బెజవాడ వరద ప్రభావం 600 రైళ్ళపై పడిందా…? ఆ రైల్వే స్టేషన్ ఎందుకు కీలకం…?

రెండు తెలుగు రాష్ట్రాల వరద ప్రభావం రైల్వే వ్యవస్థపై భారీగా పడింది. సోమవారం సాయంత్రం నాటికి 481 రైళ్లను రద్దు చేసి, 152 రైళ్లను దారి మళ్లించిన అధికారులు 13 రైళ్ళను పాక్షికంగా రద్దు చేసారు.

  • Written By:
  • Publish Date - September 3, 2024 / 03:24 PM IST

రెండు తెలుగు రాష్ట్రాల వరద ప్రభావం రైల్వే వ్యవస్థపై భారీగా పడింది. సోమవారం సాయంత్రం నాటికి 481 రైళ్లను రద్దు చేసి, 152 రైళ్లను దారి మళ్లించిన అధికారులు 13 రైళ్ళను పాక్షికంగా రద్దు చేసారు. విజయవాడ నుంచి వెళ్ళే చాలా రైళ్ళను అధికారులు వరదల కారణంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. విజయవాడ డివిజన్‌ లోని రాయనపాడు దగ్గర ట్రాక్ పై భారీ వరద రావడంతో అధికారులు అప్రమత్తమై వెంటనే రైళ్ళ రాకపోకలను రద్దు చేసారు. అలాగే పలు ప్రాంతాల్లో ఇంకా రైల్వే ట్రాక్ లను పునరుద్దరించే పనులు వేగంగా సాగుతున్నాయి.

ఒక్క విజయవాడ వరదల ప్రభావం ఎందుకు రైల్వే వ్యవస్థపై భారీగా పడింది అనేది చాలా మంది ప్రశ్న. దక్షిణ మధ్య రైల్వేకి విజయవాడ డివిజన్ అనేది గుండెకాయ లాంటిది. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఆరు డివిజన్లు ఉంటే అందులో విజయవాడ డివిజన్ ఒకటి. విజయవాడ ఎంత కీలకం అంటే… వాస్తవానికి రెండు డైరెక్షన్‌ లకు మించి రైల్వే లైన్లు ఉండే రైల్వే స్టేషన్లను జంక్షన్ అని పిలుస్తారు. అలాంటిది విజయవాడకు అయిదు డైరెక్షన్ లు ఉన్నాయి. అంటే రెండు జంక్షన్లతో విజయవాడ రైల్వే స్టేషన్ సమానం.

ఆ డైరెక్షన్ లు కాజీపేట… అంటే సికింద్రాబాద్, ఢిల్లీ రూట్ కు, ఆ తర్వాత, గుంటూరు, చెన్నై, గుడివాడ, విశాఖపట్నం. దక్షిణ భారతదేశాన్ని ఉత్తర భారతదేశం కనెక్ట్ చేసేది విజయవాడే. అలాగే ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళే రైల్వే లైన్ కూడా విజయవాడ నుంచే వెళ్తుంది. అంటే ఓడిస్సా, పశ్చిమ బెంగాల్ నుంచి ఈ లైన్ లు ఉన్నాయి. విజయవాడలో పది ఫ్లాట్ ఫాంలు ఉంటే… ఒక్క రోజులో సగటున 250 రైళ్ళు విజయవాడ స్టేషన్ లో ఆగుతాయి. మూడు రోజులకు పైగా ప్రయాణించే వివేక్ ఎక్స్ప్రెస్ కూడా విజయవాడ నుంచే వెళ్తుంది. ఈ స్టేషన్ పై ఒత్తిడి తగ్గించడానికి రాయనపాడులో శాటిలైట్ స్టేషన్ ఏర్పాటు చేసినా అది కేవలం గూడ్స్ ట్రైన్స్ కే పరిమితం అయింది.

ప్యాసింజర్ ట్రైన్ లు గాని, కాకినాడ, కృష్ణపట్నం పోర్ట్ లలో సరుకు రవాణా విషయంలో గాని విజయవాడ రైల్వే డివిజన్ దే కీలక భూమిక. కీలకమైన బొగ్గు, ఎరువులు, స్టీల్, బియ్యం, పెట్రోలియం, సిమెంట్, మామిడి కాయల ఎగుమతి ఇలా అన్నీ ఈ స్టేషన్ మీదుగానే వెళ్తాయి. మరో కీలక విషయం ఏంటీ అంటే… కేంద్ర ప్రభుత్వం ఇటీవల రైలు మార్గం ద్వారా సరుకు రవాణాను మరింత సులభతరం చేసేందుకు గానూ… మూడు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌లను ప్రతిపాదిస్తే అందులో రెండు విజయవాడ నుంచే ఉన్నాయంటే విజయవాడ డివిజన్ ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒకటి ఈస్ట్ కోస్ట్ ఫ్రైట్ కారిడార్ కాగా… అది ఖరగ్‌పూర్ నుంచి విజయవాడ అలాగే రెండవది… నార్త్-సౌత్ ఫ్రైట్ కారిడార్ కాగా ఇటార్సీ-విజయవాడ. అందుకే విజయవాడ వరదల ప్రభావం రైల్వే వ్యవస్థపై భారీగా పడింది.