టీడీపీ అధినేత చంద్రబాబు – నటుడు జూనియర్ ఎన్టీఆర్ మధ్య అగాధం అంతకంతకూ పెరిగిపోతోంది. లేటెస్ట్ గా ఏపీలోని పశ్చిమగోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో టీడీపీ కార్యకర్తలు, జూనియర్ NTR అభిమామానుల మధ్య జరిగిన గొడవ ఉద్రిక్తతలకు దారితీసింది. రెండు వర్గాల వారు కొట్టుకున్నారు. ఇప్పటికే టీడీపీ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు.. ఇప్పుడు డైరెక్ట్ గా కొట్లాటలకు దిగడంతో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో అని టీడీపీ శ్రేణులు భయపడుతున్నాయి.
టీడీపీతో పాటు చంద్రబాబు, బాలక్రిష్ణతో ఈమధ్యకాలంలో ఏ మాత్రం సంబంధం లేనట్టుగా ఉంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. తన సినిమాలపై ధ్యాసే తప్ప.. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా కనీసం స్టేట్ మెంట్ ఇవ్వలేదు. ఆ టైమ్ లో టీడీపీ శ్రేణులు రోడ్డెక్కి రాష్ట్రమంతటా నిరసన తెలిపింది. తారక్ ఫ్యామిలీ తప్ప.. మిగతా నందమూరి కుటుంబ సభ్యులంతా బాబుకు సపోర్ట్ గా ప్రకటనలు చేశారు. ఆ టైమ్ లో జూనియర్ ఎన్టీఆర్ సైమా వేడుకల్లో పాల్గొనడానికి దుబాయ్ వెళ్ళాడు. గతంలో విదేశాల్లో షూటింగ్ లో ఉన్నప్పుడు.. ప్రచారంలో భాగంగా గాయపడి హాస్పిటల్ బెడ్ పై ఉన్నప్పుడు వీడియోల రూపంలో తన సందేశాలను పంపాడు జూనియర్. కానీ ఈసారి చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయినా వీడియో గానీ.. ట్విట్టర్ లో గానీ స్పందించలేదు. విదేశాల నుంచి వచ్చాక కూడా కనీసం పరామర్శించలేదు. జూనియర్ బాటలోనే నడిచారు కల్యాణ్ రామ్.
మరో మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి ఎలాగైనా గెలవాలని గట్టి పట్టుదలగా ఉన్నారు చంద్రబాబు. ఈ టైమ్ లో టీడీపీ శ్రేణులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య ప్రత్యక్షంగా గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు వర్గాల మధ్య సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. మాటల యుద్ధం నడుస్తోంది. గతంలో నారా లోకేష్ పాదయాత్రలో కూడా ఎన్టీఆరే భవిష్యత్ ముఖ్యమంత్రి అంటూ.. కృష్ణా జిల్లాలో పోస్టర్లు వెలిశాయి. యువగళమైనా.. జనగళమైనా.. నవగళమైనా.. ఏ గళమైనా.. తెలుగునాట స్మరించే పేరు ఒక్కటే.. నందమూరి తారక రామారావు.. NTR ఫ్యూచర్ సీఎం.. అని ఫ్లెక్సీల్లో రాశారు. ఒంగోలులో అయితే ‘కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్.. అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే’ అంటూ ఫ్లెక్సీలు కట్టారు. నారా లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కౌంటర్ ఇచ్చారా అన్న అనుమానాలు తలెత్తాయి. కానీ.. టీడీపీలో చిచ్చుపెట్టేందుకు వైసీపీ లీడర్లే ఈ పోస్టర్లు వేయించారన్న ఆరోపణలు వచ్చాయి.
లేటెస్ట్ గా పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోనూ జూనియర్ ఎన్టీఆర్, టీడీపీ అభిమానుల మధ్య గొడవలు, కొట్లాటలు జరిగాయి. ఈ రెండు చోట్లా.. కొందరు తారక్ అభిమానులు.. తమ అభిమాన నటుడి ఫోటోలతో ప్లకార్డులు పట్టుకు రావడం.. టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడం జరిగాయి. ఎన్టీఆర్ ఫోటోలతో ఉన్న ప్లకార్డులను టీడీపీ శ్రేణులు లాక్కొని కింద పడేశాయి. దాంతో ఎన్నికల వేళ టీడీపీలో ఇప్పుడు చంద్రబాబు వర్సెస్ జూనియర్ వివాదం కొత్త టర్న్ తీసుకోబోతోంది. ఇది నిజంగా తారక్ కు తెలిసే జరుగుతోందా.. లేదంటే వైసీపీ లీడర్లు దగ్గరుండి చేయిస్తున్నారా అన్నది మాత్రం అర్థంకావట్లేదు. కానీ చంద్రబాబు, బాలక్రిష్ణతో.. జూనియర్ ఎన్టీఆర్ కి వైరం మాత్రం పెరుగుతూనే ఉంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇది ఏ పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి.