Kethireddy : కేతిరెడ్డి ఓటమితో షాక్ అయ్యా.. ఆయన ఓడిపోవడమేంటి.. ఏదో జరిగింది..

ఏపీలో ఎవరూ ఊహించని ఫలితాలు కనిపించాయ్. 164సీట్లతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితం అయింది.

 

 

ఏపీలో ఎవరూ ఊహించని ఫలితాలు కనిపించాయ్. 164సీట్లతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితం అయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. ఐతే ఎన్నికలకు ముందు ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఏపీలో వైసీపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. కట్‌ చేస్తే సీన్ మొత్తం రివర్స్ అయింది. ఐతే ఇన్నాళ్లకు ఏపీ ఫలితాలపై కేటీఆర్ స్పందించారు. ఓ వైసీపీ ఎమ్మెల్యే ఓటమి తనను అవాక్కయ్యేలా చేసిందని కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించిన కేటీఆర్.. ఏపీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. వైసీపీ ఓటమి ఆశ్చర్యం కలిగించిందన్న కేటీఆర్.. ఓడిపోయినా 40శాతం ఓట్లు రావడం సాధారణ విషయం కాదని అన్నారు.

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓటమిపైనా కేటీఆర్ స్పందించారు. ఎప్పుడూ జనాల్లో ఉండే కేతిరెడ్డి… ధర్మవరంలో ఓడిపోవటం ఏంటో తనకు అర్థం కావడం లేదని.. ఈ ఫలితాలు తనకు షాక్ గురి చేశాయని చెప్పారు. ఒక్క కేటీఆర్‌కే కాదు.. చాలా మంది రాజకీయ విశ్లేషకులకు సైతం ధర్మవరం ఓటర్లు తీర్పు అంతుబట్టలేదు. ఎందుకంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ కేతిరెడ్డి చేపట్టిన కార్యక్రమం ఎంతలా ఫేమస్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంతో… ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యారు. ప్రజల సమస్యలకు స్పాట్ లోనే పరిష్కారం చూపేందుకు ఆయన చేపట్టిన ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరం కేతిరెడ్డికి సోషల్ మీడియాలో ఎక్కడలేని ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది.

దీంతో మూడోసారి ఎమ్మెల్యే కావటం పక్కా అనే ధీమాతో కేతిరెడ్డి ఉండేవారు. ఐతే ఎన్నికల్లో ఆయనకు షాక్ తగిలింది. ఎన్నికలకు కేవలం 40 రోజుల ముందు ధర్మవరం వచ్చిన బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్.. కేతిరెడ్డిపై విజయం సాధించారు. హోరాహోరీ పోరులో కేతిరెడ్డిపై 3వేల 734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత చంద్రబాబు కేబినెట్‌లోనూ చోటు సంపాదించారు. అయితే కేతిరెడ్డి ఓటమికి అవినీతి ఆరోపణలతో పాటు సామాజిక సమీకరణాలు కూడా కారణమయ్యాయని చెప్పొచ్చు. సత్యకుమార్ యాదవ్ బీసీ అభ్యర్థి కావటం.. ధర్మవరం పట్టణంలో బీసీల ఓట్లు అధికంగా ఉండటం కూడా ఆయనకు కలిసి వచ్చింది. ఇవన్నీ పక్కనబెడితే కేతిరెడ్డి ఓటమికి కేటీఆర్ కూడా షాక్ తిన్నానని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.