ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) స్కిల్ డెవలప్ మెంట్ కేసులో (Skill Development Case) మంగళవారం కీలకపరిణామం జరగబోతోంది. తనపై పెట్టిన కేసును సవాల్ చేస్తూ టీడీపీ చీప్ చంద్రబాబు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై తుది తీర్పు రాబోతోంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు 52 రోజుల పాటు రాజమండ్రి (Raja Mandri) సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా గడిపారు. ఆ తర్వాత కూడా మరికొన్ని కేసులను సీఐడీ ఆయనపై పెట్టింది. అయితే ఈ కేసుల విషయంలో నిబంధనలు పాటించలేదంటూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు చంద్రబాబు. కేసులను క్వాష్ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. హైకోర్టులో బెయిల్ రావడంతో బాబు ప్రస్తుతం బయటకు వచ్చారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు లాయర్లు, సీఐడీ తరపున ప్రాసిక్యూషన్ తరపున వాదనలు పూర్తయినా ఇంతవరకూ తీర్పు రాలేదు.
చంద్రబాబు తరపున న్యాయవాదులు 17A, క్వాష్ పిటిషన్ తరపున వాదనలు వినిపించారు. గత ఏడాది అక్టోబర్ 20నే రెండు వర్గాల వాదనలను సుప్రీంకోర్టు పూర్తి చేసింది. మాజీ ముఖ్యమంత్రిని అయిన తనను గవర్నర్ అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేశారని 17A కింద బాబు పిటిషన్ దాఖలైంది. సీఐడీ మాత్రం ఈ సెక్షన్ ఆయనకు వర్తించదని తమ వాదనలను సుప్రీంలో బలంగా వినిపించింది. రెండు వర్గాల తరపున దేశంలోనే ప్రముఖ న్యాయవాదులు వాదించారు. తమపై రాజకీయ కక్షతో ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేసుల్లో ఇరికిస్తున్నాయని చాలా మంది పొలిటికల్ లీడర్లు ఆరోపిస్తున్నారు. ఇలాంటి కక్షసాధింపుల నుంచి రక్షణ కల్పించేందుకే 17A కింద గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంది. దాంతో చంద్రబాబు విషయంలో సుప్రీం ఇచ్చే తీర్పు వివిధ కేసుల్లో ఉన్న పొలిటికల్ లీడర్లు అందరికీ వర్తించనుంది. అందుకే వీళ్ళంతా కేసు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (Andhra Pradesh Assembly Elections) ముందు చంద్రబాబుపై వస్తున్న ఈ తీర్పుపై టీడీపీ లీడర్లు, కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు. చంద్రబాబు రాజకీయ భవితవ్వానికి ఈ తీర్పు కీలకం కానుంది. అనుకూలంగా వస్తే.. స్కిల్ డెవలప్ మెంట్ కేసు నుంచి ఆయన పూర్తిగా బయటపడతారు. ఒకవేళ 17A వర్తించదని సుప్రీంకోర్టు పేర్కొంటే.. బాబుకు వ్యతిరేకంగా తీర్పు వస్తే.. వెంటనే ఆయన బెయిల్ రద్దవుతుంది. చంద్రబాబు తిరిగి జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఈ కేసులో తీర్పు ఏపీలో సంచలనంగా మారబోతోంది.