YS Jagan, India Alliance : జాతీయ పార్టీలో మాజీ సీఎం జగన్ బేరం.. ఇండియా కూటమిలో చేరతారా..?

జాతీయ పార్టీలతో జగన్ బేరానికి సిద్ధమవుతున్నాడా? అవసరమైతే ఇండియా గ్రూపులో చేరడానికి ప్లాన్ చేసుకుంటున్నాడా? 2029లో తన అవసరం కచ్చితంగా ఉంటుంది కనుక ఇప్పటినుంచి తెలివిగా పాచిక విసురుతున్నాడా?

 

 

జాతీయ పార్టీలతో జగన్ బేరానికి సిద్ధమవుతున్నాడా? అవసరమైతే ఇండియా గ్రూపులో చేరడానికి ప్లాన్ చేసుకుంటున్నాడా? 2029లో తన అవసరం కచ్చితంగా ఉంటుంది కనుక ఇప్పటినుంచి తెలివిగా పాచిక విసురుతున్నాడా? తనకు అండగా ఉండి తనతో నడిచే పార్టీలకి తన మద్దతు అని పరోక్షంగా భవిష్యత్తులో కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమితో వెళ్ళనున్నట్లు జగన్ సూచనగా చెప్పాడా?

వైసిపి కార్యకర్తలు పై జరుగుతున్న దాడులు, హత్యలు గురించి జాతీయ పార్టీ లు, జాతీయ మీడియా దృష్టికి తీసుకువెళ్లడానికి జగన్ ఢిల్లీలో నిరసన ధర్నా చేపట్టారు. ఈ నిరసన ధర్నాకు అన్ని బిజెపి, కాంగ్రెస్ సహా అన్ని జాతీయ పార్టీల మద్దతు కోరారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన జగన్ కి అంత సీన్ లేదని ఢిల్లీలో ఎవరు పట్టించుకోరని టిడిపి జగన్ నీ తక్కువ అంచనా వేసింది. అయితే ఇవి రాజకీయాలు. ముఖ్యంగా అవకాశవాద రాజకీయాలు. అవసరాల మీద జరిగే రాజకీయాలు. అందువలన ఎప్పుడు ఎవరు ఎలా ఉపయోగపడతారు అన్నది చెప్పలేం. అందుకే జగన్ పిలవగానే వచ్చి వాలిపోయారు ఇండియా కూటమి నాయకులు. యూపీలో రోజురోజుకీ కీలకంగా ఎదుగుతున్న సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు ఎంపీ, అఖిలేష్ యాదవ్ స్వయంగా వచ్చి జగన్ తో కూర్చొని ఏపీలో జరుగుతున్న దారుణాలను వీడియోలు చూసి మరి జగన్కు మద్దతు చెప్పి వెళ్లారు. ఇక అన్నా డీఎంకే, తృణమూల్, శివసేన, ఆప్, సిపిఐ సిపిఎం పార్టీల నేతలు , ఎంపీలు కూడా స్వయంగా వచ్చి జగన్నీ కలిసి ఆయన ధర్నాకు మద్దతు పలికారు.

ఇండియా కూటమి రథసారథి అయిన కాంగ్రెస్ మాత్రమే జగన్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కాంగ్రెస్ లేకుండా మిగిలిన పార్టీలన్నీ వచ్చి జగన్ ని పరామర్శించడం ఏమిటి… కాంగ్రెస్ దూరంగా ఎందుకు ఉంది? భవిష్యత్తులో కాంగ్రెస్ కూడా జగన్కు దగ్గరవుతుందా? ఇండియా కూటమికి జగన్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారా? కాంగ్రెస్తో జగన్ దోస్తీ చేస్తే ఏపీలో ఆయన చెల్లెలు షర్మిల పరిస్థితి ఏమిటి? ఇలా అనేక ప్రశ్నలు ఒకేసారి తలెత్తాయి. నిజానికి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఎవరూ ఉండరు. ఇప్పుడు జరిగేవన్నీ అవకాశవాద రాజకీయాలే కాబట్టి ఎవరు ఎప్పుడు ఎటువైపోయినా వెళ్ళిపోవచ్చు. నిన్న మొన్నటి వరకు ఎన్డీఏ కి, బిజెపికి బయట నుంచి అన్ని రకాలుగా మద్దతు పలికిన జగన్మోహన్ రెడ్డినీ బిజెపి వదిలించేసుకుంది. ఇప్పుడు ఆయన ఢిల్లీలో దీక్ష చేస్తే ఇండియా కూటమి పార్టీలు వచ్చి మద్దతు పలికాయి. సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి ఆ పార్టీని చీల్చుకొని బయటకు వచ్చి, సొంత పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన జగన్ మళ్లీ కాంగ్రెస్ వైపు వెళ్తాడా, ?ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడా అనే సందేహం అందరికీ వస్తుంది. కానీ జగన్ తన ప్రెస్ మీట్ లో ఎక్కడ ఈ విషయాన్ని అవునని గాని ,కాదని గాని చెప్పలేదు. అలాగని ఇండియా కూటమితో పొత్తు లేదని కూడా స్పష్టం చేయలేదు.

