Babu Jagan : బాబు బయటకెళ్ళిన గేటు నుంచే… గౌరవంగా లోపలికి వెనక గేట్ నుంచి వచ్చిన జగన్

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణం స్వీకారం జరిగింది. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణం చేయించారు. మొదట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణం స్వీకారం జరిగింది. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణం చేయించారు. మొదట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తరువాత… మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణం చేశారు. అయితే ఈసారి చంద్రబాబు, జగన్ కోసం కొన్ని అసెంబ్లీ రూల్స్ పక్కనబెట్టారు.

వైసీపీ హయాంలో 2021 నవంబర్ 19నాడు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి అసెంబ్లీలో ఘోరమైన అవమానం జరిగింది. అప్పటి అధికార పక్షం తన కుటుంబ సభ్యులపై దారుణ వ్యాఖ్యలు చేయడంతో… సభ నుంచి ఆవేదనతో బయటకెళ్ళారు చంద్రబాబు. ఇది శాసన సభ కాదు.. కౌరవ సభ.. తిరిగి సీఎంగా గౌరవసభలోనే అడుగుపెడతానంటూ వెళ్లిపోయారు. అప్పట్లో చంద్రబాబు ఏ గేటు నుంచి బయటకెళ్ళారో… ఇప్పుడు అదే గేటు ద్వారా ముఖ్యంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అసలు అసెంబ్లీలో సీఎం ఎంట్రీ వేరేగా ఉంటుంది. కానీ చంద్రబాబు తాను బయటకు వెళ్ళిన గేటు నుంచే లోపలికి వచ్చారు. అంటే ఎమ్మెల్యేలు సభ లోపలికి వచ్చే ఎంట్రీ నుంచే బాబు కూడా అడుగుపెట్టారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్ విషయంలో సీఎం చంద్రబాబు కొన్ని మినహాయింపులు ఇచ్చారు.

జగన్ అసెంబ్లీ సమావేశాలకు తమ ycp ఎమ్మెల్యేలతో కలసి వచ్చారు. ఆ పార్టీకి విపక్ష హోదా కూడా లేదు. దాంతో జగన్ తో పాటు మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు… తమ కార్లను అసెంబ్లీ బయటే ఉంచి లోపలికి నడుచుకుంటూ రావాలి. కానీ మాజీ సీఎం కావడంతో ఆయన కారు లోపలికి అనుమతించేలా శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాలిచ్చారు. దాంతో వైఎస్ జగన్ కారును ఆవరణలోకి అనుమతించారు అసెంబ్లీ సిబ్బంది. జగన్ కు గౌరవం తగ్గకుండా చూడాలని… సీఎం చంద్ర బాబు ఆదేశించడంతో కారుకు పర్మిషన్ ఇచ్చినట్టు కేశవ్ చెప్పారు. అలాగే ప్రమాణ స్వీకార సమయంలో కూడా ఎమ్మెల్యేల పేరులో ఇంగ్లీషులో మొదటి అక్షరం… ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ప్రమాణం స్వీకారానికి పిలుస్తారు. కానీ వైసీపీ రిక్వెస్ట్ తో… జగన్ ని ముందే ప్రమాణానికి పిలిచారు.

ఇక జగన్ అసెంబ్లీ వెనక గేటు నుంచి లోపలికి వచ్చారు. గతంలో సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి మందడం మీదుగా అసెంబ్లీకి వచ్చేవారు. కానీ అమరావతి రైతులు నిరసన చెబుతారని భయపడి… వెనక గేటు నుంచి అసెంబ్లీ ఆవరణలోకి అడుగుపెట్టారు. సభ మొదలైన వెంటనే లోపలికి వెళ్ళకుండా… 5 నిమిషాల తర్వాత … తన ప్రమాణ స్వీకారం టైమ్ లోనే అడుగుపెట్టారు జగన్. ఎమ్మెల్యేగా ప్రమాణం చేశాక… సభలో తనకు కేటాయించిన సీట్లో కూర్చోకుండానే పార్టీకి కేటాయించిన ఛాంబర్ లోకి వెళ్ళిపోయారు.