VIVEKA WIFE : జగన్ కి కాంగ్రెస్ షాక్… పులివెందులలో సౌభాగ్యమ్మ పోటీ

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తన కుటుంబం నుంచే గట్టి పోటీ ఎదురవుతోంది. బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు జగన్ కు ఇబ్బందికరంగా మారింది. ఆ కేసు విషయంలో ఏం మాట్లాడినా బూమరాంగ్ అవుతోంది. ఇప్పుడు ఏకంగా వివేకానంద భార్య సౌభాగ్యమ్మ... పులివెందులలో జగన్ పై పోటీ చేస్తున్నారు.

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తన కుటుంబం నుంచే గట్టి పోటీ ఎదురవుతోంది. బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు జగన్ కు ఇబ్బందికరంగా మారింది. ఆ కేసు విషయంలో ఏం మాట్లాడినా బూమరాంగ్ అవుతోంది. ఇప్పుడు ఏకంగా వివేకానంద భార్య సౌభాగ్యమ్మ… పులివెందులలో జగన్ పై పోటీ చేస్తున్నారు.

బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో సీఎం జగన్ ప్రమేయం ఉందని మొదటి నుంచీ వైఎస్ కుటుంబం నుంచి ఆరోపణలు వస్తున్నాయి. వివేకా భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీతతో పాటు PCC అధ్యక్షురాలు షర్మిల కూడా జగన్ ను తప్పుబట్టారు. పైగా ఆ కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి కడప టిక్కెట్ ఇవ్వడంపైనా విమర్శలు వచ్చాయి. ఆయన మూడోసారి ఎంపీ బరిలో దిగారు. అందుకే కడప లోక్ సభ నియోజకవర్గంలో అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా షర్మిల కూడా పోటీ చేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ప్రచారం కూడా ప్రారంభించారు. ప్రతి మీటింగ్ లోనూ వివేకా హత్యను ప్రస్తావిస్తున్నారు. జగన్ తో పాటు అవినాష్ ని టార్గెట్ చేస్తూ షర్మిల మాట్లాడుతున్నారు. ఈ ప్రచారంలో సునీత కూడా పాల్గొంటున్నారు.

ఇప్పుడు పులివెందులలో సీఎం జగన్ కి కాంగ్రెస్ గట్టి షాక్ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఆయనపై వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మను దించుతోంది. కాంగ్రెస్ తరపున ఆమెను పోటీకి పెడుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి త్వరలోనే ఓ ప్రకటన వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కడప ఎంపీ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాల్లో దశాబ్దాలుగా వైఎస్ కుటుంబ సభ్యులే గెలుస్తున్నారు. జగన్ ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడోసారి పోటీలో ఉన్నారు. కడప ఎంపీగా షర్మిల పోటీ చేస్తుండటంతో… పులివెందుల నుంచి సౌభాగ్యమ్మను దించితే… రాజకీయకంగా కొంతవరకూ కలిసొస్తుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. దాంతో కడప ఎంపీ, పులివెందుల ఎమ్మెల్యే స్థానాల్లో వైఎస్ కుటుంబం నుంచే కాంగ్రెస్, వైసీపీ అభ్యర్థులు బరిలో ఉంటున్నారు. ఈ రెండు నియోజకవర్గాలపై రాష్ట్రమంతటా చర్చ నడుస్తోంది.