తన వెంట ఎవరు నడుస్తారో, మనకు ఎవరు మద్దతు పలుకుతారో వాళ్లతోనే తను ఉంటానని పరోక్షంగా తాను ఇండియా కూటంతోనే వెళ్ళబోతున్నానని చెప్పేశారు జగన్. బిజెపి జగన్ ని ఎప్పుడో వదిలేసింది. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు దాడులపై వివరించడానికి అపాయింట్మెంట్ అడిగితే అమిత్ షా కానీ, ప్రధాని మోడీ కానీ జగన్కు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. విజయసాయిరెడ్డి స్వయంగా అమిత్ షాను కలిసి జగన్ ధర్నా దీక్షకు బిజెపి మద్దతు పలకాలని కోరిన, జగన్ దగ్గరకు గల్లీ నాయకుడిని కూడా పంపలేదు బిజెపి. మరోవైపు ఎన్డీఏలో చంద్రబాబు రోజురోజుకీ బలంగా మారుతున్నాడు. చంద్రబాబుకు వ్యతిరేకంగా బిజెపి తన నేతల్ని జగన్ దగ్గరికి పంపించేటంత ధైర్యం చేయదు. ఎన్డీఏ కూటమిలో ఏ ఒక్క పార్టీ కూడా జగన్కు ఢిల్లీలో మద్దతు ఇవ్వలేదు. దీనిని బట్టి జగన్ భవిష్యత్తులో ఇండియా కూటమి తోనే నడిచే అవకాశం ఉందని ఒక అంచనా. అయితే జగన్ పార్టీ పెట్టిందే కాంగ్రెస్కు వ్యతిరేకంగా, సోనియాగాంధీ పై తిరుగు బాటు చేసి. అలాంటి కాంగ్రెస్తో సోనియాతో మళ్లీ చేతులు కలుపుతారా అనేది చాలామంది ప్రశ్న..

కానీ రాజకీయాల్లో…. ముఖ్యంగా అవకాశవాద రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. అవసరాలే నాయకుల్ని, పార్టీలను కలుపుతాయి. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా 40 ఏళ్లు రాజకీయం చేసిన చంద్రబాబే 2018లో తెలంగాణలో కాంగ్రెస్తో కలిసి పోటీ చేశారు. ఇండియా కూటమిలో పార్టీలన్నీ జగన్ ని కలుపుకోవాల్సిందే అని డిమాండ్ చేస్తే కాంగ్రెస్ కాదనలేదు. వచ్చిన అవకాశాన్ని కూడా కాదు అనలేదు. 2029 లో అప్పటి అవసరాన్ని బట్టి జగన్ కచ్చితంగా ఇండియా కూటంకి బయట నుంచో, లోపలి నుంచో మద్దతు ఇవ్వక తప్పదు. అంతేకాదు జగన్ పై కేసులు ఉన్నంతకాలం కేంద్రంలో ఉండే కూటములకు, అధికార పార్టీకి అతను లోబడి ఉండాల్సిందే. లేదంటే మళ్లీ లోపలికి పోతాడు.

రేపు 2029లో కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని జగన్ గట్టిగా నమ్మితే ఇండియాకే జై కొడతాడు. జగన్ అండగా ఉంటే ఇండియా కూటమిలోని పార్టీలకు ఆర్థిక సమస్యలు కూడా ఉండవు. మొత్తం కూటమికి కావాల్సిన డబ్బంతా ఆయనే సమకూర్చగలడు. అదే విషయాన్ని జగన్ చాలా స్పష్టంగా చెప్పాడు. నాకు మద్దతునిచ్చిన వాళ్ళకి, నాతో నిలబడిన వాళ్ల వెంట నేను ఉంటాను అని స్పష్టంగా చెప్పాడు. ఆ ఒక్క మాట చాలు ఇండియా కూటమిలో కాంగ్రెస్ తో సహా మిగిలిన పార్టీలన్ని జగన్కు గ్రాండ్ వెల్కమ్ చెబుతాయి. 2029లో మళ్లీ అధికారంలోకి రావాలన్నా.., తన కేసులు ఏవి తిరిగి పైకి రాకూడదన్న…. జగన్ కచ్చితంగా ఏదో ఒక కూటమితో అంట కావాల్సిందే. అందుకే తెలివిగా జగన్ తన కర్చీఫ్ ను ఇండియా కూటమిలో పడేశాడు. ఇండియా కూటమి పార్టీలు కూడా వాళ్ల కర్చీఫ్లు తీసుకొచ్చి జగన్ దగ్గర పడేసాయి. రాబోయే రోజుల్లో జగన్ ఇండియా కూటమితో కలిసి చేసే రాజకీయం మహా రంజుగా ఉంటుంది.