Krishna Teja : పవన్ పేషీలోకి పవర్ ఫుల్ సింగం.. ఏరి కోరి తెచ్చుకుంటున్న జనసేనాని

టీడీపీని అధికారంలోకి తేవడానికి కీలకమైన పవన్ కు సీఎం చంద్రబాబు నాయుడు కూడా పెద్ద బాధ్యతలే ఇచ్చారు. డిప్యూటీ సీఎంతోపాటు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా, పంచాయతీరాజ్, అటవీ-పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఇచ్చారు. పవర్ ఫుల్ శాఖలు తన దగ్గరే ఉంచుకున్న పవన్ కల్యాణ్... తన ఆశయాలను నెరవేర్చే పవర్ ఫుల్ టీమ్ కోసం చూస్తున్నారు.

 

 

అధికారం దక్కగానే సరిపోదు… ఐదేళ్ల పాటు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వాళ్లకు మేలు చేయటం ద్వారా తిరిగి వాళ్ళ రుణం తీర్చుకోవాలి… ఎన్నికల్లో హండ్రెడ్ పర్సంట్ రిజల్ట్స్ సాధించిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో అన్న మాటలు ఇవి. పదేళ్లు అధికారం కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇప్పుడు అంతే నిజాయతీగా ప్రజలకు సేవ చేయాలని డిసైడ్ అయ్యారు పవన్.

టీడీపీని అధికారంలోకి తేవడానికి కీలకమైన పవన్ కు సీఎం చంద్రబాబు నాయుడు కూడా పెద్ద బాధ్యతలే ఇచ్చారు. డిప్యూటీ సీఎంతోపాటు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా, పంచాయతీరాజ్, అటవీ-పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఇచ్చారు. పవర్ ఫుల్ శాఖలు తన దగ్గరే ఉంచుకున్న పవన్ కల్యాణ్… తన ఆశయాలను నెరవేర్చే పవర్ ఫుల్ టీమ్ కోసం చూస్తున్నారు. ఈ టైమ్ లో మైలవరపు కృష్ణతేజ పేరు వినిపించింది. తెలుగు వ్యక్తి అయిన… కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం కేరళలోని త్రిసూర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. ఆయన్ని తన పేషీలోకి తెచ్చుకోవాలని జనసేనాని డిసైడ్ అయ్యారు.

IAS కృష్ణతేజ ఏడేళ్ల కెరీర్‌లో సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ 2014 సివిల్స్ పరీక్షలో 66 ర్యాంకు సాధించారు. ట్రైనింగ్ తర్వాత 2017లో కేరళ క్యాడర్‌లో అలెప్పీ జిల్లా సబ్ కలెక్టర్ గా నియమితులయ్యారు. డ్యూటీ ఎక్కిన కొద్ది రోజుల్లోనే.. దేశంలోనే ఆయన పేరు మార్మోగింది. 2018లో వచ్చిన వరదలతో కేరళ రాష్ట్రం తల్లడిల్లింది. అలెప్పీ జిల్లాపైనా తీవ్ర ప్రభావం పడింది. అక్కడ సబ్ కలెక్టర్ గా ఉన్న కృష్ణతేజ ఆపరేషన్ కుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న రెండున్నర లక్షల మందిని 48 గంటల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానిక మత్స్యకారులు, బోటు యజమానులు అందరితో కలసి కృష్ణతేజ ఈ రెస్క్యూ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ కుట్టునాడు సూపర్ సక్సెస్ అయింది. ఓ ఐఏఎస్ ఆఫీసర్ గా కృష్ణ తేజ ఫస్ట్ సక్సెస్ ఇది.

