TG-AP, Home ministers : డమ్మీలే హోం మంత్రులా?.. డమ్మీలనే హోం మంత్రులుగా ఎందుకు పెడతారు?

ఇక ఏపీలో 2014లో చంద్రబాబు నాయుడు చినరాజప్పనీ హోంమంత్రిని చేశారు. ఆయన పూర్తిగా ఎస్ బాస్ మంత్రి.. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అన్ని తానే నడిపించేవారు. డిజిపి నేరుగా సీఎం కే రిపోర్ట్ చేసేవాడు.

 

 

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడడానికి కొన్ని రోజులు ముందే రాష్ట్రానికి హోంమంత్రి ఎవరో జనానికి తెలిసిపోతుంది. ఖచ్చితంగా ఒక డమ్మీ కాండెట్ ని, విషయ పరిజ్ఞానం లేని లీడర్ని, లేదా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని, ఎదిరించి మాట్లాడలేని వాళ్ళని, ఎస్ బాస్ అనే వాళ్లని మాత్రమే హోం మంత్రులుగా నియమిస్తారని జనం అందరికీ ఎప్పుడో తెలుసు. అందుకే ప్రమాణ స్వీకారాలకు ముందే పలనా వాళ్లు హోమ్ మంత్రి అవుతారు అని మీడియా వాళ్ళు చెప్పేస్తారు, జనం మాట్లాడుకుంటారు. ఈసారి కూడా ఏపీలో వంగలపూడి అనితను హోం మంత్రిగా ప్రకటించగానే జనం అంతా… ఇది ఎప్పుడూ జరిగేదేగా అని అనుకున్నారు. ఇలా విషయ పరిజ్ఞానం లేని వాళ్లను, అసమర్థుల్ని ,డమ్మీనేతలని ఎందుకు హోం మంత్రిగా నియమిస్తారో తెలుసా? ప్యాక్

భారతదేశానికి రాష్ట్రపతులుగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం నేతలను మాత్రమే ఎన్నుకోవడం… అదేదో పెద్ద సామాజిక సంస్కరణ చేసినట్లుగా లీడర్లు, జనం మాట్లాడుకోవడం కొన్ని సంవత్సరాలుగా అలవాటు అయిపోయింది. రాష్ట్రపతి సీట్ అనగానే అది కేవలం ఎస్సీ ఎస్టీ నేతలకు మాత్రమే పరిమితమైన స్థానం అన్నట్లుగా పార్టీలు పోటీపడి మరి ఎన్నుకుంటాయి. ఒక ఎస్సీ ని, ఒక ఎస్టీ ని ఈ దేశానికి రాష్ట్రపతిని చేసాం చూశారా అని జబ్బులు చరుచుకుంటూ ఉంటారు. కానీ ఎస్సీ ఎస్టీలను ప్రధాన మంత్రులు గా చేయరు, రబ్బర్ స్టాంపు స్థానానికి మాత్రమే ఎస్సీ ఎస్టీలను డమ్మీలుగా ఉంచి సామాజిక సంస్కరణ జరిగినట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లోనూ అంతే. ముఖ్యమంత్రిగా రెడ్లు, కమ్మ, వెలమ నేతలు మాత్రమే ఉంటారు. అత్యంత ముఖ్యమైన హోం మంత్రిత్వ శాఖకు మాత్రం బలహీనమైన నాయకుల్ని, చెప్పు చేతల్లో ఉండే వాళ్లను, ఎస్సీలను నియమిస్తారు. పైగా ఎస్సీ, హోంమంత్రిని చేసాం… మహిళను హోం మంత్రిని చేసాం అని పదేపదే చెప్పడం ద్వారా వాళ్లని అవమానిస్తూ ఉంటారు.

ఈ పద్ధతి ఏ ఒక్క పార్టీకో పరిమితమైంది కాదు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలు, పార్టీ అధినేతలు ఇదే వరుస. దాదాపు 2004 నుంచి తెలుగు రాష్ట్రాల్లో హోం మంత్రులు అందరూ కేవలం డమ్మీ క్యాండిడేట్లే. 2004 కి ముందు కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాల హయాంలో హోం మంత్రులు గా పవర్ ఫుల్ లీడర్లు పనిచేశారు. మైసూరా రెడ్డి, ఎలిమినేటి మాధవరెడ్డి, దేవేందర్ గౌడ్ లాంటివాళ్ళు ఆ పదవిలో ఉన్నారు. వాళ్లు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే స్వతంత్రంగా నిర్ణయం తీసుకో గలిగేవాళ్లు. అలాగే రాష్ట్ర భౌగోళిక స్వరూపం పై పూర్తిగా పట్టు ఉన్నవాళ్లు. శాంతిభద్రతల సమస్యలు , నక్సల్ సమస్యలు, టెర్రరిజం…. పోలీస్ వ్యవస్థల్లో రకరకాల లెవెల్స్, వీటన్నిటిపై వాళ్లకి అవగాహన ఉండేది.2004 లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జానారెడ్డిని హోం మంత్రిగా నియమించారు. కానీ సమాంతరంగా కెవిపి రామచంద్రరావు ను శాంతి భద్రతల సలహాదారుగా పెట్టి జానారెడ్డిని డమ్మీని చేసి, కెవిపి ద్వారా వ్యవస్థ మొత్తం నడిపించేవాళ్ళు. డిజిపి,ఇంటిలిజెన్స్, హోం శాఖ కార్యదర్శి వీళ్లంతా నేరుగా సీఎం కి రిపోర్ట్ చేయడం మొదలైంది. ఆ తర్వాత హోం మంత్రి పదవి మరీ పలచన అయిపోయింది.

