నవంబర్ 16 1936.. కృష్ణా జిల్లా పెదపారుపూడిలో వెంకటసుబ్బారావు, వెంకటసుబ్బమ్మ దంపతులకు జన్మించారు రామోజీరావు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కిరణ్ ప్రభాకర్, చిన్న కుమారుడు సుమన్ ప్రభాకర్. సుమన్ అనారోగ్యం 2012లో చనిపోయారు. సుమన్ బుల్లితెర రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, ఆర్టిస్ట్‌గా, తెలుగు ప్రజలకు సుపరిచితుడు. ఇక పెద్ద కుమారుడు కిరణ్.. ఈనాడు గ్రూప్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పెద్ద కోడలు శైలజా కిరణ్.. మార్గదర్శి ఎండీగా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు ఇతర వ్యాపారాలను పర్యవేక్షిస్తున్నారు. రామోజీ రావు చిన్న కుమారుడు సుమన్ సతీమణి విజయేశ్వరి.. రామోజీ ఫిలిం సిటి మేనేజింగ్ డైరెక్టర్. అలాగే, రామోజీ గ్రూప్‌నకు చెందిన పలు సంస్థల బాధ్యతలు కూడా ఆమే నిర్వర్తిస్తున్నారు. రామోజీరావుకు చెందిన అన్ని సంస్థలను వీళ్లే పర్యవేక్షిస్తున్నారు.
పెద్దాయన ఏర్పాటు చేసిన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయనకు తోడుగా వీళ్లు ఇంతకాలం నిర్వహిస్తూ వచ్చారు. రామోజీ మరణంతో ఇప్పుడు వాళ్లు పెద్ద దిక్కును కోల్పోయారు. వాళ్లనను ఓదార్చడం ఎవరికీ సాధ్యం కావడంలేదు. వ్యాపార రంగంలో శిఖరంలా ఎదిగిన రామోజీరావుకు వీళ్లే ఇప్పుడు వారసులు. ఆయన సంసాధించిన లక్షల కోట్ల ఆస్తులకు కూడా వీళ్లే ఇప్పుడు వారసులు. 1962లో మార్గదర్శితో మొదలైన రామోజీ వ్యాపార ప్రస్థానం అనేక సంస్థలకు ప్రాణం పోసింది.
ఇక ఈనాడుతో మీడియా రంగంలో ఓ కొత్త శకానికి నాంది పలికారు రామోజీ. తెలుగు మీడియాలో వేలాది మంది జర్నలిస్టులు.. విద్యార్థులుగా ఆ ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వచ్చినవాళ్లే. సినీ రంగానికి ఆల్ ఇన్ వన్ డెస్టినేషన్‌గా ఉన్న రామోజీ ఫిలిం సిటీని నిర్మించి.. తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు రామోజీ. ఇక ప్రియా ఫుడ్స్, కళాంజలి సిల్స్క్, డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌తో తనను తానే వ్యాపార సామ్రాట్‌గా ప్రకటించుకున్నారు. ఇప్పుడు అవన్నీ ఆయన వారసుల సొంతం. ఎన్ని వేల కోట్ల విలువ చేసే ఆస్తులు ఇచ్చినా.. ఆయన లేని లోటును మాత్రం ఆ కుటుంబం ఎప్పటికీ తీర్చుకోలేదు.