YCP Adimulapu Suresh : వైసీపీకి ఆదిమూలం టెన్షన్

ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఎంపీ (Tirupati MP Seat ) సీటు... దాదాపు 35 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీకి (Telugu Desam Party) గెలుపన్నది లేని లోక్‌సభ నియోజకవర్గం. మొదట్లో కాంగ్రెస్‌ పార్టీ (Congress Party), తర్వాత వైసీపీ (YCP) వరుసగా గెలుస్తున్నాయి. అలాంటి సీట్లో వైసీపీ టిక్కెట్‌ ఇస్తే... ఎగిరి గంతేస్తారు ఏ నాయకుడైనా. కానీ... సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మాత్రం నాకొద్దని తిరస్కరించారు.

ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఎంపీ (Tirupati MP Seat ) సీటు… దాదాపు 35 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీకి (Telugu Desam Party) గెలుపన్నది లేని లోక్‌సభ నియోజకవర్గం. మొదట్లో కాంగ్రెస్‌ పార్టీ (Congress Party), తర్వాత వైసీపీ (YCP) వరుసగా గెలుస్తున్నాయి. అలాంటి సీట్లో వైసీపీ టిక్కెట్‌ ఇస్తే… ఎగిరి గంతేస్తారు ఏ నాయకుడైనా. కానీ… సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మాత్రం నాకొద్దని తిరస్కరించారు. పైగా తన సిట్టింగ్‌ ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదంటూ… సైకిల్ ఎక్కడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఎపిసోడ్‌ చిత్తూరు జిల్లా వైసీపీని కుదిపేస్తోందట. అధికార పార్టీలో తనకు అవమానాలు ఎదురయ్యాయనీ… మానసిక క్షోభ పడ్డానని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేసిన కామెంట్స్‌ కలకలం రేపుతున్నాయి. ప్రత్యేకించి మంత్రి పెద్దిరెడ్డిపై తిరుగుబాటు చేసిన తీరు గురించి చర్చించుకుంటున్నాయి పార్టీ వర్గాలు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇంతవరకూ వైసీపీ ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలుగానీ… కోనేటి ఆదిమూలం (Adimulapu Suresh) స్థాయిలో అధిష్ఠానాన్ని ధిక్కరించిన ఇతర నేతలెవరూ లేదు. ప్రాధాన్యత ఇవ్వలేదని ఒకరిద్దరు పార్టీని వీడినా… అధిష్ఠానాన్ని తప్పు పట్టలేదు. మదనపల్లెలో ఎమ్మెల్యే నవాజ్‌ బాషాకు, చిత్తూరులో ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులుకు టికెట్‌ లేదన్న పార్టీకి వ్యతిరేకంగా పెదవి విప్పలేదు. తిరుపతి సిట్టింగ్‌ ఎంపీని సత్యవేడు అసెంబ్లీకి పోటీ చేయమని ఆదేశించినా… ఆయన సైతం నోరు మెదపకుండా సత్యవేడులో పర్యటనలు ప్రారంభించారు. జీడీ నెల్లూరులో సిటింగ్‌ ఎమ్మెల్యే నారాయణస్వామికి టికెట్‌ లేదని, చిత్తూరు ఎంపీగా పోటీ చేయమని ఆదేశిస్తే… డిప్యూటీ సీఎంగా వుండి, ఎంతో సీనియర్‌ అయినా కూడా ఆయన శిరసావహించారు.

చిత్తూరు ఎంపీకి సైతం టికెట్‌ ఇవ్వకుండా జీడీ నెల్లూరు ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే కామ్‌గానే ఉన్నారు. ఇక పూతలపట్టులో సిటింగ్‌ ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబుకు టికెట్‌ తిరస్కరించిన వెంటనే మంత్రి పెద్దిరెడ్డిని విమర్శించారు. కానీ… అంతలోనే తొందరపడ్డానంటూ క్షమాపణలు చెప్పారాయన. ఇలా… ఎవరికి వారు అధిష్టానం ఆదేశాలను పాటిస్తున్న టైంలో… జిల్లా ఎస్సీల్లో పట్టున్న ఆదిమూలం ధిక్కార స్వరం వినిపించడం పార్టీ పెద్దలకు మింగుడు పడటం లేదట. ఎమ్మెల్యే టికెట్‌ లేదని చెప్పినా… అంతకంటే పెద్దస్థాయిలో తిరుపతి ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది ఆయనకు. పైగా అది పార్టీకి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్న సీటు అన్నది విశ్లేషకుల అభిప్రాయం.

