ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న చాలామంది వైసీపీ అభ్యర్థులకు ఆస్తిపాస్తులు లేవట. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనట. ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ (CM Jagan) చెబుతున్న మాట ఇది. నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇప్పటికి నలుగురైదుగురు నేతలకు ఇలాగే చెప్పారు. కోట్ల రూపాయల ఆస్తులున్న వైసీపీ లీడర్లు పేదవాళ్ళని పరిచయడం చేయడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి.
కర్నూల్ జిల్లా (Kurnool District) బస్సుయాత్రలో (Bus Yatra) భాగంగా వైసీపీ అభ్యర్థులను జనానికి పరిచయం చేశారు ఆ పార్టీ అధినేత, సీఎం జగన్. వైసీపీ నుంచి పోటీ పడేవాళ్ళంతా పేదవాళ్ళు… పాపం… వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే అని చెప్పుకొచ్చారు. జగన్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరుగుతున్నాయి. వైసీపీ అభ్యర్థులకు ఎంతెంత ఆస్తులు ఉన్నాయో కూపీలాగి మెస్సేజ్ లు పెడుతున్నారు నెటిజెన్స్.
ఎమ్మిగనూరు వైసీపీ (YCP) అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని జగన్ చెప్పారు. 2014లో ఆమె కర్నూల్ ఎంపీగా గెలిచారు. అప్పుడు ఈసీకి ఇచ్చిన అఫిడవిట్ చూస్తే… ఆమె ఆస్తులు 242 కోట్ల 60 లక్షల రూపాయలు. పదేళ్ళల్లో బుట్టా రేణుక ఆస్తులు ఎన్ని రెట్లు పెరిగాయో తెలియదు. రేణుక ఫ్యామిలీకి ఆటోమొబైల్స్, హోటల్స్, చిట్ ఫండ్స్, కన్వెన్షన్ సర్వీసెస్… ఇలా చాలా రంగాల్లో వ్యాపారులు ఉన్నాయి. ఆమె పెట్టుకునే బంగారు నగల విలువే 2 కోట్లు ఉంటుందని ఈసీ అఫిడవిట్ లో తెలిపింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్, మాదాపూర్ లో మెరిడియన్ స్కూళ్ళు కూడా బుట్టా కుటుంబానివే. ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కి హైదరాబాద్ లో కోట్ల విలువైన ఇళ్ళు, స్థలాలు ఉన్నాయి. పంజాగుట్టలో ఓ హోటల్ ని బుట్టా రేణుకే స్వయంగా నడిపినిట్టు అఫిడవిట్ లో ఉంది.
ఆదోనీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డికి కూడా డబ్బుల్లేవని జగన్ చెప్పారు. 2019 ఎన్నికల అఫిడవిట్ లో ఆయన 5 కోట్ల 17 లక్షల ఆస్తులు చూపించారు. కోపరేటివ్ బ్యాంక్స్, కార్పొరేషన్లలో ఆయన భార్యకు పెట్టుబడులు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 50 ఎకరాల వ్యవసాయ భూములు, ఇళ్ళు, ప్లాట్లు, 35 లక్షల విలువైన కారు ఉన్నాయి.
ఇక మంత్రాలయం వైపీసీ కేండిడేట్ బాల నాగిరెడ్డి కూడా బీదవాడేనట. ఎన్నికల అఫిడవిట్ ప్రకారమే ఆయన ఆస్తులు 2 కోట్ల 29 లక్షలు. 44 ఎకరాల వ్యవసాయ భూమి, కర్నూల్ లో సొంతిల్లు ఉన్నాయి. బీమా ఎడ్యుకేషన్ సొసైటీలో వాటాలు ఉన్నాయి.
పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆస్తులు కూడా ఎన్నికల అఫిడవిట్ ప్రకారం బాగానే ఉన్నాయి. 3 కోట్ల 19 లక్షలను ఆమె చూపించారు. కర్నూలు జిల్లాలో 42 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తెలంగాణలో కూడా స్థలాలు, ఇళ్ళు ఉన్నాయి. కోడుమూరు అభ్యర్థి ఆదిమూలపు సతీష్ కూడా పేదవాడేనని జగన్ చెప్పారు. ఈయన మంత్రి ఆదిమూలపు సురేష్ తమ్ముడు. కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. కర్నూల్ తో పాటు ప్రకాశం జిల్లాలో విద్యాసంస్థలు, విలువైన భూములు, ప్లాట్లు ఉన్నట్టు చెబుతారు. కర్నూలులో బీఈడీ, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయంటున్నారు. ఇక ఆలూరి అభ్యర్థి విరూపాక్షి కూడా బీదవాడేనట. ఆయన రైల్వేలో క్లాస్ 1 కాంట్రాక్టర్ గా పనిచేశారు. ఇలా డబ్బున్న వాళ్ళందర్నీ జగన్ పేదవాళ్ళని పరిచయడం చేయడంపై ప్రతిపక్ష నేతలు ఫైర్ అవతున్నారు. నెటిజన్స్ వాళ్ళ ఆస్తులు తవ్వి తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.