ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఓడిపోవడం… కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి కూడా రెండు నెలలైంది. చంద్రబాబు పవర్ లోకిగా రాగానే… జగన్ తో అంటకాగిన అధికారుల్లో కొందర్ని పక్కనపెట్టేశారు. వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వలేదు. మరికొందర్ని తన పేషీ నుంచి తీసేసి లూప్ లైన్లో పడేశారు. నమ్మకంగా పనిచేసే కొందరు అధికారులను తన దగ్గర పెట్టుకున్నారు. కానీ గత వైసీపీ హయాంలో చక్రం తిప్పిన ఇంకా కొందరు అధికారులు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ చక్రం తిప్పుతున్నారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో వివరిస్తూ సీఎం చంద్రబాబు శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. అయితే వాటిని రూపొందించాల్సింది అధికారులే కావడంతో వాళ్ళల్లో కొందరు సాకులు చెబుతూ కావాలని ఆలస్యం చేస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో ప్రభుత్వం సరైన టైమ్ కి వైట్ పేపర్స్ రిలీజ్ చేయలేకపోయింది. ఈలోగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కావడంతో సభలోనే వాటిని విడుదల చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఇక అధికారుల నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి కూడా ఇబ్బందులు తప్పట్లేదు. అసెంబ్లీ, మండలిలో సభ్యులు తన శాఖకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు మంత్రిగా పవన్ జవాబు చెప్పాల్సి ఉంంది. కానీ వాటికి సమాధానాలను అధికారులు తూతూ మంత్రంగా ప్రిపేర్ చేస్తుండటంపై పవన్ అసంతృప్తిగా ఉన్నారు. తప్పుడు సమాచారం ఇస్తున్నారని సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు సమగ్రంగా జవాబు ఇవ్వకుండా… అవును… కాదు… ఉత్పన్నం కాదు… అంటూ పొడి పొడిగా ఆన్సర్స్ ఇవ్వడమేంటని మండిపడ్డారు పవన్ కల్యాణ్. అలా పొడి పొడిగా సమాధానాలు చెప్పాలని రూల్ ఏమైనా ఉందా అంటూ ప్రశ్నించారు.
ఇంకా వైసీపీకి కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. గ్రామ పంచాయతీల నిధుల మళ్ళింపుపై అధికారులు సరైన సమాచారం ఇవ్వలేదన్నారు. అధికారుల తీరుపై పవన్ తో పాటు… మరో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కూడా ఆగ్రహంగా ఉన్నారు. SC, ST సబ్ ప్లాన్ నిధుల మళ్ళింపుపై అధికారులు సరైన సమాచారం ఇవ్వలేదని మంత్రి డోలా కూడా ఆరోపించారు. గత ప్రభుత్వంలో అక్రమాలను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.
ఏపీ రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తన జిల్లా వైఎస్సార్ కడపలో ఓ సమస్య పరిష్కారానికి కడప ఆర్టీసీ జోన్ ED గిడుగు వెంకటేశ్వరరావుకి ఆయన కాల్ చేశారు. దాదాపు మంత్రులెవరూ డైరెక్ట్ గా అధికారులకు కాల్ చేయరు. కానీ ఆయనే స్వయంగా మూడు సార్లు ఫోన్ చేసినా ఆర్టీసీ ఈడీ స్పందించలేదు. దాంతో కోపం నషాళానికెక్కిన మంత్రి మండపల్లి… ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ ఈడీని కడప నుంచి విజయవాడకు ట్రాన్స్ పర్ చేశారు. వైసీపీ హయాంలో అంటకాగిన కొందరు అధికారులు ఇంకా ఆ పార్టీ లీడర్లకు కోవర్టులుగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.