గన్నవరం (Gannavaram) ఎమ్మెల్యే, టీడీపీ నుంచి వైసీపీ(YCP)కి జంప్ అయిన వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) ఈమధ్య ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), లోకేష్ పై ఒంటి కాలిపై లేచి విరుచుకుపడే వంశీ… కొద్ది రోజులుగా అసలు వాళ్ళ ప్రస్తావనే తేవడం లేదు. వంశీ సహచరుడు గుడివాడ ఎమ్మెల్యే నాని ఎప్పటిలాగే అడ్డూ అదుపు లేకుండా చంద్రబాబును తిడుతూనే ఉన్నారు. కానీ వంశీ మాత్రం కిమ్మనకుండా ఎక్కడో తన పని తాను చేసుకుంటూ ఉన్నారు. దీని కారణం వంశీని ఇప్పటికే కమ్మ సామాజిక వర్గం పూర్తిస్థాయిలో ద్వేషిస్తుంది. గన్నవరంలో వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న వంశీ… ఇప్పుడున్న పరిస్థితుల్లో అనవసరమైన కామెంట్లు చేసి అందరికీ దూరం కావడం ఎందుకులే అని కామ్ గా ఉంటున్నారట.
వల్లభనేని వంశీ… గన్నవరం నియోజకవర్గంలో కనిపించక 45 రోజులు దాటిపోయింది. సాధారణంగా చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ అంటే… ఒంటి కాలి మీద లేచే వంశీ వాయిస్ ఈ మధ్య కాలంలో అస్సలు వినిపించట్లేదు. మనిషి కనిపించట్లేదు. అలా ఎందుకని ఆరా తీసినవాళ్లకు నేరుగా సమాధానం దొరకడం లేదు. దీంతో నియోజకవర్గంలో రకరకాల ఊహాగానాలు, విశ్లేషణలు పెరిగిపోతున్నాయి. వరుసగా రెండు సార్లు టీడీపీ (TDP) తరపున ఎమ్మెల్యేగా గెలిచారు వంశీ. 2009లో బెజవాడ (Bejwada) ఎంపీగా టీడీపీ తరపునే బరిలోకి దిగి ఓడిపోయారాయన. 2019లో టీడీపీ నుంచి గెలిచినా… తర్వాత ఫ్యాన్ కిందికి చేరిపోయారు. అప్పటి నుంచి చంద్రబాబు, లోకేష్ (Nara Lokesh) టార్గెట్‌గా మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు వంశీ. అటు వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ మీద విమర్శలకు కూడా ఎడాపెడా కౌంటర్లు ఇచ్చిపడేసేవారు. వైసీపీకి మద్దతు తెలిపాక తనను కార్నర్ చేసేందుకు ప్రయత్నించిన పార్టీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావుపై కూడా వంశీ రియాక్ట్ అయ్యారు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు వంశీ వినిపించడం లేదు, కనిపించడం లేదు. తన సహజ శైలికి భిన్నంగా నెలల తరబడి ఏం చేస్తున్నారన్నది గన్నవరం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయింది.
వైసీపీ (YSRCP) నుంచి గత ఎన్నికల్లో తనపై పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు తర్వాత టీడీపీలో చేరారు. సాధారణంగా చిన్న చిన్న వ్యవహారాలకే అంతెత్తున ఎగిరిపడే వల్లభనేని వంశీ… బహిరంగసభలో, పబ్లిగ్గా, తనను టార్గెట్ చేసి యార్లగడ్డ కామెంట్స్ చేసినా పెద్దగా రియాక్ట్ అవకపోవడం ఆశ్చర్యంగానే ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇది కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే… వైసీపీలో చేరాక పదే పదే రియాక్ట్ అవటంవల్ల కొన్నిసందర్భాల్లో తానే ఇరుకున పడాల్సి వచ్చిందనీ, ఈ మౌనానికి అది కూడా ఒక కారణం కావచ్చంటున్నారు పరిశీలకులు. ఏదో ఒకటి మాట్లాడటం, అది ఎక్కడో తగలడం, పర్యవసానాలు రకరకాలుగా రివర్స్ అవడంతో ఈ గొడవంతా ఎందుకని ఆయన సైలెంట్ అయినట్టు చెబుతున్నారు. తన ఘాటు మాటలతో ప్రత్యేకించి సొంత కమ్మ సామాజిక వర్గానికి దూరమవుతున్నానన్న అభిప్రాయం కూడా వంశీకి బలంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
వంశీ మౌనం ఒక ఎత్తయితే… గతంలో ఎన్నడూ లేనివిధంగా… అసలు డిసెంబర్ నుంచి గన్నవరం ముఖం చూడకపోవడానికి కారణాలేంటన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఆయన గన్నవరంలో ఉండకపోవటం, మౌనం దాల్చడంపై ఇటు వైసీపీతోపాటు అటు టీడీపీ శిబిరంలో కూడా చర్చ జరుగుతోందట. తిట్టేనోరు, తిరిగే కాలు అన్నట్టుగా ఉండే వంశీ… ఉన్నట్టుండి ఇంత సైలెంట్ అయిపోవడాన్ని రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యంగా చూస్తున్నారట. అయితే… వంశీ హైదరాబాద్‌లో ఉన్నారనీ, వ్యక్తిగత పనుల కోసం చాలా రోజుల నుంచి అక్కడే ఉన్నట్టు చెబుతున్నారు ఆయన సన్నిహితులు. త్వరలోనే గన్నవరం వస్తారని చెబుతోందట వంశీ వర్గం. అదే సమయంలో నియోజకవర్గ టీడీపీ వర్గాల్లో మరో చర్చ కూడా జరుగుతోంది. వంశీ సైలెంట్ గా ఉన్నారని, అంతా మనకే పాజిటివ్ అని లైట్‌గా ఉండవద్దన్నది ఆ చర్చ సారాంశం. పోల్ మేనేజ్ మెంట్‌లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారని, అందుకే ఈ మౌనాన్ని అలుసుగా తీసుకోకూడదన్న వాదన వినిపిస్తోందట టీడీపీ శిబిరంలో. మరోవైపు నియోజకవర్గానికి దూరంగా ఆయన ఏం చేస్తున్నారని కూడా తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారట టీడీపీ నేతలు. దీంతో ఎమ్మెల్యే సన్నిహితులు చెబుతున్నట్టే ఫిబ్రవరి ఫస్ట్‌వీక్‌లో రీ ఎంట్రీ ఇస్తారా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. గన్నవరం పొలిటికల్ హీట్ మళ్ళీ పెరగబోతోందన్నది లోకల్ పొలిటికల్ పండిట్స్ మాట.