PAVAN KALYAN : పవన్ కళ్యాణ్ నాన్ సీరియస్ గా ఉన్నాడా? ఎక్కడో తేడా కొడుతోంది !

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) పట్టుమని నెల రోజులు కూడా లేవు. ఒక వైపు వైసీపీ (YCP) అధినేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ప్రచారంలో దూసుకుపోతున్నారు. సిద్ధం సభలు పూర్తిచేసి... బస్సు యాత్రతో మేమంతా సిద్ధమంటూ నియోజకవర్గాలన్నీ చుట్టేస్తున్నాడు. 74 ఏళ్ళ చంద్రబాబు (Chandrababu) రోజుకి మూడు సభలు పెట్టి... 44 డిగ్రీలు ఎండలో కూడా అవిశ్రాంతంగా కష్టపడుతున్నాడు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) పట్టుమని నెల రోజులు కూడా లేవు. ఒక వైపు వైసీపీ (YCP) అధినేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ప్రచారంలో దూసుకుపోతున్నారు. సిద్ధం సభలు పూర్తిచేసి… బస్సు యాత్రతో మేమంతా సిద్ధమంటూ నియోజకవర్గాలన్నీ చుట్టేస్తున్నాడు. 74 ఏళ్ళ చంద్రబాబు (Chandrababu) రోజుకి మూడు సభలు పెట్టి… 44 డిగ్రీలు ఎండలో కూడా అవిశ్రాంతంగా కష్టపడుతున్నాడు. అటు కేంద్రంలో నరేంద్ర మోడీ (Narendra Mod) అయితే రోజుకి మూడు రాష్ట్రాలు చుట్టేస్తూ… ఎండా వానా లెక్కచేయకుండా జనంలో తిరుగుతూ… ఎక్కడ లేని ఉత్సాహంతో రెట్టించిన శక్తితో… ప్రతిపక్షాల్ని మాటలతో ఆడుకుంటున్నాడు. ఇంత హడావుడి జరుగుతుంటే… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం చాలా నిర్లిప్తంగా… నిరుత్సాహంగా రోజులు నెట్టుకొస్తున్నారు. నెలరోజుల క్రితం ఆయనలో కనిపించిన ఉత్సాహం ఇప్పుడు లేదు. పొత్తులు కలపడంలో చూపించిన వేగం… ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియడం లేదు.

పిడికిళ్ళు బిగించి జగన్ ని హెచ్చరించిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఎందుకో నిశ్శబ్దంగా అయిపోయారు. కొన్ని రోజులుగా ఆయన్ని జ్వరం వెంటాడుతోందని… వెన్ను నొప్పితో బాధపడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ వాటి కంటే సీట్ల సర్దుబాటు పవన్ కళ్యాణ్ లో ఉత్సాహాన్ని చంపేసిందని అర్థమవుతుంది. 21 సీట్లకు తనను తాను కుదించుకొని అటు పార్టీలోనూ, ఇటు కాపు సామాజిక వర్గంలోనూ తీవ్రమైన నిరాశ నిస్పృహలను నింపేసిన పవన్…. మూడు పార్టీల మధ్య సమన్వయం చేయలేక దిగాలు పడ్డారా అనే సందేహం రాక మానదు. పిఠాపురం ప్రచారానికి వెళ్లి జ్వరం పడి హైదరాబాద్ తిరిగి వచ్చారు. అనకాపల్లి ప్రచారానికి వెళ్లి జ్వరం పెరగడంతో మళ్లీ హైదరాబాద్ తిరిగి వచ్చారు.

