కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భారీ అవినీతికి చెక్ పడుతోంది. వైసీపీ హయాంలో ఎన్నో అరాచకాలకు కేరాఫ్ అయిన ద్వారంపూడికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చుక్కలు చూపిస్తున్నారు. కోట్ల విలువైన భూముల కబ్జా, కొండలు, గుట్టలు కొల్లగొట్టడం, వందల కోట్ల రేషన్ బియ్యం మాఫియాస్కాం… ఇలా ఒక్కో అవినీతి దందా బయటకు వస్తోంది.
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెలరేగిపోయారు. ఆయన కుటుంబం లక్షల టన్నుల రేషన్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈమధ్యే కాకినాడలో ఎయిర్ పోర్ట్ లో గోదాములను తనిఖీ చేసిన పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వేల మెట్రిక్ టన్నలు బియ్యాన్ని సీజ్ చేయించారు. ఈ కేసును సీఐడీకి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. వేల కోట్ల రూపాయల రేషన్ బియ్యం మాఫియా కేసులో ద్వారంపూడి అడ్డంగా ఇరుక్కుపోయారు.
కాకినాడ జిల్లాలోని గురజనాపల్లి, ప్రత్తిపాడు, లంపకలోవలో ద్వారంపూడికి చెందిన రెండు రొయ్యల ఫ్యాక్టరీలో అక్రమాలు కోకొల్లలు. వ్యర్థజలాలను జనం ఉండే ఏరియాల్లోకి వదులుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో… పీసీబీ అధికారులు ఫ్యాక్టరీల్లో తనిఖీలు చేసి అక్రమాలను గుర్తించారు. నోటీసులు కూడా ఇచ్చారు. ద్వారంపూడి అనుచరుల భూకబ్జాల నుంచి 25 కోట్ల రూపాయల విలువైన భూమికి విముక్తి లభించింది. ఆయన అనుచరులు గంజాయి సేవించడానికి ఐదేళ్ళుగా మూసేసిన రోడ్డును తిరిగి తెరిచారు. కాకినాడ టౌన్ లో ద్వారంపూడి పీఏలు సుబ్బారావు, గోవింద రాజులు అక్రమ భవన నిర్మాణాలు చేపట్టడం… బిల్డర్ల నుంచి భారీగా లంచాలు వసూలు చేయడంపైనా ఫిర్యాదులు అందుతున్నాయి.
కాకినాడ పోర్టులో డ్రెడ్జింగ్ పనుల్లో ద్వారంపూడి 73 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్టు ఆధారాలతో సహా బయటపడింది. దీనిపైనా దర్యాప్తు జరుగుతోంది. ద్వారంపూడి అండతో మున్సిపాలిటీకి చెందిన 24 షాపులను ఆయన అనుచరలు ఆక్రమించారు. వాళ్ళందర్నీ ఖాళీ చేయించి టెండర్లు పిలుస్తున్నారు మున్సిపల్ అధికారులు. లక్షల టన్నుల రేషన్ బియ్యం స్కామ్ లో సీఐడీ ఎంక్వైరీ మొదలైతే ద్వారంపూడి అవినీతి దందా బయటపడటంతో పాటు… జైలు కెళ్ళక తప్పదంటున్నారు.