RED SANDEL : పుష్పని అస్సలు వదలొద్దు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

ఏపీలో ఎర్ర చందనం స్మగ్లింగ్ కొన్నేళ్ళుగా జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ రవాణా మరింత పెరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్మగ్లర్లను ఏరివేసే పనిలో ఉన్నారు.

ఏపీలో ఎర్ర చందనం స్మగ్లింగ్ కొన్నేళ్ళుగా జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ రవాణా మరింత పెరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్మగ్లర్లను ఏరివేసే పనిలో ఉన్నారు. అసలు ఈ స్మగ్లర్ల వెనుక ఉన్న గజదొంగ పుష్పని పట్టుకోవాలని కీలక ఆదేశాలు ఇచ్చారు. శేషాచలం కొండల్లో అత్యంత విలువైన ఎర్రచందనాన్ని నరికి… జిల్లాలు, రాష్ట్రాలు దాటించి నేపాల్ లాంటి విదేశాల్లో అమ్ముకుంటున్నారు. కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారు స్మగ్లర్లు.

ఇప్పటి నుంచి నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించారు పవన్ కల్యాణ్. కడప జిల్లాలోని పోట్లదుర్తి జగనన్న కాలనీలో కోటి 60 లక్షల రూపాయల విలువైన ఎర్ర చందనం దుంగలను ఫారెస్ట్ అధికారులు పట్టుకొని నిందితుల్ని అరెస్ట్ చేశారు. దీనిపై రిపోర్ట్ పవన్ కల్యాణ్ కి చేరింది. శేషాచలం అడవుల్లో నరికిన ఎర్రచందనం దుంగలను ఎక్కడెక్కడ దాచారో వెతకండి… స్మగ్లర్ల నెట్వర్క్ ను నడిపిస్తున్న గజ దొంగలు ఎంతటి వాళ్ళయినా సరే పట్టుకొని అరెస్ట్ చేయాలని ఆదేశించారు.

గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై తిరుగుతున్న వాళ్ళు ఏం చేస్తున్నారో నిఘా పెట్టాలన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి ఇప్పటిదాకా నమోదైన కేసులు ఎన్ని… ఎంతమందికి శిక్షలు పడ్డాయి. కేసులు ఎందుకు వీగిపోతున్నాయో అధికారులు వివరాలు అందించాలని ఆదేశించారు పవన్ కల్యాణ్. నేపాల్ లాంటి ఇతర దేశాల్లో పట్టుబడ్డ దుంగలను తిరిగి ఇండియాకు రప్పించడంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. స్మగ్లర్లను నడిపిస్తున్న గజదొంగను మాత్రం వదలొద్దని కీలక ఆదేశాలు జారీ చేశారు.