కేసీఆర్, జగన్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కారాలుమిరియాలు నూరిన కేసీఆర్.. ఏపీకి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంచి సంబంధాలు కొనసాగించారు. ఇక రాజకీయంగానే కాదు.. వ్యక్తిగతంగానూ కేసీఆర్‌తో మంచి ఫ్రెండ్షిప్ మెయింటేన్ చేశారు జగన్. ఇక కేసీఆర్ అయితే.. జగనే గెలుస్తారని ముందే ఓ అనౌన్స్‌మెంట్ ఇచ్చి.. తమ బంధం ఎంత స్ట్రాంగ్ అన్నది చెప్పకనే చెప్పారు. కట్ చేస్తే.. ఇద్దరి పార్టీలు ఓడిపోయాయ్.
ఇక్కడ బీఆర్ఎస్.. అక్కడ వైసీపీ.. అధికారం కోల్పోయాయ్. ఇక్కడ బీఆర్ఎస్ సర్కార్‌ను కాంగ్రెస్ ఇబ్బందులు పెడుతుంటే.. ఏపీలో వైసీపీని టార్గెట్ చేసి కూటమి సర్కార్. ఐతే చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంటూ.. ఢిల్లీ వేదికగా జగన్ దీక్షకు దిగారు. ఇండియా కూటమిలోని కాంగ్రెస్ మినహా.. ఇతర పక్షాలు జగన్‌కు మద్దతుగా నిలిచాయి. ఐతే బీఆర్ఎస్ నుంచి మాత్రం ఒక్కరు కూడా కనిపించలేదు. కేసీఆర్‌తో మంచి సంబంధాలు కొనసాగించిన జగన్‌కు.. బీఆర్ఎస్ మద్దతు తెలపకపోవడం ఏంటి అనే ప్రశ్న మొదలైంది. జగన్, కేసీఆర్ దోస్తీకి బ్రేకపేనా అనే చర్చ జరుగుతోంది. జగన్ దీక్షకు ఇండియా కూటమిలోని కాంగ్రెస్ తప్ప.. దాదాపు అన్ని పార్టీలు సపోర్ట్ ఇచ్చాయ్. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ అయితే.. స్వయంగా జగన్‌తో కలిసి దీక్షలో పాల్గొన్నారు. ఎంఐఎం, టీఎంసీ, అన్నా డీఎంకే, జేఎంఎం, ఆప్, ఆల్ ఇండియా ముస్లింలీగ్, ఉద్దవ్ శివసేన పార్టీలు మద్దతు ప్రకటించాయ్. ఇన్ని పార్టీలు సపోర్ట్‌గా నిలిచినా.. బీఆర్ఎస్ నుంచి మాత్రం ఎవరూ హాజరు కాలేదు.
ఐతే ప్రస్తుతం బీజేపీకి దగ్గరయ్యేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీలో కారు పార్టీ విలీనం ఖాయమనే వార్తలు కూడా వినిపిస్తున్నాయ్. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ భాగస్వామిగా ఉన్న కూటమి సర్కార్‌పై.. జగన్ చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ నుంచి ఒక్కరు కూడా హాజరుకాకపోవడం ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. పైగా జగన్ దీక్షకు ఇండియా కూటమి సపోర్ట్ ఇవ్వడం మరో ఆసక్తికర పరిణామానికి దారి తీస్తోంది. ఇదే నిజమయితే.. ఇవే పరిస్థితులు కొనసాగితే.. ఇక జగన్, కేసీఆర్ ఫ్రెండ్షిప్ బ్రేకప్ ఖాయం అనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య.. జగన్ దీక్షపై బీఆర్ఎస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి మరి