ఉన్నదీ పోయింది.. కోరుకున్నదీ పోయింది.. చివరికి సంబంధం లేనిదేదో దక్కింది. మంత్రి జోగి రమేష్ మీద పడుతున్న పొలిటికల్ సెటైర్స్ (Political satires) ఇవి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో (Krishna District) ఏకైక మంత్రిగా ఉన్నారు జోగి రమేష్ (Jogi Ramesh). గత ఎన్నికల్లో పెడన నుంచి జోగి గెలవగా.. ఇప్పుడు అధిష్టానం అక్కడ నుంచి తప్పించింది. పెడనలో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో.. తప్పించారనేది పార్టీ వర్గాల మాట. జోగి కూడా తాను మళ్లీ పెడన నుంచే పోటీ చేస్తా అంటూ మొదట్లో బీరాలు పలికినా.. తర్వాత కొంచెం వెనక్కి తగ్గారు. పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే.. అక్కడ నుంచి బరిలోకి దిగుతాననే పరిస్థితికి వచ్చారు. మొదట్లో ఆయన్ని ఎంపీగా పోటీ చేయించాలని అధిష్టానం భావించిందట. అది కుదరకపోవటంతో ఫైనల్‌గా పెనమలూరును కేటాయించింది. వాస్తవానికి జోగి రమేష్ స్వస్థలం ఇబ్రహీంపట్నం.
ఇది మైలవరం (Mylavaram) నియోజకవర్గం పరిధిలో ఉంది. 2009లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పెడనలో పోటీ చేసి తొలిసారి గెలిచారాయన. 2014లో మాత్రం వైసీపీ అధిష్టానం (YCP leadership) మైలవరం బరిలో దించగా ఓడిపోయారు. దీంతో ఆ స్థానాన్ని వసంత కృష్ణప్రసాద్‌తో (Vasantha Krishnaprasad) భర్తీ చేసిన అధిష్టానం.. తిరిగి 2019లో జోగిని పెడనకు పంపింది. రెండోసారి కూడా పెడన నుంచి గెలిచి బీసీ కోటాలో మంత్రి అయ్యారు జోగి. అయితే మంత్రి అయ్యాక.. అటు పెడనలో, ఇటు మైలవరంలో కూడా ఆయన వర్గం విపరీతమైన జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు వచ్చాయ్. ఇలాంటి పరిస్థితుల్లో.. పెడనలో తిరిగి పోటీ చేస్తే గెలవటవం కష్టమని తేలటంతో అక్కడ టికెట్ లేదనే సంకేతాలను ముందుగానే ఇచ్చేసిందట అధిష్టానం. దీంతో ఆయన తన పాత నియోజకవర్గం మైలవరాన్ని ఇవ్వాలని కోరారట మంత్రి. మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో జోగి వర్గం విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయ్.
జోగి వర్గంతో విభేదిస్తున్న వసంత.. కొన్నాళ్ళపాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు.
సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చిన తర్వాత కానీ.. నియోజకవర్గంలో అడుగుపెట్టలేదు ఆయన. అయితే నెల రోజుల కింద పోటీకి దూరంగా ఉంటానంటూ బాంబు పేల్చారు వసంత. జోగి జోక్యం తగ్గకపోవటంతోనే.. ఆ నిర్ణయం తీసుకున్నారన్నది వసంత వర్గం చెప్పే మాట. అధిష్టానం ఆ బుజ్జగింపుల ప్రక్రియలో ఉండగానే.. మైలవరం ప్రతిపాదన తెచ్చారట జోగి రమేష్. అధిష్టానం మాత్రం మళ్లీ వసంతకే ఈ టికెట్ ఇచ్చేందుకు డిసైడైనట్టు తెలిసింది. ఇక ఎమ్మెల్యే స్థానాలు ఎక్కడా జోగికి అందుబాటులో లేకపోవటంతో.. ఏలూరు నుంచి ఆయన్ని పోటీచేయించాలని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అయితే అదే సమయంలో వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా.. అధిష్టానానికి పెనమలూరు ఖాళీ అయింది.
పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి (Parthasarathy) టీడీపీలో (TDP) కి వెళ్తున్నట్టు సంకేతాలు ఇచ్చేశారు. దీంతో జోగి రమేష్ ఫైనల్‌గా అక్కడ ఫిక్స్ చేసింది పార్టీ అగ్రనాయకత్వం. బీసీ వర్గానికి చెందిన సారధి వెళ్లడంతో.. అదే బీసీ వర్గానికి చెందిన జోగికి టికెట్ ఇస్తూ ఆయన ఎపిసోడ్‌కి ఎండ్ కార్డ్ వేసింది. అసలు ఎంపీ ఇస్తారా, ఎమ్మెల్యే ఇస్తారా.. అది కూడా ఎక్కడ నుంచి ఇస్తారో కూడా క్లారిటీ లేని జోగి వర్గానికి ఎట్టకేలకు అధిష్టానం పెనమలూరును గమ్యస్థానంగా మార్చింది. దీంతో ఇప్పుడు ఉన్నదీ పోయింది, కావాలనుకున్నదీ పోయిందంటూ.. మంత్రి మీద సెటైర్స్ పడుతున్నాయట. చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత మరి!