Nallari ki miss : నల్లారికి బ్యాడ్ లక్.. కేంద్ర మంత్రి పదవి మిస్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి (AP Former CM ) నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Nallari Kiran Kumar Reddy) కి ఈసారి దురదృష్టం వెంటాడింది. ఏపీలో కూటమి (AP Alliance) ప్రభంజనం సృష్టించినా... ఆయన మాత్రం ఓడిపోయారు.

 

 

ఏపీ మాజీ ముఖ్యమంత్రి (AP Former CM ) నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Nallari Kiran Kumar Reddy) కి ఈసారి దురదృష్టం వెంటాడింది. ఏపీలో కూటమి (AP Alliance) ప్రభంజనం సృష్టించినా… ఆయన మాత్రం ఓడిపోయారు. రాష్ట్ర విభజన టైమ్ లో సొంత పార్టీతో పోటీ చేశాక… పదేళ్ళ పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఆ తర్వాత ఈమధ్యే రాజకీయాల్లోకి వచ్చి… రాజంపేటలో బీజేపీ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఆయన గెలిచి ఉంటే… ఏపీలో బీజేపీ (BJP) నుంచి కేంద్రంలో మంత్రి పదవి తప్పకుండా దక్కేదన్న టాక్ నడుస్తోంది.

ఉమ్మడి ఏపీలో లాస్ట్ సీఎంగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దాదాపు 10యేళ్ళుగా రాజకీయాలకు దూరంగా హైదరాబాద్ లోనే ఉండిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. అక్కడా యాక్టివ్ గా లేరు. తర్వాత బీజేపీలో చేరి… మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేశారు. తన లక్కు పరీక్షించుకున్నారు. కానీ వైసీపీ అభ్యర్థి మిధున్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. రాజంపేట నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. దీనికి తోడు… టీడీపీ (TDP), జనసేన (Jana Sena) ఓట్లు పెద్ద ఎత్తున ట్రాన్స్ ఫర్ అవుతాయని భావించారు. జనసేనను బలపరిచే బలిజల ఓట్లు కూడా ఎక్కువే ఉన్నాయి. ఈ సమీకరణాలను బేరీజు వేసుకొని… తన బద్ద శత్రువులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిధున్ రెడ్డిని ఓడించాలని అనుకున్నారు. కానీ ఏపీలో 21 ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచినా… రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఓడిపోయారు.

రాజంపేట పార్లమెంట నియోజకవర్గం పరిధిలో కూటమికే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు దక్కాయి. పీలేరు నుంచి ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కూడా గెలిచారు. కానీ పార్లమెంట్ కు వచ్చేసరికి క్రాస్ ఓటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. టీడీపీ, జనసేన నుంచి కిరణ్ కుమార్ రెడ్డికి ఓట్లు బదిలీ కాలేదని అర్థమవుతోంది. ఆయనకు జనం ఓట్లు ఎందుకు వేయలేదు. ఓట్లేసినా నియోజకవర్గానికి అందుబాటులో ఉండకుండా… హైదరాబాద్ లో ఉంటారని అనుకున్నారా… కానీ కిరణ్ కుమారెడ్డికి మాత్రం బ్యాడ్ లక్. గెలిస్తే… ఆయనకు కేంద్ర కేబినెట్ లో తప్పకుండా మంత్రి పదవి దక్కేదని ఆయన అనుచరులు వర్రీ అవుతున్నారు.