Comedian Ali, Pawan kalyan : పవన్‌ని నమ్ముకొని ఉంటే ఎక్కడో ఉండేవాడు..

కమెడియన్ అలీ.. వైసీపీకి షాక్ ఇచ్చాడు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తాను ఏ పార్టీకి సంబంధించిన మనిషి కాదని వివరిస్తూ అలీ ఓ స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశాడు.

 

 

 

కమెడియన్ అలీ.. వైసీపీకి షాక్ ఇచ్చాడు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తాను ఏ పార్టీకి సంబంధించిన మనిషి కాదని వివరిస్తూ అలీ ఓ స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఇన్నాళ్లూ రాజకీయాల్లో కొనసాగి.. మూడు పార్టీలు మారిన అలీ.. ఇప్పుడు ఒక్కసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది. అలీ ఇంత సడెన్ డెసిషన్ ఎందుకు తీసుకున్నారనే చర్చ.. జోరుగా సాగుతోంది.

ఈ విషయం మీద ఎవరికి వారు అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాను హీటెక్కిస్తున్నారు. అలీకి అనువిప్పు జరిగిందని కొందరు అంటుంటే.. రాజకీయ మత్తు దిగిందని మరికొందరు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. అలీ ఒక్కసారిగా రాజకీయాల నుంచి తప్పుకోవడం సరికొత్త చర్చకు దారి తీస్తోంది. తాను ఒక సామాన్యుడిని మాత్రమేనని.. ఇకపై సినిమా, షూటింగ్‌పై దృష్టి పెట్టాలని అనుకుంటున్నానని.. ప్రతి ఐదేళ్లకు ఒకసారి అందరి తరహాలోనే ఓటు వేస్తానంటూ అలీ చెప్పిన మాటలు.. ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతున్నాయ్. సినిమాల గురించి, షూటింగ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పుకునే పరిస్థితులు వచ్చాయి అంటే.. వైసీపీ ఎఫెక్ట్ అతని మీద ఏ స్థాయిలో పడిందో అర్థం అవుతుందనే చర్చ జరుగుతోంది. క్లియర్‌గా చెప్పాలంటే ఇప్పుడు అలీ.. పూర్తిగా ఖాళీ. నిజానికి వైసీపీలో ఆయనకు ఎలాంటి న్యాయం జరగలేదు.

టీడీపీ, జనసేన తర్వాత వైసీపీ గూటికి చేరారు అలీ. జగన్ ఏదో చేస్తారని అలీ ఆశించారు. ఐతే వైసీపీ అధినేత టికెట్ ఇవ్వలేదు. ఎందుకు అనే కారణం కూడా చెప్పలేదు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏదో నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి సరిపెట్టారు తప్ప.. అలీ కోరికలను డిమాండ్లను పట్టించుకున్నట్లు కూడా జగన్ కనిపించలేదు. నిజానికి ఈ ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీ సీటును అలీ అడిగారు. ఐతే జగన్ మాత్రం నో చెప్పేశారు. దీంతో అలీ అలకపాన్పు ఎక్కారు. వైసీపీ తరఫున ప్రచారంలో కూడా కనిపించలేదు. ప్రచారం జరుగుతున్నంత సేపు దుబాయ్‌లోనే ఉన్నారు. సరిగ్గా పోలింగ్‌కు ముందు ఇండియాలో ల్యాండ్ అయ్యారు. ఐతే ఇప్పుడు వైసీపీ ఘోర పరాభవం తర్వాత.. అలా పూర్తిగా నిరాశలో మిగిలిపోయారు. పార్టీని వీడారు. మూడు పార్టీలు మారి.. రాజకీయాలను వదిలేసి.. సాధించింది ఏంటి అలీ అంటూ ఇప్పుడు ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. రాజకీయాల కోసం క్లోజ్ ఫ్రెండ్‌ను దూరం పెట్టారు.

జనసేనను వదిలి వైసీపీలో చేరారు. అక్కడ కూడా న్యాయం జరగక ఇప్పుడు ఏకంగా రాజకీయాలకే దూరంగా ఉన్నారు. 30ఏళ్లుగా అలీకి పవన్ కల్యాణ్ స్నేహితుడు. పవన్ ప్రతి సినిమాలో ఆలీ ఉండేవాడు. ఐతే ఇప్పుడు పెట్టుకోవడం లేదు.స్క్రీన్‌ మీద కాదు పర్సనల్‌ లైఫ్‌లో చాలా క్లోజ్‌గా ఉండేవారు. అలాంటిది రాజకీయాల కారణంగా.. పవన్‌కు అలీ దూరం అయ్యాడు. పోనీ రాజకీయాల్లో అయినా పర్మినెంట్‌గా ఉన్నాడా అంటే అదీ లేదు. పవన్ పోయాడు.. పదవి కూడా పోయింది.. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు వదిలేయడం తప్ప.. అలీకి వేరే మార్గం కనిపించినట్లు లేదు. ఐతే ఈ దూరం కూడా తాత్కాలికమేనని.. త్వరలో ప్రాణస్నేహితుడి దగ్గరకు అలీ వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. త్వరలోనే ఆయన జనసేన తీర్థం పుచ్చుకునే చాన్స్ ఉందని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. మరి పవన్ రియాక్షన్ ఎలా ఉంటుంది.. ఏం జరగబోతుంది అన్నది వెయిట్ అండ్ వాచ్‌.