అలాంటి సీటును తిరస్కరించడం, అంతటితో ఆగకుండా… ఏకంగా పార్టీని వదిలేసి లోకేశ్‌ను కలవడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట వైసీపీ పెద్దలు. అదే సమయంలో ఆదిమూలం తిరుగుబాటుపై ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో గట్టి చర్చే జరుగుతోంది. తనకు పదవి, అధికారం కంటే గౌరవం ముఖ్యమనీ… వైసీపీలో అవమానాలు భరించలేక పోతున్నానని ఆదిమూలం చెప్పడం జిల్లాలో ఎస్సీ వర్గాలపై ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారట చిత్తూరు వైసీపీ నాయకులు. తన తప్పేమీ లేకున్నా… అవినీతి అభాండాలు వేయడం, తనకు తెలియకుండా సమావేశాలు పెట్టడం, సిట్టింగ్‌ సీటును నిరాకరించడాన్ని ఏమనుకోవాలని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఆదిమూలం. తనకు ఇచ్చిన ఎంపీ అవకాశం కంటే… ఈ అవమానాన్ని తట్టుకోలేక పోతున్నానన్నది ఆయన మాటగా ప్రచారం జరుగుతోంది.

తనకు సిట్టింగ్‌ సీటు దక్కకుండా మంత్రి పెద్దిరెడ్డే అడ్డుకున్నారన్న అనుమానంతో విమర్శల పర్వంలో ముందు ఆయన్నే టార్గెట్‌ చేసుకున్నట్టు తెలిసింది. ఇసుక అక్రమ తవ్వకాలతోపాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) , ఎంపీ మిథున్‌రెడ్డి (MP Mithun Reddy) దళితులపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని, వారికి ఇష్టానుసారంగా షరతులు విధిస్తున్నారని చేసిన ఆరోపణలు అందులో భాగమేనన్నది లోకల్‌ టాక్‌. ఈ క్రమంలో ఆదిమూలం ప్రభావంపైనే జిల్లా వైసీపీలో ఎక్కువ చర్చ జరుగుతోంది. జీడీ నెల్లూరు, పూతలపట్టు, సత్యవేడు, నగరి, పుత్తూరు సహా జిల్లాలో చాలాచోట్ల ఆదిమూలంకు విస్తృతమైన పరిచయాలు, బంధుగణం ఉంది. వ్యక్తిగతంగా సౌమ్యుడన్న పేరు కూడా ఉంది ఆయనకు.

అందుకే ఆయన విషయంలో తొందరపడ్డామా అన్న ప్రశ్న కూడా వస్తోందట వైసీపీలోని ఓ వర్గం నేతల్లో. అయితే ఆదిమూలం నేరుగా వెళ్లి టీడీపీ నేత లోకేష్‌ను కలవడాన్ని జీర్ణించుకోలేని నాయకులు, కార్యకర్తలు కొందరు దిష్టి బొమ్మలు తగలబెట్టారు. ఆ ఎపిసోడ్‌తో ఎమ్మెల్యేకే సానుభూతి పెరిగిందన్న రిపోర్ట్స్‌తో ఇక సైలెంట్‌గా ఉండాలని చెప్పినట్టు సమాచారం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎస్సీ ఓట్‌ బ్యాంక్‌పై ఆదిమూలం ఎఫెక్ట్‌ ఎంతవరకు ఉంటుంది? దాన్ని వైసీపీ ఎలా కౌంటర్‌ చేసుకుంటుదన్నది ఇప్పుడు జిల్లా రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది.