ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections) మరోసారి విజయం సాధించడానికి వైసీపీ అధినేత, సీఎం జగన్ (CM Jagan).. వరుసగా నియోజకవర్గాల ఇంఛార్జులను మారుస్తున్నారు. ఇప్పటికి నాలుగు లిస్టులు విడుదల చేశారు. వీటిల్లో మొత్తమ్మీద 68 మంది దాకా ఎంపీ, ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఇంఛార్జుల మార్పులు, చేర్పులు జరిగాయి. ఇంకా కొన్ని జిల్లాల సంగతి తేలలేరు. దాంతో ఇంకో లిస్ట్ ఉంటుందా.. తమని కూడా మారుస్తారా ? అని టెన్షన్ లో ఉన్నారు కొందరు వైసీపీ నేతలు.
మూడు లిస్టుల్లో మొత్తం 58 మంది దాకా ఇంఛార్జులను మార్పు చేశారు జగన్. నాలుగో జాబితాలో 9 మంది పేర్లు ప్రకటించారు. మధ్యలో సంక్రాంతి పండగ రావడంతో మూడు రోజులు ఆలస్యంగా ఫోర్త్ లిస్ట్ బయటకు వచ్చింది. ఈ జాబితాలోనే.. రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాల సంగతి జగన్ తేల్చేస్తారని అందరూ భావించారు. కానీ కేవలం 9 మంది మార్పుతోనే సరిపెట్టారు రాష్ట్రం మొత్తమ్మీద 58 అసెంబ్లీ నియోజకవర్గాలు 10 ఎంపీ స్థానాల్లో వైసీపీ మార్పులు చేసింది. ఇందులో 37 మందికి టిక్కెట్ నిరాకరించింది.
ప్రస్తుతం ఐదో లిస్ట్ ప్రిపరేషన్ లో వైసీపీ అధినేత, సీఎం జగన్ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో మార్పుల కోసం అభ్యర్థులతో మంతనాలు జరుగుతున్నాయి. గుడివాడ అమర్నాథ్, సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డితో పాటు కొందరు ఎమ్మెల్యేలతో జగన్ మాట్లాడారు. ఎంపీల్లో నంద్యాల, గుంటూరు, నరసరరావు పేటతో పాటు మరికొన్ని సీట్లల్లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశముంది. ఈ ఫిఫ్త్ లిస్ట్ లో నలుగురైదుగురు ఎంపీలను మార్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ స్థానాల్లో ఎమ్మెల్యేలను పంపడం లేదంటే కొత్త అభ్యర్థులను ఎంపిక చేసే ఛాన్సుంది.
వైసీపీ సీనియర్ నేత, మంత్రి గుమ్మనూరు జయరాం అజ్ఞాతంలోకి వెళ్ళడం ఏపీలో సంచలనం కలిగించింది. ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జయరామ్ ని కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఈ నిర్ణయం నచ్చని జయరామ్ నాలుగు రోజులు బెంగళూరులో మకాం వేశారు. ఆ తర్వాత మూడు రోజులు ఆలూరులో ఉన్నారు. శుక్రవారం నుంచి ఆయన కనిపించడం లేదంటున్నారు. జయరామ్ ఇవాళ, రేపట్లో జగన్ ను కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు అధిష్టానంపై సీరియస్ గా ఉన్నారు. ఆయన స్థానంలో వంగా గీతను ఇంఛార్జ్ గా నియమించారు జగన్. దాంతో పుట్టిన రోజు నాడు వేలమంది కార్యకర్తలు, అభిమానులతో ఆత్మీయ విందు ఏర్పాటు చేసిన దొరబాబు తర్వాత సైలెంట్ అయ్యారు. ఆయన పార్టీ మారేది లేనిదీ తెలియడం లేదు. కానీ దొరబాబుకి సీఎంఓ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని తెలుస్తోంది. సీఎం జగన్ ను కలుస్తారా లేదా అన్నది చూడాలి.
మాగుంటకు ఒంగోలు ఎంపీ టిక్కెట్ ఇవ్వాలంటూ అధిష్టానాన్ని డిమాండ్ చేసిన బాలినేని ఇప్పుడు మెత్తబడ్డారు. ఆయనకు టిక్కెట్ ఇచ్చేదిలేదంటూ పార్టీ సీనియర్లతో పాటు జగన్ కూడా తేల్చి చెప్పారు. బాలినేనికి సిట్టింగ్ స్థానమైన ఒంగోలు లేదంటే గిద్దలూరు ఇస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. ఆయన ఎక్కడ పోటీ చేస్తారన్నది ఇంకా తేలాల్సి ఉంది. ప్రకాశం జిల్లాలో మిగిలిన సెగ్మెంట్లపై ఐదో లిస్ట్ లో జగన్ తేల్చేస్తారని చెబుతున్నారు.
వైసీపీలో నియోజకవర్గాలకు ఇంఛార్జులు అంటే.. రేపు వీళ్ళకే ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు ఇస్తారా.. లేదంటే ప్రస్తుతానికి పార్టీ అభివృద్ధి కోసం వీళ్ళని వాడుకుంటారా అన్న డౌట్స్ ఇంకా అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇంకా తేల్చని జిల్లాలతో పాటు ఇప్పుడు ఇచ్చిన నియోజకవర్గాల్లోనూ మళ్ళీ మార్పులు ఉంటాయా.. ఇవి ఎన్నికల దాకా కొనసాగుతాయన్న ప్రచారంలో నిజమెంతో తెలియక అభ్యర్థులు గందరగోళంలో ఉన్నారు. సీనియర్ల నియోజకవర్గాలను ప్రస్తుతానికి అందుకే టచ్ చేయలేదని చెబుతున్నారు. సీనియర్లు ఎప్పటికైనా తోక జాడించే అవకాశం ఉంది. అదే కొత్తవాళ్ళయితే అణిగి మణిగి పార్టీకి విశ్వాసంగా ఉంటారని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రస్తుతానికి సీనియర్ల నియోజకవర్గాల్లో మార్పులు చేయకున్నా.. పరిస్థితిని బట్టి ఎన్నికల ముందైనా వాళ్ళని తప్పించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.