గడచిన 20 రోజుల్లో పవన్ కళ్యాణ్ నుంచి ఒక గట్టి ప్రసంగం గానీ… ఉద్వేగ భరితమైన స్పీచ్ గానీ రాలేదు. ఎందుకో ఆయన చాలా నిర్లిప్తంగా ఉంటున్నారని సన్నిహిత నాయకులు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ తీరే అంత. ఆట ప్రారంభంలో చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆట మధ్యలో నీరసపడిపోతారు. ఏదో ఒక సాకుతో హిట్ వికెట్ చేసి ఆట నుంచి తప్పుకుంటాడు. ఇది ఆయనకు అలవాటే అని ఆయన సన్నిహిత మిత్రుడు ఒకరు పొలిటికల్ సర్కిల్స్ లో చేసిన కామెంట్ ఇప్పుడు బాగా తిరుగుతోంది.

పవన్ కళ్యాణ్ ఎందుకు నిర్లిప్తంగా ఉన్నారు..? అది కేవలం ఆరోగ్య సమస్యా? లేక ఆర్థిక సమస్యలా? అనుకున్నన్ని సీట్లు సాధించుకోలేకపోవడం వల్ల వచ్చిన నిరుత్సాహమా? మిగిలిన రెండు పార్టీలతో సరిగ్గా సమన్వయం లేకపోవడమా… కారణం ఏంటన్నది ఇతిమిద్దంగా తేలడం లేదు. మొత్తానికి జనసేనాని మాత్రం ఎందుకో చాలా స్లో అయిపోయారు. 21 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే విషయంలో కూడా… నిన్నా మొన్నటి వరకు కిందా మీదా పడుతూనే ఉన్నారు. దీనికి తోడు జనసేన నాయకుల్లో సీట్లు రాని వాళ్ళ అసంతృప్తి, 21 సీట్లకే పరిమితం అయిపోవడంపై కాపుల్లో అసహనం, ఆవేదన… ఇవి రెండూ పవన్ ని బాగా నిరుత్సాహ పరుస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన ప్రభావం రాష్ట్రంలో కనీసం 80 నియోజకవర్గాల్లో బలంగా ఉంటుంది. అక్కడ పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే ఎంతో కొంత ఇంపాక్ట్ కచ్చితంగా ఉంటుంది. ఈ విషయంలో జనసేన అభ్యర్థుల కంటే టీడీపీ అభ్యర్థులే పవన్ కళ్యాణ్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈయన మాత్రం ఒక రోజు బయటకు వస్తే… మూడు రోజులు హైదరాబాదులో ఇంటికి పరిమితం అవుతున్నారు.

ఇదే విషయం అటు కార్యకర్తలని అభిమానుల్ని వేధిస్తోంది. పవన్ కళ్యాణ్ వేరే ఆలోచనలో పడ్డారా? ఈ మాత్రం 21 సీట్లు కోసం తాను ఎందుకింత కష్టపడాలి అనే భావంలో ఉన్నారా? లేక కూటమి గెలవదేమో అని రాంగ్ సిగ్నల్స్ ఏమైనా పవన్ కు అందుతున్నాయా? అందుకే ఆయన డీలా పడ్డారా? ఇలా రకరకాలుగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చలు నడుస్తున్నాయి. కొందరైతే బాహటంగానే కామెంట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రొఫెషనల్ పొలిటిషియన్స్. వాళ్లు రేయింబవళ్లు కష్టపడగలరు. ఎండనక… వాననక తిరగ గలరు. కానీ పవన్ కళ్యాణ్ ఒక సినిమా స్టార్. కారవాన్ లో సుఖంగా ఉండే బాయిలర్ కోడి పెట్టలంటోడు. ఆయన ఈ ఎండలకి ఏం తిరగగలుగుతాడు? ఆ 21 స్థానాల్లో ప్రచారం చేస్తే అదే చాలా గొప్ప… అని బాహాటంగానే మాట్లాడుతున్నారు. వీటన్నిటిని అధిగమించి పవన్ కళ్యాణ్ ఒక పది రోజులపాటు రాష్ట్రం మొత్తాన్ని చుట్టేస్తే తప్ప క్యాడర్లోను, కూటమి నాయకుల్లోను జోష్ రాదు.