తెలంగాణలో గతంలో ఉన్న TS అబ్రిబేషన్ ను TG గా మారుస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు తమ సంస్థలకు TGని యాడ్ చేసుకుంటున్నాయి. TSRTC పేరు కూడా TGSRTC గా మారింది. దీనికి సంబంధించి ఆర్టీసీ లోగో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కానీ అది ఫేక్ అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తేల్చారు. ఆ తర్వాత ఫేక్ లోగో సర్క్యులేషన్ పై పోలీసులకు కంప్లయింట్ కూడా ఇచ్చారు అధికారులు.
ఈ వివాదంలో తెలంగాణ రాష్ట్ర డిజిటల్ మీడియా విభాగం మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ పై కేసు నమోదైంది. ఇతనితో పాటు హరీశ్ రెడ్డి మీదా కేసు ఫైల్ అయింది. వీళ్ళిద్దరూ బీఆర్ఎస్ ఐటీ విభాగంలో కీలకంగా వ్యవహరిస్తారు. నకిలీ లోగో సృష్టించడమే కాకుండా… తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసభ్య పదజాలంతో వీడియోను రూపొందించారని కూడా ఫిర్యాదులో ఆర్టీసీ అధికారులు తెలిపారు.
అయితే ఈ వివాదంలో అసలు ట్విస్ట్ ఇచ్చింది బీఆర్ఎస్. అసలు ఈ ఫేక్ లోగోను షేర్ చేసింది మీరే అంటూ ఓ వీడియోను BRS తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. అందులో రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ స్టేట్ మీడియా గ్రూప్ లో ఓ లోగోకు సంబంధించిన PDF ఫైల్ షేర్ చేసినట్టు ఉంది. TSRTC లోగోను మార్చింది మీరే… రవాణా శాఖా మంత్రి వాట్సాప్ గ్రూపులో షేర్ చేసింది మీరే… మీడియాకు రిలీజ్ చేసింది మీరే… ఆ తర్వాత అక్రమంగా కేసులు పెట్టిందీ మీరే… అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేసింది BRS. వీడియో సాక్ష్యాలతో సహా ట్విట్టర్ లో BRS పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఆర్టీసీతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇరుకున పడింది.