అత్యంత కీలకమైన ఆ రెండు చోట్ల సీట్ల సిగట్లు మూడు పార్టీల అధిష్టానాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే పార్టీ పెద్దలకు తలబొప్పి కడుతోంది. అంతర్గత వ్యవహారాలు రచ్చకెక్కి అధిష్టానాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వైసీపీ(YCP), టీడీపీ(TDP), జనసేన(Janasena)… ఇలా మూడు పార్టీల పెద్దల్ని ముప్పు తిప్పలు పెడుతున్న అసెంబ్లీ సిగ్మెంట్స్ పరిస్తితి ఇది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో పొలిటికల్ కేపిటల్ బెజవాడ పాలిటిక్స్ వేడెక్కాయి. అన్ని చోట్ల లాగే ఇక్కడ కూడా… సీట్ల కోసం నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్న పరిస్థితి. ప్రధానంగా బెజవాడ పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో వ్యవహారం వేరే లెవల్‌లో ఉందనే చెప్పాలి. నేతలు ఖచ్చితంగా సీటు కైవసం చేసుకోవాలనే పట్టుదలతో నిత్యం చేస్తున్న రాజకీయం రక్తికడుతోంది. పశ్చిమ నియోజకవర్గ సీటు కోసం టీడీపీ-జనసేన (TDP-Jana Sena) మధ్య తీవ్ర పోటీ ఉంది. పొత్తులో ఈ సీటు తమకు వస్తుందని జనసేన భావిస్తుండగా… మాకే కావాలంటూ బలప్రదర్శన చేశారు టీడీపీ నేతలు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఇద్దరూ తమకు టీడీపీ టికెట్ ఇవ్వాలంటూ వరుస కార్యక్రమాలతో రచ్చరేపారు. ఇప్పుడు జనసేనలో కూడా అదే పరిస్థితి వచ్చింది. టీడీపీ వ్యవహారాలను పరిశీలిస్తున్న జనసేనలో కూడా కుమ్ములాటలు మొదలు కావటంతో ఇప్పడు యవ్వారం ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. పశ్చిమ నుంచి జనసేన టికెట్ ను ఇన్చార్జిగా ఉన్న పోతిన మహేష్ ఆశిస్తున్నారు.
గత ఎన్నికల్లో కూడా ఆయనే పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే తాజాగా మైనార్టీ కోటాలో తనకు సీటు కేటాయించాలంటూ జనసేన అధికార ప్రతినిధి గయాజుద్దీన్ భారీ ర్యాలీ నిర్వహించటంతోపాటు ఆత్మీయ సమావేశాలు కూడా పెడుతున్నారు. ఈ ర్యాలీ సందర్భంగా మహేష్, గయాజుద్దీన్ అనుచరులు పరస్పర దాడులకు దిగటంతో వ్యవహారం రచ్చకెక్కింది. ఒకవైపు టీడీపీలో సీటు మైనార్టీకి ఇవ్వాలని జలీల్ ఖాన్.. ఇప్పుడు జనసేనలో కూడా మైనార్టీలకు ఇవ్వాలని గయాజుద్దీన్ డిమాండ్ చేయడంతో ఇప్పుడు టికెట్ ఏ సామాజిక వర్గానికి ఇస్తారనే ఆసక్తి పెరిగింది. ఇప్పటికే మైనార్టీలకు వైసీపీ టికెట్ ఇవ్వటంతో టీడీపీ-జనసేన నేతలు కూడా అదే ఈక్వేషన్‌ని తెరమీదకు తెచ్చి అధిష్టానాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారట.
ఇక బెజవాడ సెంట్రల్ వైసీపీ (YCP) లో ఇప్పటికీ వెలంపల్లి, మల్లాది విష్ణులు ఒకే తాటికి మీదకు రాలేదు. వచ్చే అవకాశాలు కూడా కనపడక పోవటంతో వెలంపల్లి విష్ణు వర్గాన్ని దూరం పెట్టి ఎన్నికల్లో కీలక బాద్యతల్ని పశ్చిమ నుంచి తీసుకువచ్చిన తన వర్గానికి అప్పచెబుతున్నారు. విష్ణు వర్గం కూడా వెలంపల్లి కోసం పనిచేయకూడదని తీర్మానించిందట. మరోవైపు ఇక్కడ టీడీపీలో టికెట్ విషయమై ఇన్చార్జి బోండా ఉమా, వంగవీటి రాధా (Vangaveeti Radha) వర్గాల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. సోషల్ మీడియా, వాట్సప్, ఫోన్ కాల్ సర్వే ద్వారా వీరి మధ్య టికెట్ వార్ పెరుగుతోంది. ఎవరికి ఇస్తారనే క్లారిటీ అధిష్టానం ఇవ్వకముందే నియోజకవర్గంలో రచ్చ జరగటం టీడీపీని ఇరుకున పెడుతోందట.
ఇదే అంశాన్ని అస్త్రంగా చేసుకుని వెలంపల్లి కూడా బోండా ఉమాపై విమర్శలు చేస్తుండటంతో వీలైనంత త్వరగా టికెట్ క్లారిటీ ఇవ్వాలని పార్టీ శ్రేణులు టీడీపీ అధిష్టానాన్ని కోరుతున్నట్టు తెలిసింది. సెంట్రల్ లో మాటల యుద్ధం బోండా ఉమా, వెలంపల్లి మధ్య జరుగుతుండగా టికెట్ వార్ వంగవీటి రాధా, బోండా ఉమా మధ్య ఉంది. మొత్తంగా విజయవాడ సెంట్రల్, పశ్చిమ నిత్యం రాజకీయ రగడకు కేరాఫ్ అడ్రస్ లుగా మారుతున్నాయనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో గట్టిగానే జరుగుతోంది.