GVL NARASIMHA RAO: జీవీఎల్.. ఇదేందయ్యా ఇది.. వైజాగ్‌లో ఈ హడావిడి ఏంటి..?

బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు కూడా విశాఖ ఎంపీ టిక్కెట్ కోసం హడావిడి చేస్తున్నారు. గత కొంత కాలంగా ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నారు. తాజాగా SBI-CSR నిధులతో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం వివాదస్పదమైంది.

  • Written By:
  • Updated On - January 16, 2024 / 02:50 PM IST

GVL NARASIMHA RAO: ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి వైజాగ్ పార్లమెంటరీ స్థానం హాట్ సీట్‌గా మారబోతోంది. ఇక్కడి నుంచి పోటీకి హేమా హేమీలు రంగంలోకి దిగుతున్నారు. వైసీపీ.. ఇప్పటికే బొత్స ఝాన్సీ పేరు ప్రకటించింది. కొత్తగా పార్టీ పెట్టిన జేడీ లక్ష్మీనారాయణ కూడా ఇక్కడి నుంచే పోటీకి దిగుతున్నారు. ఇక టీడీపీ-జనసేన కూటమి కూడా గట్టి అభ్యర్థినే రెడీ చేస్తోంది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు కూడా విశాఖ ఎంపీ టిక్కెట్ కోసం హడావిడి చేస్తున్నారు. గత కొంత కాలంగా ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నారు. తాజాగా SBI-CSR నిధులతో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం వివాదస్పదమైంది. సేవా కార్యక్రమాలకు ఖర్చుపెట్టాల్సిన రూ.65 లక్షలను ఇలా పండగ కోసం వేస్ట్ చేశారని సీపీఎం నేతలు మండిపడుతున్నారు.

Chandrababu Naidu: ప్రస్తుతానికి నో రిలీఫ్! తీర్పుపై భిన్నాభిప్రాయాలు.. CJI ముందుకు క్వాష్ పిటిషన్..

విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గానికి జీవీఎల్ నరసింహారావు తనకు తానుగా బీజేపీ అభ్యర్థిగా ప్రకటించుకున్నారా.. ఈ సంగతి బీజేపీ శ్రేణులకే అర్థం కావట్లేదు. జీవీఎల్ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈసారి వైజాగ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి దిగాలని అనుకుంటున్నారు. అందుకే కొన్ని నెలల క్రితమే విశాఖలో మకాం పెట్టేశారు GVL. అప్పుడప్పుడు నియోజకవర్గం పరిధిలో పర్యటనలు చేస్తూ.. జనాన్ని కలుస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. జీవీఎల్ నర్సింహారావు ఈ పరిచయాలతోనే విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో భారీ స్థాయిలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఇందులో కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి మేఘావల్ కూడా పాల్గొన్నారు. వైజాగ్ జనం నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సంక్రాంతి వేడుకలు తన ఎంపీ ఎన్నికలకు ప్రమోషన్ అవుతాయని జీవీఎల్ భావించారు. కానీ ఈ వేడుకల వల్లే ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. సంక్రాంతి సంబరాలకు SBI-CSR నిధులు వాడటంపై ప్రతిపక్షాలు అభ్యంతరం చెబుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.65 లక్షల రూపాయలను కేటాయించడం ఏంటని సీపీఎం నేతలు ప్రశ్నిస్తున్నారు. CSR నిధులను సమాజ సేవా కార్యక్రమాలకు వాడాలే తప్ప.. ఇలా ఓ బీజేపీ ఎంపీ పలుకుబడి కోసం ఉపయోగించడం కరెక్ట్ కాదంటున్నారు కమ్యూనిస్ట్ లీడర్లు.

కోస్పాన్సర్స్ గా వ్యవహరించిన కొన్ని సంస్థల దగ్గర కూడా GVL లక్షల రూపాయలు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. అయితే జీవీఎల్ టీమ్ మాత్రం కౌంటర్ ఎటాక్ చేస్తోంది. CSR నిధులను సాంస్కృతిక కార్యక్రమాలకు ఇవ్వరాదని ఎక్కడా లేదనీ.. సీపీఎం అనవసర రాద్దాంతం చేస్తోందని అంటోంది. రాజ్యసభ ఎంపీగా యూపీ నుంచి 2018లో GVL నరసింహారావు ఎన్నికయ్యారు. మరో రెండు నెలల్లో పదవీ కాలం ముగుస్తోంది. ఈలోగా విశాఖ బీజేపీ టిక్కెట్ తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కూడా జత కట్టినా.. ఈ టిక్కెట్ డిమాండ్ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇదే వైజాగ్ ఎంపీ స్థానాన్ని బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఆశిస్తున్నారట. అప్పుడు బీజేపీ అధిష్టానం.. ఆమెకే టిక్కెట్టు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విశాఖలో GVL రాజకీయాలను స్థానిక బీజేపీ నేతలు కూడా ఒప్పుకోనట్టు తెలుస్తోంది. ఆయన చేపట్టిన కార్యక్రమాల్లో స్థానిక నేతలెవరూ పాల్గొనడం లేదని అంటున్నారు. సంక్రాంతి వేడుకల నిర్వహణలో GVL మీద వచ్చిన ఆరోపణలపై హై బీజేపీ కమాండ్ కు ఫిర్యాదులు కూడా చేసినట్టు సమాచారం.