ఏపీలో ఈసారి ఎన్నికలు క్రైమ్‌థ్రిల్లర్‌ను తలపించాయ్. టఫ్ ఫైట్ ఉంటుంది అనుకుంటే వార్ వన్‌సైడ్ అన్నట్లు ఓటర్లు తీర్పునిచ్చారు. గత ఎన్నికల్లో 151 సీట్లతో అధికారం చేపట్టిన వైసీపీ.. ఈసారి 11 స్థానాలకే పరిమితమై కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. కట్ చేస్తే అసెంబ్లీ మొదలైంది. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం కూడా అయిపోయింది. మాజీ సీఎం జగన్ ఇలా ప్రమాణం చేసి.. అలా అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. అసెంబ్లీ నుంచి డైరెక్ట్ పులివెందుల వెళ్లి.. అక్కడ మూడు రోజులు స్టే చేసి.. అక్కడి నుంచి బెంగళూరు వెళ్లారు. బెంగళూరు వెళ్లిన జగన్.. అక్కడి నుంచి ఏపీ స్పీకర్‌కు ఓ లేఖ రాశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ విన్నపాలు వినిపించారు.
ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది. అసెంబ్లీకి అలా వచ్చి ఇలా వెళ్లిపోయావ్.. ప్రతిపక్ష హోదా ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్ అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తుంటే.. రూల్స్ తెలియవా, ఏం మాట్లాడుతున్నావ్ అంటూ మరికొందరు నిలదీస్తున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే.. సభలోని మొత్తం సీట్లలో పొలిటికల్ పార్టీకి కనీసం పది శాతం సభ్యులు ఉండాలి. అప్పుడే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా.. వారి నాయకుడికి ప్రతిపక్షనేత హోదా దక్కుతుంది. సభలో సభా నాయకుడిగా ఉన్న సీఎం తర్వాత.. ప్రతిపక్ష నాయకుడికి కూడా అంతటి గౌరవ మర్యాదలు లభిస్తాయ్. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయ్. ఈ లెక్కన కనీసం 18 సీట్లు వచ్చి ఉండాలి.
ఐతే వైసీపీ గెలిచింది మాత్రం 11 స్థానాల్లో మాత్రమే. అంటే వైసీపీకి పదోవంతు కూడా రాలేదన్నమాట. అందుకే ప్రతిపక్ష హోదా దక్కలేదు. నిజానికి ఈ విషయం కూడా జగన్‌కు తెలుసు. అందుకే అసెంబ్లీ ప్రమాణస్వీకారం తర్వాత.. సైలెంట్‌గా వెళ్లిపోయారు. ఐతే ఇప్పుడు మాత్రం తమకు ప్రతిపక్ష హోదా ఉంటుందని.. హోదా ఇవ్వాలని స్పీకర్‌కు జగన్ లేఖ రాయడం.. ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదంతా వదిలేస్తే.. జగన్‌కు నిజంగా అభ్యంతరాలు ఉంటే.. ప్రమాణస్వీకారం చేసిన రోజే తనకు అవకాశం ఇవ్వాలని కోరితే బాగుండేది. అది జరగలేదు. ఇప్పుడు బెంగళూరు వెళ్లాక గుర్తొచ్చిందా అంటూ టీడీపీ శ్రేణులు విమర్శలు ఎక్కిపెడుతున్నాయ్. ఇక స్పీకర్ పైనే విమర్శలు చేస్తూ… స్పీకర్‌నే ప్రతిపక్ష అడగడం చూసి ప్రతీ ఒక్కరు అవాక్కవుతున్న పరిస్థితి.