వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యడం ఓ నిండు ప్రణాన్ని బలి తీసుకుంది. తన మాట వినకుండా వైసీపీకి ఓటు వేసిందని కన్న తల్లినే కడతేర్చాడు ఓ దిక్కుమాలినోడు. అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో జరిగింది ఈ దారుణం. ఎగువపల్లికి చెందిన వడ్డే వెంకటేశులు అనే వ్యక్తి చాలా కాలంగా టీడీపీ కోసం పని చేస్తున్నాడు.
ఈ ఎన్నికల్లో కూటమిని గెలిపించేందుకు కార్యకర్తగా అన్ని పనులూ చేస్తున్నాడు. పోలింగ్ రోజు టీడీపీకి ఓటు వెయ్యాలంటూ తన తల్లి వడ్డే సుంకమ్మకు చెప్పాడు. కానీ సుంకమ్మ మాత్రం ఆ పని చేయలేదు. పెన్షన్లు ఇస్తున్నాడన్న అభిమానంతో వైసీపీకి ఓటు వేసింది. తల్లి వైసీపీకి ఓటు వెయ్యడాన్ని జీర్ణించుకోలేకపోయిన వెంకటేశులు అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో తల్లితో వాగ్వాదానికి దిగాడు. రాక్షసుడిలా మారి తల్లిపై ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. తలపై గాయం బలంగా తగలడంతో సుంకమ్మ అక్కడికక్కడే చనిపోయింది. తాగింది దిగిన తరువాత తాను చేసిన తప్పేంటో వెంకటేశులుకు అర్థమయ్యింది. వెంటనే ఊరు విడిచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. కేసు నమోదు చేసి వెంకటేశులు కోసం గాలిస్తున్నారు. ఇదొక్కటే కాదు.. ఏపీలో ఎన్నికలు చాలా ప్రాంతాల్లో మంటలు పుట్టించారు.
ఇక రాయలసీమ ప్రాంతం ఐతే రగిలిపోతోంది. పల్నాడులో ఏకంగా 144 సెక్షన్ పెట్టి డీఐజీ అధికారి అక్కడే మకాం వేశాడు అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎలక్షన్ అంటే రాష్ట్రాన్ని కాపాడే, అభివృద్ధి చేసే నాయకులను ఎన్నుకోవాలి గానీ ఇలా నాయకుల కోసం కార్యకర్తలు కొట్టుకుచావం ఇప్పుడు సంచలనంగా మారింది. పోలింగ్ ముగిసి 48 గంటలు గడిచినా చాలా ప్రాంతాల్లో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. పోలింగ్ సందర్భంగా ఏపీలో రాజుకున్న ఈ మంటలు ఎప్పుడు చల్లారుతాయో చూడాలి.