రెండోసారి ఎన్నికవ్వగానే వైయస్ ,సబితా ఇంద్రారెడ్డిని హోం మంత్రిగా నియమించారు. ఏం మహిళలు మాత్రం ఆ శాఖ నిర్వహించకూడదా…? ఇది మహిళా ప్రగతికి ఒక చిహ్నం అంటూ చెప్పుకొచ్చేవాళ్ళు. కానీ అసలు విషయం అది కాదు. ఇక్కడ మహిళల? పురుషుల? ఎస్సీల? ఎస్టీల? ఓసిలా అన్నది కాదు ముఖ్యం. సమర్ధుల కాదా అన్నది చూడాలి. వైయస్ కాలం నుంచి హోం మంత్రి పోస్టు పూర్తిగా డమ్మీ అయిపోయింది. సబితా ఇంద్రారెడ్డి సంతకానికి మాత్రం హోం మంత్రిగా ముద్రపడ్డారు. ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి కూడా సబితా ఇంద్రారెడ్డిని కొనసాగించారు. కానీ అప్పటి ఇంటిలిజెన్స్ చీఫ్ మహేందర్ రెడ్డి నేరుగా కిరణ్ కుమార్ రెడ్డికి రిపోర్ట్ చేసేవాళ్ళు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో కెసిఆర్ రాజరిక పాలన లో హోంమంత్రి మరింత డమ్మీ అయ్యారు.

మహమ్మద్ అలీని మంత్రిగా నియమించడం ద్వారా మైనారిటీలకు చాలా ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కెసిఆర్ బిల్డప్ ఇచ్చారు. కానీ మహమ్మద్ అలీ పూర్తిగా డమ్మీ కాండేట్. ఒక సాధారణ పోలీస్ స్టేషన్ లో సీఐ కూడా ఆయన చెప్తే వినే పరిస్థితి ఉండేది కాదు.10 ఏళ్ల పాలనలో కెసిఆర్ , కేటీఆర్ తెలంగాణలో డమ్మీ హోమ్ మంత్రిని పెట్టి నడిపారు. కేటీఆర్ నేరుగా హోంమంత్రికి, ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చేస్తూ ఉండేవారు. అప్పట్లో హోం మంత్రి మహమ్మదాలీపై జనంలో చాలా జోక్స్ ఉండేవి. ఆయన ఏడాదికోసారి కెసిఆర్ భుజానికి దండి , దస్తి కట్టడానికి తప్ప మరి ఎందుకు పనికి రాడని తెలంగాణ సెక్రటేరియట్లో మాట్లాడుకునేవాళ్ళు.

ఇక ఏపీలో 2014లో చంద్రబాబు నాయుడు చినరాజప్పనీ హోంమంత్రిని చేశారు. ఆయన పూర్తిగా ఎస్ బాస్ మంత్రి.. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అన్ని తానే నడిపించేవారు. డిజిపి నేరుగా సీఎం కే రిపోర్ట్ చేసేవాడు. ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వాలన్నా కూడా చినరాజప్ప లాంటి వాళ్లు సీఎంని అడగకుండా మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు. ఇక ఆ తర్వాత 2019లో జగనన్న రాజ్యం వచ్చిన తర్వాత హోం మంత్రి పదవి పూర్తిగా జీరో అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో ఇద్దరు ఎస్సీ మహిళ ఎమ్మెల్యేలను హోంమంత్రులుగా చేసి, తాను ఎస్సీలు, మహిళల జనోద్దరణ కు కట్టుబడి ఉన్నానని ప్రగల్బా లు పలికారు. హోం మంత్రి ఎంపికలో కూడా రాజకీయ లబ్ధి చూసుకున్నారు. మేకతోటి సుచరిత, తానేటి వనిత చెరి రెండున్నర సంవత్సరాలు హోమ్ మంత్రులుగా పనిచేశారు. వీళ్లు ఇద్దరూ పూర్తిగా డమ్మీలు. డిజిపి నేరుగా సీఎం కి రిపోర్ట్ చేసేవాడు.

