రెడ్డి ఆమెను శాలువాతో సత్కరించారు. మొన్నటి వరకూ నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనుకున్న ఇద్దరు నేతలు.. ఇప్పుడు నవ్వుకుంటూ పలకరించుకున్నారు. పాలన విషయంలో కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులున కూడా అలా ఉంటేనే బెటర్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి రేవంత్ వ్యాఖ్యలకు జగన్ నుంచి వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.