వరదల తర్వాత సర్వం కోల్పోయిన బాధితుల కోసం ‘ఐ యామ్ ఫర్ అలెప్పీ’ పేరుతో ఓ ఫేస్ బుక్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఇంటర్నెట్ లో వైరల్ గా మారడంతో కేరళతో పాటు… వేరే రాష్ట్రాల నుంచి కూడా అలెప్పీకి భారీగా సాయం అందింది. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కూడా విరాళాలు సేకరించి అలెప్పీలో ఇళ్ళు నిర్మించారు. ఆ బాధ్యతలు కూడా కృష్ణ తేజకే అప్పగించారు రామోజీరావు. బాహుబలి టీమ్ ద్వారా రాజమౌళి, సుమ లాంటి ఎంతోమందితో క్యాంపెయిన్ చేయించారు. అలెప్పీలో బాధితులకు సాయం అందేలా కృష్ణతేజ పనిచేశారు. అక్కడ బాహుబలి టీమ్ బాధితులకు కొన్ని పక్కా ఇళ్ళు కూడా కట్టించింది. FBలో చేపట్టిన ఐయామ్ ఫర్ అలెప్పీ సృష్టించిన విప్లవం యునిసెఫ్ లాంటి సంస్థలనే ఆకట్టుకుంది. ఆ సంస్థ స్పెషల్ గా పేజ్ ను కూడా మెయింటైన్ చేసింది. వరదలతో నిలిచిన నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ ను తిరిగి ప్రారంభించేలా కృష్ణ తేజ పనిచేశారు. 2019లో కేరళకు సాయం చేసిన అల్లు అర్జున్ ను, ఆ తర్వాత ఏడాది క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ను బోట్ రేస్ కి అతిథులుగా పిలిచారు. కృష్ణ తేజ అలెప్పీ సబ్ కలెక్టర్ నుంచి ట్రాన్స్ ఫర్ పై పర్యాటక శాఖకు వెళ్ళినప్పుడు అలెప్పీ జనం కన్నీళ్ళు పెట్టుకున్నారు.

టూరిజంకు కేరాఫ్ అయిన కేరళ పర్యాటక శాఖకు ఎండీ అయిన కృష్ణతేజ… అక్కడ కూడా తన మార్క్ చూపించారు. కేరళ టూరిజంలో విప్లవాత్మక మార్పులే తెచ్చారు. కరోనా టైమ్ లో ప్రభుత్వం కృష్ణతేజకు కేరళ సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ కి జనరల్ మేనేజర్ గా నియమించింది. ఆ సంక్షోభ సమయంలో జనం ఆకలితో పస్తులు ఉండొద్దని… ఇంటింటికీ ఫుడ్ కిట్, నిత్యావసరాలు అందించేలా కృష్ణ తేజ ప్లాన్ చేశారు. ఆ తర్వాత తనకు పేరు తెచ్చిన అలెప్పీ జిల్లాకే కలెక్టర్ గా వెళ్ళారు. ఆ జిల్లాలో వెంబనాడ్ సరస్సును ఆక్రమించి కట్టిన 200 కోట్ల రూపాయల విలువైన 54 లగ్జరీ విల్లాలను కుప్పకూల్చారు కలెక్టర్ కృష్ణతేజ. వెంబనాడ్ సరస్సు తీరంలో కట్టిన కాపికో రిసార్టు కూల్చడం ద్వారా మాఫియాను తరిమికొట్టారు. కోవిడ్ తో తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలకు సెలబ్రెటీల ద్వారా చదువుకు సాయం అందించి… అక్కడి పిల్లలకు కలెక్టర్ మామన్ గా పేరు తెచ్చుకున్నారు. అలెప్పీ పిల్లల దృష్టిలో కృష్ణ తేజ ఓ హీరో. అందుకే ఆయన బొమ్మలను స్వయంగా గీసి ప్రెజెంట్ చేస్తుంటారు పిల్లలు.

ప్రస్తుతం కృష్ణతేజ కేరళలో త్రిసూర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. వీఐపీ అంటూ ఓటర్ కు పట్టం కడుతూ ఈమధ్య జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆయన చేపట్టిన కార్యక్రమానికి CEC నుంచి ప్రశంసలు దక్కాయి. చిన్నారుల సంక్షేమానికి పనిచేస్తున్నందుకు ఆయనకు తపన కేంద్రం బాలల హక్కుల పరిరక్షణ అవార్డు ఇచ్చింది. ఇలా ఎన్నో అవార్డులు అందుకున్నారు. కృష్ణ తేజ టాలెంట్ తెలుసుకున్న పవన్ కల్యాణ్… ఇలాంటి పవర్ ఫుల్ ఆఫీసర్ తన పేషీలో ఉండాలని డిసైడ్ అయ్యారు. సీఎం చంద్రబాబుతో కూడా చర్చించారు. ఈమధ్యే బాబుతో పాటు పవన్ కలిశారు ఐఏఎస్ అధికారి కృష్ణతేజ. కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసి… డిప్యూటేషన్ పై ఏపీకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పేషీలో కృష్ణతేజ కీలక బాధ్యతలు తీసుకునే అవకాశాలున్నాయి. కృష్ణ తేజ లాంటి నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న అధికారులను తన పేషీలో పెట్టుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ ఆలోచిస్తున్నారు. పవన్ ఆశయాలను కృష్ణ తేజ నిలబెడతారని జనసైనికులు, పవన్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. పవన్ సినిమాల్లో హీరో అయితే… కృష్ణ తేజ రియల్ హీరో… చూడాలి వీళ్ళ పవర్ ఫుల్ జర్నీ ఎలా ఉంటుందో.