ఇంటిలిజెన్స్ వ్యవస్థ మొత్తం సీఎం కంట్రోల్ లోనే ఉంది. జగన్ పేషీలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి హోం వ్యవహారాన్ని పరోక్షంగా నడిపారు . ఏదో అడపాదడపా స్టేట్మెంట్లు ఇవ్వడానికి, పోలీస్ స్టేషన్ల దగ్గర గార్డ్ ఆఫ్ ఆనర్ తీసుకోవడానికి తప్ప రాష్ట్రాలకు హోంమంత్రి ఉపయోగం లేకుండా పోయింది. అసలు సుచరిత, వనితలకు రాష్ట్రంలో ఏ సమస్యల పైన అవగాహన లేదు. ఒక దుర్ఘటన జరిగితే దానిపై రివ్యూ చేసే సామర్థ్యం కూడా లేదు. ముఖ్యమంత్రిపై ఎవరో గులక రాయి విసిరితే హోం మంత్రి మీడియా ముందుకు వచ్చి నాకు భయమేస్తుంది… పరిస్థితి చూస్తుంటే అని అన్నారంటే ఆమె ఎంత బలహీనురాలో అర్థం అవుతుంది. ఒక రేప్ సంఘటన జరిగితే బాధితురాలు గురించి ఎలా మాట్లాడాలో కూడా హోం మంత్రికి అవగాహన లేదు. అలాంటి ఇద్దరు డమ్మీ హోం మంత్రులను పెట్టి జగన్మోహన్ రెడ్డిరాష్ట్రంలో ఆ శాఖ నిర్వహించారు. ఐపీఎస్ ల బదిలీలు, డీఎస్పీలు, సిఐలు బదిలీలు ఇవి కూడా ముఖ్యమంత్రి కార్యాలయమే, హోం మంత్రి ప్రమేయం లేకుండా కానిచ్చేది. సీఎం కార్యాలయం ఏం చెప్తే అది హోం మంత్రి చేయాలి, ఏం స్టేట్మెంట్ ఇమ్మంటే అది ఇవ్వాలి. అంతవరకు నోరు మూసుకొని కూర్చోవాలి.

ఇది 20 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో హోం మంత్రుల దీన గాధ. కుల ఉద్ధరణ పేరుతో డమ్మీలను హోంమంత్రులుగా చేసి, సీఎం లే వ్యవస్థలు నడిపిస్తున్న పరిస్థితి. జిల్లా ఎస్పీలు, ఐజీలు ప్రైవేట్ గా కలిసినప్పుడు మన హోం మంత్రుల అతి తెలివి, బుర్ర తక్కువ మాటలపై జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఇప్పుడు వంగలపూడి అనిత విషయంలోనూ అంతే. పాత హోమ్మంత్రుల కంటే అనిత కాస్త మాటకారి గనక, మీడియాలో చాకచక్యంగా స్టేట్మెంట్లు ఇవ్వగలుగుతారు. అదొక్కటే అడ్వాంటేజ్. రేపటి నుంచి హోం శాఖ వ్యవహారాలన్నీ చంద్రబాబు నాయుడు లోకేష్ లే నడిపిస్తారు. డిజిపి, ఇంటెలిజెన్స్ బాసు సీఎం కే రిపోర్ట్ చేస్తారు. అసలు హోంమంత్రిని పట్టించుకోరు. ఇది అందరికీ తెలుసు. ఎవరు పైకి మాట్లాడరు అంతే. ఏపీ కొత్త హోం మంత్రి వంగలపూడి అనితది మరీ అమాయకత్వం. హోం మంత్రిగా ప్రకటన రాగానే మైక్ ముందు మాట్లాడుతూ… తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే డిజిపి ఆఫీస్ కు ఫిర్యాదు ఇవ్వడానికి చాలా సార్లు వచ్చానని, నన్నెవరూ పట్టించుకోలేదని ఇప్పుడు అదే డీజీపీతో సెల్యూట్ కొట్టించుకుంటాను అన్నట్లుగా మాట్లాడారు.

గడచిన ఐదేళ్లలో పెట్రేగిపోయిన వాళ్ళని ఎవర్ని వదిలిపెట్టను అని అనిత వార్నింగ్ ఇవ్వడం మరీ విచిత్రం. ప్రతీకారాలు తీర్చుకోవడానికి, కక్షలు కార్పన్యాల కోసం హోం మంత్రి పదవి ఇవ్వరు. హోం మంత్రి రాష్ట్రంలో ఆరు కోట్ల మంది శాంతి భద్రతల గురించి ఆలోచించాలి. అవన్నీ వదిలేసి ఇంకా పదవి తీసుకోక ముందే తనలో ఉన్న అపరిపక్వతను బయట పెట్టుకున్నారు అనిత. కులాల వారీగా మంత్రి పదవులు ఇవ్వడం, డమ్మీ అభ్యర్థులను హోంమంత్రులుగా పెట్టి ముఖ్యమంత్రులే పోలీసు వ్యవస్థను కంట్రోల్ చేయడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. వంగలపూడి అనిత పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ ఉండదు. ఊరికే మీడియా ముందు గప్పాలు కొట్టడం తప్ప చరిత్రలో నిలిచిపోయే అంత గొప్పగా హోం మంత్రిత్వ శాఖను అనిత నిర్వహించేది ఏమి ఉండదు. ప్రతి నిమిషం పైనుంచి ఆదేశాలను అమలు చేయడం మాత్రమే ఆమె చేయాల్సిన పని. ఇది అందరికీ తెలిసిన పచ్చి నిజం.