ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రమాణం స్వీకారం చేశారు. ఆయనతో పాటు 24 మంది మంత్రి పదవులు చేపట్టారు. వీళ్ళల్లో 17 మంది కొత్తవాళ్ళయితే… ఏడుగురికి గతంలో పనిచేసిన అనుభవం ఉంది. అయితే ఏపీలో మొత్తం 25 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది. కానీ 24 మందిని భర్తీ చేసిన బాబు… ఇంకో పోస్టును పెండింగ్ లో పెట్టారు. ఇప్పుడు ఆ ఒక్క మంత్రి పదవిని ఎవరికి ఇస్తారన్న టాక్ నడుస్తోంది. జనసేన (Janasena), బీజేపీ (BJP) ల్లో ఏ పార్టీకైనా అవకాశం దక్కుతుందా… లేదంటే టీడీపీకి చెందిన మరో నేతకు కేబినెట్ లో ఛాన్సిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఏపీలో టీడీపీ (TDP) నుంచి 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందువల్ల ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి చొప్పున టీడీపీకి 21 పదవులు కేటాయించారు. జనసేనలో గెలిచింది 21 మంది ఎమ్మెల్యేలు. అందుకే పవన్ కల్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ … అంటే ముగ్గురికి అవకాశం దక్కింది. ఇక బీజేపీ నుంచి గెలిచింది 8 మంది ఎమ్మెల్యేలు కావడంతో వాళ్ళకి ఒక మంత్రి ఇచ్చారు చంద్రబాబు.
ఏపీ కేబినెట్ మినిస్టర్స్ లిస్టును అర్థరాత్రి తర్వాత రిలీజ్ చేశారు. అంతకుముందు బీజేపీలో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలన్న దానిపై కేంద్రమంత్రి అమిత్ షాతో మంగళవారం రాత్రి చర్చించారు చంద్రబాబు. ఆ భేటీలోనే సత్యకుమార్ పేరు ఖరారైంది.
బీజేపీలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలన్నది తేలకపోవడం వల్లే లిస్ట్ రిలీజ్ ఆలస్యమైంది. అయితే బీజేపీ మరో కేబినెట్ మినిస్ట్రీ అడిగినట్టు తెలుస్తోంది. అందుకే మరో మంత్రి పదవిని చంద్రబాబు ఖాళీగా ఉంచినట్టు సమాచారం. బీజేపీకి ఛాన్స్ ఇస్తే… కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరిలో ఎవరో ఒకరికి అవకాశం దక్కనుంది. ఏపీ కేబినెట్ లో మిగిలిన ఆ ఒక్క మంత్రి పదవిని చంద్రబాబు బీజేపీ ఎమ్మె్ల్యేకు అవకాశం ఇస్తారా లేదంటే తమ పార్టీకి చెందిన సీనియర్ నేతకు కట్టబెడతారా అన్నది కొన్ని రోజుల్లో తేలనుంది.