విజయవాడ కోసం రంగంలోకి ఇండియన్‌ ఆర్మీ

బుడమేరు వరద ఉధృతి విజయవాడను ముంచెత్తింది. దాదాపు వారం నుంచి విజయవాడలోని చాలా ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - September 6, 2024 / 05:44 PM IST

బుడమేరు వరద ఉధృతి విజయవాడను ముంచెత్తింది. దాదాపు వారం నుంచి విజయవాడలోని చాలా ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. వారం తరువాత కాస్త వరద ప్రవాహం తగ్గినట్టు కనిపించినా.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మరోసారి వరద ప్రవాహం పెరిగింది. దీంతో మరో ప్రమాదం తప్పదని గ్రహించిన ప్రభుత్వం వెంటనే బుడమేరు గండ్లు పూడ్చే కార్యక్రమం మొదలు పెట్టింది. ఇందు కోసం ఇండియన్‌ ఆర్మీని కూడా రంగంలోకి దింపింది. సీఎం చంద్రబాబు అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 40 మంది ఆర్మీ ఇంజనీర్ల బృందాన్ని పంపించింది. అవసరమైతే మరింత మంది ఆర్మీ ఇంజనీర్ల బృందం ఏపీకి రానుంది. హైదరాబాద్ నుంచి 40 మంది ఆర్మీ ఇంజనీరింగ్ బృందం ప్రత్యేక విమానంలో గండిపడిన ప్రాంతానికి ఆర్మీ ఇంజనీర్ల బృందం చేరుకుంది. ప్రస్తుతం పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీతో కలిసి ఆర్మీ బృందం బుడమేరు గండ్లు పూడ్చే పనుల్లో నిమగ్నమైంది. వరద ప్రవాహం ఇంకాస్త పెరగకముందే మూడో గండిని కూడా పూడ్చేందుకు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇక చంద్రబాబు ఆదేశంతో మంత్రి నిమ్మల బుడమేరు పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వర్షంలో కూడా అక్కడే ఉండి పనులు పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు చంద్రబాబు, లోకేష్‌కు అప్‌డేట్స్‌ ఇస్తున్నారు. వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు విజయవాడలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్ల సాయంతో సాహాయక చర్యలు చేపడుతున్నారు.