ఈ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. ఫ్యాన్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 164 సీట్లతో కూటమి ఘనవిజయం సాధిస్తే.. వైసీపీ మాత్రం 11సీట్లకే పరిమితం అయింది. ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడంతో.. జగన్ అసెంబ్లీకి వస్తారా లేదా అనే ప్రశ్నలు వినిపించాయ్. ఐతే ఆయన సభకు వచ్చారు.. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఈసారి విపక్షహోదా లేకపోవడంతో సాధారణ ఎమ్మెల్యేల మాదిరిగానే.. అసెంబ్లీ ప్రాంగణం బయటే కారు ఉంచి లోపలికి నడుచుకుని వస్తారని అంతా అనుకున్నారు. ఐతే ప్రభుత్వ అనుమతితో సొంత కారులో అసెంబ్లీ లోపలికి వచ్చారు జగన్. ఆ సమయంలో కారును నేరుగా పంపకుండా అనుమతుల కోసం పోలీసులు ఆపారు. ఆ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు, నేతలు జగన్ మామయ్యా, బైబై జగన్ అని నినాదాలు చేస్తూ కనిపించారు.
ఐతే జగన్ ఇవేమీ పట్టించుకోకుండా… ఎప్పటిలాగే కారులో నుంచే దణ్ణం పెట్టుకుని వెళ్లిపోయారు. అప్పటికే అసెంబ్లీలో జగన్‌కు సాధారణ ఎమ్మెల్యే తరహాలో కాకుండా మాజీ సీఎంలా పరిగణించాలని… సీఎం, మంత్రుల తర్వాత ప్రమాణం చేసే అవకాశం ఇవ్వాలని వైసీపీ కోరడంతో చంద్రబాబు సరేనన్నారు. దీంతో జగన్ నేరుగా అసెంబ్లీకి రావడం, సీఎం, మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. అసెంబ్లీలో ఎడమచేతివైపు మూలన బీజేపీ తర్వాత సీట్లలో వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చున్న జగన్.. తన పేరు పిలవగానే వచ్చి ప్రమాణస్వీకారం చేశారు.
ప్రమాణం కోసం నడిచి వస్తున్న సమయంలో సభలో ఎమ్మెల్యేలు, చంద్రబాబుకు నమస్కారాలు పెట్టుకుంటూ వెళ్లారు. అయితే అధికార కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ ఆయన నమస్కారానికి స్పందించలేదు. చంద్రబాబు మాత్రం ప్రతి నమస్కారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసే సమయంలో జగన్ తన పూర్తి పేరు చదివేందుకు తడబడ్డారు. జగన్ మోహన్ అనే నేను అని చెప్పాక తిరిగి జగన్ మోహన్ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణం పూర్తి చేశారు. ఆ వెంటనే అసెంబ్లీలో ఒక్క క్షణం కూడా ఆగకుండా బయటికి వెళ్లిపోయారు జగన్. అసెంబ్లీ లాబీల్లో నుంచి వైసీఎల్పీకి వెళ్లిన జగన్.. అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.