Jagan Security : అంత భయం ఎందుకు జగన్ ? 986 మంది సెక్యూరిటీ, 296 కోట్లు ఖర్చు

బయటకు గంభీరంగా మాట్లాడే జగన్మోహన్ రెడ్డికి ప్రాణ భయం ఉందా ? అందుకేనేమో... ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా 986 మందిని సెక్యూరిటీగా పెట్టుకున్నాడు.

 

 

బయటకు గంభీరంగా మాట్లాడే జగన్మోహన్ రెడ్డికి ప్రాణ భయం ఉందా ? అందుకేనేమో… ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా 986 మందిని సెక్యూరిటీగా పెట్టుకున్నాడు. ఐదేళ్ళల్లో 296 కోట్ల రూపాయలు జగన్ గారి భద్రతకే ఖర్చయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ పేయర్ల డబ్బుల్ని ఎలా వృధాగా ఖర్చుపెట్టారో ఆ సెక్యూరిటీ చూస్తే అర్థమవుతుంది.

జగన్ మోహన్ రెడ్డి 5యేళ్ళ పాలనలో… రౌడీషీటర్లను ఇబ్బంది పెట్టింది లేదు… మావోయిస్టులపై నిషేధం విధించింది లేదు… ఏపీలో మావోయిస్టుల ఉనికి కూడా బాగా తగ్గిపోయింది. అయితే గియితే ఎన్నికలకు ముందు కోడికత్తి… ఆ తర్వాత మొన్న ఎన్నికలకు ముందు గులకరాయి. ఈ రెండు సంఘటనలు తప్ప… జగన్ పై ఏనాడూ ఎలాంటి దాడీ జరగలేదు. ఆ మాటకొస్తే…. అసలు ఎటాక్ జరగడానికి ఛాన్సే లేదు… జగన్ టూర్ కి వస్తున్నాడంటే… రోడ్ల వెంట చెట్లు కొట్టేసేవారు… ఆయన ముఖం కనిపించకుండా పరదాలు కట్టేవారు. 2 కిలోమీటర్లయినా… 5 కిలోమీటర్ల దూరమైనా… హెలికాప్టర్ లో ఆకాశ మార్గాన్నే వెళ్ళేవారు. ఆయన ఆకాశంలో వెళ్తుంటే… కింద రోడ్డు మీద ట్రాఫిక్ కూడా ఆపించిన సందర్భాలు ఉన్నయ్.

ఆ సెక్యూరిటీ సంగతి చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే… జగన్ కి తాడేపల్లితో పాటు హైదరాబాద్, బెంగళూరు, ఇడుపులపాయ ప్యాలెస్ ల దగ్గర భారీగా బందోబస్తు ఉండేది. తాడేపల్లి చెట్టూ పదుల సంఖ్యలో చెక్ పోస్టులు. చుట్టు పక్కల ఇళ్లపై డ్రోన్లతో నిఘా ఉండేది. జగన్ కాన్వాయ్ బయటకు వస్తే… అక్కడ జనమంతా ఇళ్ళల్లోనే తలుపులు వేసుకోవాలి. జగన్ తాడేపల్లి ఇంట్లో ఉన్నా… ఆ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు మెడలో ఐడెంటిటీ కార్డులు వేసుకొని తిరగాల్సిందే. పోలీసుల ఆంక్షలతో ఐదేళ్ళూ జనం నరకం చూసేవారు. జగన్ ఇంటి చుట్టూ అత్యాధునిక రక్షణ పరికరాలు, రెండు బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్రూయిజర్ కార్లు… ఇతర వాహనాలు… ఇలా చెప్పుకుంటే పోతే చాంతాడంత లిస్టే ఉంటుంది.

ఇక జగన్ ఇంటికి వెళ్ళే రోడ్లల్లో కనీవినీ ఎరుగని రీతిలో 48 చెక్ పోస్టులు, బ్యారికేడ్స్, ఔట్ పోస్టులు, పోలీస్ పికెట్స్, బూమ్ బారియర్లు, టైర్ కిల్లర్స్ ఉన్నాయి. తాడేపల్లి ఇంటికి 30 అడుగుల ఎత్తున ఐరెన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికలు అయ్యాక కుటుంబంతో సహా జగన్ విదేశాలకు వెళ్ళారు. అక్కడ కూడా ప్రభుత్వ ఖర్చు కోటిన్నర రూపాయలతో భద్రత కల్పించారు.

జగన్ ఒక్కడి కోసం మొత్తం 986 మంది భద్రతా సిబ్బంది ఉంటే… అందులో 379 మందితో కమాండో తరహా వ్యవస్థనే సెటప్ చేశారు. దేశంలో ఎక్కువగా థ్రెట్ ఉండే యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కన్నా జగన్ కే భద్రత ఎక్కువ. ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ పేరుతో ఏకంగా ఓ ప్రత్యేక చట్టమే తెచ్చి… కమాండో తరహాలో ssg వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో 379 మంది 24 X7… మూడు షిప్టుల్లో కాపలా కాస్తూ ఉండేవారు. వీళ్ళకి భూమి, నీరు, ఆకాశంలో శత్రువులతో పోరాడేలా ట్రైనింగ్ కూడా ఇప్పించారు. రాష్ట్రపతి, ప్రధాని కన్నా కూడా ఏపీ సీఎంగా జగన్ కే ఎక్కువ సెక్యూరిటీ ఉండేది. ఇక్కడ జగన్ ఒక్కడే కాదు… ఆయన భార్య భారతికి నలుగురు, తల్లి విజయమ్మకు నలుగురు చొప్పున భద్రతా సిబ్బంది ఉండేవారు. తాడేపల్లి ప్యాలెస్ తో పాటు లోటస్ పాండ్, ఇడుపులపాయ, పులివెందుల ఇళ్ళ దగ్గర 52 మంది పోలీసులు కాపలా కాసేవారు.

జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి మాత్రమే. ప్రతిపక్ష నేత కూడా కాదు. కేవలం పులివెందుల ఎమ్మెల్యేనే. అయినా సరే… గతంలో ఉన్న భద్రతే ఇప్పటికీ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు కంటే కూడా జగన్ కే ఎక్కువ సెక్యూరిటీ ఉంది. Z ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు బుల్లెట్ ప్రూఫ్ ఫార్చూనర్ వెహికల్స్ లో తిరుగుతుంటే… జగన్ కాన్వాయ్ లో మాత్రం రెండు అత్యాధునిక ల్యాండ్ క్రూయిజర్ బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉన్నాయి. చంద్రబాబుకి NSG సెక్యూరిటీ ఉంది… నేను ముఖ్యమంత్రిని… అంతకంటే డబుల్ ఉండాలి కదా… అన్న ఇగోతోనే 986 మందితో భారీ సెక్యూరిటీ పెట్టుకున్నట్టు టీడీపీ లీడర్లు ఆరోపిస్తున్నారు. సెక్యూరిటీ కోసం ఖర్చు పెట్టిన 296 కోట్ల రూపాయల జనం సొమ్మును… జగన్ నుంచి రికవరీ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.