జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆరోజు మధ్యాహ్నం కల్లా చాలా నియోజకవర్గాల ఫలితాలు వెల్లడయ్యే ఛాన్సుంది. అయితే అందరికంటే ముందుగా ఏపీలో రోజా జాతకం బయటపడుతుందని అంటున్నారు. నగరి ఫలితమే ముందు వస్తుందని చెబుతున్నారు.
ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల పరంగా చూస్తే… చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా తక్కువగా ఉన్నాయి. అక్కడ 13 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక నగరిలో ఐదు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ రోజాతో పాటు ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పుడు మొదటి ఫలితం చిత్తూరు లేదా నగరిల్లో ఒకటి బయటకు రావొచ్చని భావిస్తున్నారు. నగరి ఫలితం ముందుగా వస్తుందనీ… ఆ తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే చిత్తూరు రిజల్ట్ బయటపడుతుందని అధికారులు చెబుతున్నారు. నగరి కౌంటింగ్ పూర్తయితే… ఏపీలో మొదట రోజా జాతకం బయటపడే ఛాన్సుంది.
చిత్తూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో EVM ల ఓట్ల లెక్కింపు 130 రౌండ్లలో పూర్తవుతుంది. ఒక్కో కౌంటింగ్ కి దాదాపు 25 నిమిషాలు పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. మొత్తం సాయంత్రం నాలుగింటికల్లా చిత్తూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడవుతాయి.