ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు (Andhra Pradesh Assembly Elections) దగ్గరపడుతున్నవేళ… అన్ని పార్టీల అధినేతలు వరుసగా ఢిల్లీకి (Delhi) క్యూ కడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్… బీజేపీ (BJP) తో పొత్తుల కోసం ఢిల్లీకి వెళితే… ఉన్నట్టుండి ఏపీ సీఎం జగన్ (CM Jagan) కూడా హస్తిన ప్రోగ్రామ్ పెట్టుకోవడంతో రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. ఏం జరుగుతోంది ఢిల్లీలో… బీజేపీ అండ కోసం ఏపీలో అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ఏపీలో పొత్తుల సంగతి తేల్చేద్దాం రండి అంటూ… కేంద్ర హోంమంత్రి అమిత్ షా కబురు పెట్టడంతో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) ఢిల్లీకి వెళ్ళారు. బుధవారం రాత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. బీజేపీ పెద్దలు అడిగిన సీట్లల్లో కొన్నింటికి ఒప్పుకొని రిటర్న్ అవుతున్నారు. ఇదే విషయమై కమలనాధులతో మాట్లాడటానికి జనసేనాని పవన్ కల్యాణ్ కూడా గురువారం వెళ్తున్నారు. తాను ఎన్డీఏలోనే ఉన్నాననీ… బీజేపీతో పొత్తు కొనసాగుతుందని ఎప్పటి నుంచో చెబతున్నారు. 2024 ఏపీ అసెంబ్లీ(2024 AP Assembly), లోక్ సభ ఎన్నికలకు కమలంతో కలసి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. టీడీపీని కూడా ఒప్పించారు. ఢిల్లీలో… చంద్రబాబుతో బీజేపీ లీడర్లు ఏం మాట్లాడారు… మూడు పార్టీలు కలసి ఏపీలో అధికారంలోకి రావడంతో పాటు… వీలైనన్ని ఎక్కువ లోక్ సభ నియోజకవర్గాలు ఎలా గెలుచుకోవాలని లాంటి అంశాలపై పవన్ తో అమిత్ షా మాట్లాడే అవకాశముంది. పవన్ ఢిల్లీ నుంచి వచ్చాక… మళ్ళోసారి చంద్రబాబుతో భేటీ అవుతారు. దాంతో ఏపీలో ఎవరు ఏ స్థానాల్లో పోటీ చేస్తారన్న దానిపై కొంత క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.
ఇదే టైమ్ లో సీఎం జగన్ కూడా ఢిల్లీ బాట పట్టడం ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ నిరవధిక వాయిదా పడగానే… సడన్ గా జగన్ షెడ్యూల్ ని రిలీజ్ చేశారు అధికారులు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీతో జగన్ భేటీ అవుతున్నారు. ఏపీ అభివృద్ధి, రాష్ట్రానికి రావల్సిన నిధులపై మాట్లాడటానికి వెళ్తున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఉన్నట్టుంటి ఈ టూర్ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టుకున్నట్టు. నిజంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలే పీఎంతో మాట్లాడతారా… లేకపోతే టీడీపీ-జనసేనతో బీజేపీ కూటమి గురించి డిస్కస్ చేసే అవకాశాలున్నాయా ?
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ బీజేపీకి అన్ని విధాలుగా సహకరిస్తోంది. పార్లమెంట్ లో బిల్లుల దగ్గర నుంచి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలోనూ కోపరేషన్ ఉంది. కానీ ఈమధ్యకాలంలో జగన్ కు కొంత ఇబ్బదులు ఎదురవుతున్నాయి. షర్మిల వరుసగా అన్న జగన్ మీదకు బాణాలు వేస్తున్నారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ తేలేకపోయాడంటూ… జగన్ తో పాటు బీజేపీని కూడా తిట్టిపోస్తున్నారు షర్మిల. అదే తలనొప్పిగా ఉంటే ఇప్పుడు టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ కూడా కలుస్తుండటంతో జగన్ కు కష్టాలు మొదలయ్యాయి. ప్రధాని మోడీ (Prime Minister Modi) దగ్గర ఈ పొత్తుల ప్రస్తావన తెస్తారా ? లేదంటే ప్రభుత్వ పని పేరుతో అమిత్ షాను కూడా కలుసుకొని… పార్టీ వ్యవహారాలు డిస్కస్ చేస్తారా అన్నదానిపై ఏపీలో పొలిటికల్ సర్కిల్స్ (AP Political circles ) లో డిస్కషన్ జరుగుతోంది.