5 యేళ్ళ పాలనలో అధికారం ఇచ్చిన మజా నుంచి జగన్ బయటకు రాలేకపోతున్నారు. వై నాట్ 175 అంటే… జనం మరీ 11 సీట్లే ఇవ్వడంతో… ఎన్నికల్లో ఓటమి సహించలేకపోతున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రభుత్వం మీద పగతో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. అందుకే కూటమి ప్రభుత్వం సాఫీగా సాగనివ్వకుండా చేయడానికి మాజీ సీఎం జగన్ భారీ విధ్వంసానికి ప్లాన్ చేసినట్టు సమాచారం. రాబోయే రోజుల్లో ఏపీలో ధర్నాలు, అల్లర్లు, ఆందోళనలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని ప్లాన్ చేశాడని అంటున్నారు. అందుకోసం నెలకు వంద కోట్లు ఖర్చుపెడుతున్నట్టు సమాచారం.
ఈ విధ్వంసం బాధ్యతలను వైసీపీ నేతలు మిథున్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డికి అప్పగించారని అంటున్నారు. మూడు రోజుల క్రితం జనసేన నేత నాగబాబు కూడా ఇదే ఆరోపణలతో ట్వీట్ చేశారు. నియోజకవర్గానికి 10 కోట్లు చొప్పున… మొత్తం 15 వందల కోట్ల రూపాయలను విధ్వంసానికి జగన్ వాడబోతున్నట్టు నాగబాబు ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టాలని పగటి కలలు కనొద్దు… ఆ 15 వందల కోట్ల రూపాయలను ప్రజా సంక్షేమానికి ఖర్చుపెట్టాలని నాగబాబు ట్వీట్ లో కోరారు. ఆ తర్వాత రెండు రోజులకు ఏపీ హోంమంత్రి అనితను కూడా కలిశారు. జగన్ విధ్వంసం వ్యూహాన్ని ఆమెకు వివరించినట్టు చెబుతున్నారు.
5యేళ్ళ జగన్ పాలనలో వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు పడ్డ చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఈసారి ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ లో తమ సత్తా చాటాలనుకుంటున్నారు. జనానికి అభివృద్ధిని చూపించాలని తాపత్రయపడుతున్నారు. అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టును అనుకున్న టైమ్ లోగా పూర్తి చేయాలని గట్టిగా నిర్ణయించారు. ఇవి రెండూ పూర్తయితే చంద్రబాబు, పవన్ కి ఏపీ జనం జై కొడతారు. దాంతో మళ్ళీ తాను అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదని జగన్ భయపడుతున్నట్టు సమాచారం. నిజంగా విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నారా… లేకపోతే ఇదంతా టీడీపీ మీడియా వక్రీకరణా అన్నది తేలాల్సి ఉంది.