Chandrababu : ఆ ఒక్కటి ఆయన కోసమేనా.. చంద్రబాబు టీమ్‌లో చేరేదెవరు ?

ఆ ఒక్కటి ఎవరికి.. ఇప్పుడు ఏపీ రాజకీయాలను (AP Politics) వెంటాడుతున్న ప్రశ్న ఇది. చంద్రబాబు (Chandrababu) తో పాటు 24మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

 

 

ఆ ఒక్కటి ఎవరికి.. ఇప్పుడు ఏపీ రాజకీయాలను (AP Politics) వెంటాడుతున్న ప్రశ్న ఇది. చంద్రబాబు (Chandrababu) తో పాటు 24మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పొత్తులో భాగంగా జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ (BJP) నుంచి ఒకరికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. జనసేన నుంచి పవన్‌, నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేష్‌కు అవకాశం దక్కగా.. బీజేపీ నుంచి ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్‌కు చాన్స్ వచ్చింది. ఐతే ఇప్పుడు చంద్రబాబు టీమ్‌లో ఓ మంత్రి పదవి ఖాళీగా ఉంది. దీంతో ఆ ఒక్కటి ఎవరికి అనే చర్చ ఆసక్తికరంగా మారింది. ఏపీ అసెంబ్లీలో మొత్తం 175మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ లెక్కను చూస్తే 25మందికి కేబినెట్‌లో అవకాశం కల్పించొచ్చు. ప్రతీ ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఉంటుందన్నమాట. టీడీపీకి 135మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

దీంతో సీఎం సహా 21మంత్రి పదవులు కేటాయించారు. జనసేన (Janasena) పార్టీకి 21మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో వారికి మూడు మంత్రి పదవులు. బీజేపీకి 8మంది ఉండటంతో ఒక మంత్రి పదవి ఇచ్చారనే లెక్కలు కూడా ఉన్నాయ్. మరి ఖాళీగా ఉన్న పదవి ఎవరికి దక్కబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. మిత్రపక్షం అయిన బీజేపీకి ఇస్తారా.. టీడీపీలోనే ఎవరికి అవకాశం కల్పిస్తారా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఈ ఒక్క స్థానం కోసం.. పోటీ భారీగా కనిపిస్తోంది. తమకే అవకాశం ఇవ్వాలంటూ.. కొన్ని గొంతుకలు బలంగా వినిపిస్తున్నాయ్ కూడా ! దీంతో ఇప్పుడు రకరకాల ఈక్వేషన్స్, పేర్లు తెరమీదకు వస్తున్నాయ్. పిఠాపురంలో పవన్ గెలుపునకు కృష్టి చేసిన వర్మకి ఎమ్మెల్సీ ఇచ్చి.. హామీ ప్రకారం మంత్రిని చేస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది. లెక్క ప్రకారం.. బీజేపీలో మరొకరికి మంత్రి పదవి ఇవ్వాలి కాబట్టి.. సుజనా చౌదరికి అవకాశం కల్పిస్తారా అనే చర్చ జరుగుతోంది. ఐతే కొత్తగా వచ్చిన వారికి కాకుండా.. ముందు నుంచి పార్టీని నమ్ముకున్న నేతలకు అవకాశం కల్పించాలని ఇప్పటికే కమలం పార్టీలో ఓ డిమాండ్ మొదలైంది.

సుజనా చౌదరితో పాటు రకరకాల పేర్లు తెరమీదకు వస్తున్నాయ్. కామినేని శ్రీనివాస్‌తో పాటు విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయ్. సుజనా చౌదరికి ఇస్తే.. కమ్మ సామాజికవర్గం నుంచి నలుగురు మంత్రులుగా ఉంటారు. ఆదినారాయణరెడ్డికి ఇచ్చినా.. చంద్రబాబు కేబినెట్‌లో నలుగురు రెడ్డిలు అవుతారు. ఐతే ఇక జనసేన నుంచి కూడా ఖాళీగా ఉన్న మంత్రి పదవి కోసం పోటీ కనిపిస్తోంది. అటు బీజేపీ, ఇటు జనసేన నుంచి మంత్రి పదవి విషయంలో ఒత్తిడి వస్తుండడంతో.. ఆ రెండు పార్టీలను కాదని టీడీపీకి చెందిన వారికే ఆ మంత్రి పదవి కేటాయిస్తారా అనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే.. ఎవరికి ఆ పదవి దక్కుతుందనే చర్చ మొదలైంది.

జగన్‌ మీద కోపంతో.. పదవి మీద ఆకలితో ఉన్న ఉండి ఎమ్మెల్యే రఘురామకు మంత్రి పదవి దక్కుతుందా లేదా అనే డిస్కషన్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆయన డిమాండ్లు కూడా మొదలుపెట్టారు. క్షత్రియులు ఓటర్లు కాదా.. వాళ్లు ఓటు వేయలేదా.. తనకెందుకు మంత్రి పదవి ఇవ్వరంటూ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. వీళ్లందరినీ కాదని.. మంత్రి పదవి ఆశించి భంగపడిన కన్నా లక్ష్మీనారాయణకు పదవి కట్టబెడతారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయ్. ఏమైనా ఆ ఒక్క పదవి మాత్రం.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఎవరికి దక్కబోతుందనే బెట్టింగ్‌లు కూడా మొదలయ్యాయ్‌..