YS JAGAN: వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అధిష్టానం వరుస షాక్‌లు ఇస్తోంది. పలు నియోజకవర్గాలకు ఇంచార్జిలను మారుస్తుండటంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో వణుకు ప్రారంభమైంది. తమకు రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ వస్తుందా.. రాదా.. అనే టెన్షన్‌లో ఉన్నారు. ఇప్పటికే ప్రకటించిన రెండు జాబితాల్లో కొందరు సిట్టింగులను తప్పించారు. నియోజకవర్గ బాధ్యతల్ని వేరేవాళ్లకు అప్పగించారు. దీంతో ఆయా నేతలు ఆందోళనకు గురవుతున్నారు. ఇదే ఇప్పుడు.. అధికార వైసీపీలో అభ్యర్థులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మూడో జాబితాను కూడా వైసీపీ సిద్ధం చేస్తోంది. ఈ జాబితాలో మరికొందరికి వైసీప అధిష్టానం మొండి చేయి చూపనుందా? కొన్నిచోట్ సిట్టింగ్‌లను కాదని కొత్తవారికి ఛాన్స్ ఇస్తారా? అంటే అవునే సమాధానం వస్తోంది.
COVID 19: కరోనా మళ్లీ విజృంభిస్తోందా..? ఒక్క రోజే 12 మరణాలు నమోదు..
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ మార్పులు చేర్పులు చేపడుతున్నారు. బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు. ఇప్పటికే రెండు జాబితాల్లో మొత్తం 38 మంది సిట్టింగ్‌లను మార్చిన వైసీపీ అధిష్టానం.. మూడో జాబితాపై కసరత్తు చేస్తోంది. సర్వేల్లో వ్యతిరేకత ఉన్నవారిని, ప్రజల్లో సానుకూలతలేని సిట్టింగ్‌లను జగన్ నిర్దాక్షిణ్యంగా మారుస్తున్నారు. మరికొందరికి వేరే నియోజకవర్గాలను కేటాయిస్తున్నారు. అభ్యర్థులను మార్చిన స్థానాల్లో కొత్తవారికే ఛాన్స్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మూడో జాబితా విషయంలో ఇప్పటికే కొందరికి స్పష్టత వచ్చింది. మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు టిక్కెట్ ఇవ్వబోవడం లేదని తేలిపోయింది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న అనకాపల్లి నియోజకవర్గానికి మలసాల భరత్ కుమార్‌ను ఇంచార్జిగా నియమించింది. మంత్రికే ఇలాంటి పరిస్థితి ఉందంటే.. ఇక మూడో జాబితా మరింత కఠినంగా ఉండబోతుందని సిట్టింగ్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం మూడో జాబితాలో దాదాపు పది మంది సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా శింగనమల, నందికొట్కూరు, పెందుర్తి, ఆలూరు, కర్నూలు, చోడవరం, చింతలపూడి, గోపాలపురం, గూడూరు, కొవ్వూరు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చబోతున్నారని తెలుస్తోంది. మూడో జాబితాలో మంత్రులు గుమ్మనూరు జయరాం, తానేటి వనిత పేర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్, శింగనమల సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, చింతలపూడి ఎమ్మెల్యే ఏలిషాలకు మొండి చేయి చూపొచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధిష్టానం నుంచి ఎవరికి.. ఎప్పుడు పిలుపు వస్తుందేమోనని టెన్షన్ పడుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు.